సమాజంలో సేవాభావంతో పనిచేసేవారు ఎందరో ఉన్నారు.ఒక్కొక్కరు ఒక్కో తరహాలో స్పందిస్తుంటారు. ఈ చారుబాల బారిక్ కూడా అదే కోవలో మనిషి. తన గ్రామ ప్రజలకు ఏ చిన్నకష్టమొచ్చినా స్పందిస్తుంది. వెంటనే తానున్నానని అండగా నిలబడుతోంది.
ఒడిశాకు చెందిన చారుబాలను దీపా అని కూడా పిలుస్తారు. ఏ సమస్యనైనా ఒక్క ట్వీట్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా పనిచేస్తుంది. ఇలా ఇప్పటివరకు కొన్ని వేల సమస్యల్ని పరిష్కరించి గ్రామ ప్రజల దృష్టిలో దేవతగా నిలిచింది. అక్కడి వారంతా ఈ చారుబాలను ‘ట్విట్టర్ గర్ల్’ అని ముద్దుగా పిలుస్తుంటారు.
పెరిగి పెద్దయ్యే క్రమంలో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని లక్ష్యం గా పెట్టుకుంటారు. మరికొందరు ప్రజల ఇబ్బందులకు స్పందిస్తూ .. సమాజ సేవలోనే సంతృప్తిని పొందుతుంటారు. చారుబాల రెండో కోవకు చెందిన యువతి. ఈమెది ఒడిశాలోని తెమ్రి గ్రామం.
చిన్న వయసు నుంచే సమాజ సేవ అంటే ఎంతో ఇష్టపడేది చారు బాల. ఆమె తండ్రి రైతు.. తల్లి అంగన్ వాడీ కార్యకర్త. పాఠశాల దశ నుంచే ఇతరులకు సహాయపడడంలో ముందుండే తమ కూతురిని చూసి తల్లిదండ్రులు సంతోష పడేవారు. ఈ క్రమంలో వివిధ రకాల బహుమతులిస్తూ ఆమెను ఉత్సహపరిచేవారు.
అలా 2019లో తమ తల్లిదండ్రుల నుంచి ఓ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా అందుకుంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. మెల్లగా ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా వేదికల గురించి అవగాహన పెంచుకుంది. ఈ క్రమంలోనే దీన్ని ఉపయోగించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చింది బాలాకు.
అయితే ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే.. అందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన తప్పనిసరి.పథకాలపై అవగాహన పెంచుకోవడం కోసం కొద్దీ కాలం శ్రమ పడింది. అదే సమయంలో ఒడిశా ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 5T Model (పారదర్శకత, బృంద కృషి, సాంకేతికత, సమయపాలన.. వంటి అంశాల్ని ఉపయోగించి ప్రజా జీవితాల్లో మార్పు తీసుకురావడం.. ) గురించి ఆమె తెలుసుకుంది.
అలాగే దీనికి అనుసంధానంగా మొదలైన My Government Initiative (అధికారుల నుంచి అందుతోన్న సేవల గురించి ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి రూపొందించిన కార్యక్రమం) గురించి అవగాహన పెంచుకుంది.ఇక అక్కడనుంచి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. అలా అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లేది. వృద్ధాప్య పింఛన్లు మంజూరులో అక్రమాల నుంచి, ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ సమస్యల వరకు ఎన్నో ట్వీట్లు అధికారుల దృష్టిని ఆకర్షించి సమస్యలను పరిష్కరించాయి.
వృద్ధులకు పింఛను సకాలంలో అందేలా చూడడం.. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ఓ నీడను కల్పించే అంశం వరకు ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది. ఈ క్రమంలోనే పక్క గ్రామానికి చెందిన ఓ ఇల్లాలు తన భర్తను కోల్పోయి ఐదుగురు పిల్లలతో రోడ్డున పడింది. ఈ సమస్యను ఆమె బాలా తో పంచుకోగా.. ట్విట్టర్ వేదికగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందామె. ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజుల్లోనే ఆ పిల్లలకు ‘ఆశీర్వాద్ యోజన’ కింద తలా రూ. 1500 చొప్పున అందించింది.
ఇలా ఇప్పటిదాకా మూడు వేలకు పైగానే ప్రజా సమస్యల్ని పరిష్కరించిందీ ట్విట్టర్ గర్ల్. రోజూ న్యూస్ పేపర్ చదువుతూ సమస్యలు తెలుసుకుంటుంది. సమీప గ్రామాల్లో పర్యటిస్తుంది. బాలా సేవలకు గుర్తింపుగా ప్రముఖుల ప్రశంసలే కాదు.. పలు అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. ప్రస్తుతం సైన్స్ విభాగంలో మాస్టర్స్ చదువుతోన్న చారుబాల భవిష్యత్తులో ప్రొఫెసర్ గా పనిచేయాలని అనుకుంటోంది. సమాజ సేవలోనే సంతోషం, సంతృప్తి దాగున్నాయని బాలా చెబుతోంది.ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. కుడోస్ చారుబాల .