ఘనమైన చరిత్ర “మోటుపల్లి రేవు” ది !

Sharing is Caring...

The former naval base

మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి.

ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి ఈ మోటుపల్లిది. కానీ ఇపుడు ఆ జాడలు ఏమీ కనిపించవు. చరిత్ర గురించి చెప్పేవాళ్ళు లేరు.

చిన్నగంజాం మండలంలోని ఈ చిన్న గ్రామం ఒకనాడు మహావైభవంతో విరాజిల్లింది. కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ఒక సామాన్య కుగ్రామంగా మిగిలిపోయింది. ప్రస్తుతం అక్కడ కనిపించే దేవాలయాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తాయి. అదేవిధంగా క్రీ.శ.2వ శతాబ్దం నాటి కాకతీయుల, రెడ్డిరాజుల అభయశాసనాలు నాటి వాణిజ్య వైభవాన్ని చాటి చెబుతాయి.

ఈ మోటుపల్లి గ్రామానికి ఒకప్పుడు మైసోలియా, మసాలియా, ముకుళపురం, మౌసలపురం వంటి పేర్లుండేవని గ్రీకు నావికుడు హిస్టాలిన్ తన రచనల్లో రాసాడని అంటారు. అదేవిధంగా ఈ గ్రామాన్ని వ్రేలా నగరంగాను, దేశ్యూయకొండ పట్టణంగాను కూడా ఒకనాడు పిలిచేవారు.

ఇక్కడ బౌద్ధం ఎంతో ప్రసిద్ధి చెంది బౌద్ధాలయాలకు ఈ మోటుపల్లి ఆవాసంగా ఉండేది. అయితే అనంతర కాలంలో ఇక్కడ శైవం ప్రాచుర్యంలోకి వచ్చి ఇది శైవక్షేత్రంగా మారిపోయింది. మోటుపల్లి గ్రామంలో లభించిన క్రీ.శ. 1244-45 సంవత్సరానికి చెందిన శాసనాన్ని బట్టి చూస్తే కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఇక్కడ వీరభద్రస్వామి దేవస్థానం నిర్మించినట్లుగా స్పష్టమవుతుంది.

అదేవిధంగా రుద్రమదేవి కాలంలో ఇక్కడ ఓడరేవును అభివృద్ధి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక ఇక్కడ లభించిన కాకతి గణపతి దేవుడి శాసనం అతి పెద్దదిగా మనకు కనిపిస్తుంది.పెద్ద రాతి స్థంభంపై నాలుగు వైపులా 178 పాదాలతో ఈ శాసనం లిఖించారు.

ఈ శాసనంలోనే వ్యాపారానికి సంబంధించిన సుంకాలు, అనేక ఇతర విషయాలను ప్రస్తావించారు. ఈ ప్రాంతాన్ని క్రీ.శ. 1145వ శతాబ్దంలో గోకరాజు రామన్న పాలించారు. కాకతీయుల తర్వాత రెడ్డి రాజుల పాలనలో ఈ ప్రాంతం ఉందనే ఆధారాలున్నాయి.

ప్రోలయ వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి ఇక్కడి ఓడరేవు రక్షణకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. 1280నాటి అనపోతారెడ్డి శాసనంలో సుంకాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది.అనవేమారెడ్డి మరణించిన తర్వాత మోటుపల్లి విజయనగర రాజుల పాలనలోకి వెళ్లగా, రెండవ హరిహర రాయలు కుమారుడు హరిహర రాయ కుమార దేవరాయలు క్రీ.శ. 1312లో ఇక్కడ ఒక శాసనాన్ని వేయించాడు.

క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచే ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాలతో వర్తక వ్యాపారాలు జరిగేవి. ఆ రోజుల్లోనే వారానికి సుమారు కోటి వరహాల వ్యాపారం జరిగేదంటే ఆశ్చర్యం కలుగకమానదు.ఇక్కడ తవ్వకాల్లో అనేక బౌద్ధ సంబంధమైన వస్తువులు బయటపడ్డాయి. గ్రామానికి తూర్పుదిశలో ఉన్న బౌద్ధమత స్థలం ఆనాడు ఇక్కడ బౌద్ధం వెలుగొందింది అనటానికి నిదర్శనం.

అదేవిధంగాఇక్కడ పెద్ద వృత్తాకారంలో 200 అడుగుల విస్తీర్ణం, 12 అడుగుల ఎత్తులో ఉండే మట్టిదిబ్బను గ్రామస్తులు కాసుల దిబ్బగా పిలుస్తుంటారు. ఒకనాడు ఇక్కడ బయటపడిన బౌద్ధస్థూపం క్రీ.శ.11వ శతాబ్దం తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది.

అనంతర కాలంలో ఇక్కడ వీరభద్రస్వామి దేవస్థానం, కోదండరామస్వామి దేవాలయం మొదలైన నిర్మాణాలు జరిగాయి. ఇక ఇక్కడ పెద్ద పెద్ద ఇటుకలు, ద్వారాలు, ఒంటిరెక్క తలుపులు, సున్నం దిమ్మెలు, కొయ్యదూలాలు మొదలైన వాటితో ఆనాడు వ్యాపార కేంద్రానికి అవసరమైన గృహాల నిర్మాణం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మోటుపల్లిలో చోళరాజులకు సంబంధించిన నాణేలు కూడా లభ్యమయ్యాయి.

ప్రస్తుతం మోటుపల్లి వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు.బస్సు సౌకర్యం లేదు. సముద్రం వద్ద జాలర్లు తప్పితే మరెవరూ కనిపించరు. ఇక్కడ కనీసం టీ, మంచి నీళ్లు కూడా దొరకవు. సొంత వాహనం లేనిదే వెళ్లలేం.

—KNM

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూవీరత్నం April 4, 2022
error: Content is protected !!