An acclaimed film ……………………
కాశ్మీర్ ఫైల్స్ … 2022 లో దేశ వ్యాప్తంగా అందరి నోళ్ళలోనానిన సినిమా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీ మరింత పాపులర్ అయింది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమా చూస్తూ ఒక మహిళ డైరెక్టర్ వివేక్ పాదాల పై పడి సినిమా గురించి తన మనసులో మాటను తెలియ జేస్తూ బిగ్గరగా ఏడ్చే వీడియో వైరల్ కూడా అయింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి .. అందరిని కదిలించిన సినిమా ఇదే కావడం విశేషం.
ఎందరి మనసులనో కదిలించి.. కన్నీళ్లు పెట్టించిన సినిమా. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే విజయ పధంలో దూసుకుపోయిన సినిమా. ఇదేదో ప్రేక్షకుల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్లే రొమాన్స్ మూవీ కాదు .
రెండర్ధాల మాటలు, పాటలు, ఫైట్లు, భారీ సెట్టింగులు సెక్స్ సన్నివేశాలతో వండివార్చిన వాణిజ్య చిత్రం కాదు. మరేమిటీ సినిమా ? ఏముంది ఈ సినిమాలో ? గుండె తడి ఉంది. తడి ఆరని గాయాలున్నాయి. లక్షల మంది మూగ హృదయాల వేదన ఉంది. రోదనలున్నాయి.
అందుకే సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు.వాస్తవ గాథలను తెరకెక్కిస్తున్నామని చెబుతూనే చాలామంది దర్శక నిర్మాతలు లిబర్టీ తీసుకుంటారు.
పెద్ద హీరో సినిమా కాబట్టి అసలు కథకు మార్పులు చేశామని చెబుతూనే చరిత్ర వక్రీకరణకు పాల్పడుతుంటారు. కమర్షియల్ గా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో సహజత్వానికి దూరంగా సినిమాలు తీస్తుంటారు.
కానీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం అందుకు భిన్నమైంది. వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేసే రొటీన్ బాలీవుడ్ సినిమా కాదిది. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్స్ పై ఎలాంటి దారుణ మారణకాండ చోటు చేసుకుందో కళ్ళకు కట్టినట్టు చూపిన చిత్రమిది.
ఎన్నో అవరోధాలను దాటుకుని థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జనం నీరాజనాలు పట్టారు. కొందరు థియేటర్లలోనే ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
1990లో కాశ్మీర్ లోయలోని పండిట్ల కుటుంబాలపై ఒక వర్గానికి చెందిన ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. అడ్డగించిన వారి ఆస్తులను దోచుకున్నారు, ఎదురు తిరిగిన వారిని చంపేశారు. తుపాకులు, కత్తులతో దారుణంగా మహిళలను వివస్త్రలుగా చేశారు.
సామూహిక మానభంగానికి పాల్పడ్డారు. కాశ్మీర్ లోయలో ఉండాలంటే మతం మారాలని.. లేదంటే చంపేస్తామని మగవాళ్ళను బెదిరించారు.దాడులు చేశారు. అప్పటి వరకూ పక్కపక్కనే కలిసి మెలిసి ఉన్న ఒక వర్గం వారు కూడా ఉగ్రవాదులతో చేతులు కలిపి అకృత్యాలకు పాల్పడ్డారు. పర్యవసానంగా దాదాపు ఐదు లక్షలమంది కాశ్మీరీ పండిట్స్ స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోయారు.
ఈ సినిమా ద్వారా మూడు దశాబ్దాల క్రితం కాశ్మీర్ లోయలో అసలేం జరిగిందనే విషయాన్నీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఆనాటి దారుణాలను అలా తెర మీద చూపిస్తుంటే కన్నుల వెంట ధారగా నీరు కారడం ఖాయం.
ఈ ముష్కరులను ఏం చేయలేకపోయామే అనే ఆవేశంతో పిడికిళ్ళు బిగుసుకోవడం సహజం. సినిమా చూస్తుంటే అలాంటి ఉద్వేగానికి గురవుతుంటాం. ఉద్రేకానికి లోనవుతాం. ముఖ్యంగా అనుపమ్‌ఖేర్ పాత్ర పలికే ఒక్కో డైలాగ్ ప్రేక్షకుల గుండెను తాకుతాయి. కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
ఆ కాలంలో రాజకీయ నాయకులు, మీడియా.. శకుని పాత్ర పోషించి చరిత్రను ఎలా వక్రీకరించిందో చాలా సన్నివేశాల్లో స్పష్టంగా చూపించాడంటూ విమర్శకులు సైతం దర్శకుడిని ప్రశంసించారు.
ఇక ఈ సినిమాలో చెప్పుకొని తీరాల్సింది కెమెరా పనితనం. కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అన్న విషయం రుజువు చేసేలా ఎన్నో అందాల్ని కెమెరాతో బంధించారు.నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఈ సినిమా ద్వారా కొందరు పాత గాయాలను రేపడం ఎంతవరకూ సమంజసం అనే విమర్శలు ఉన్నాయి. చరిత్రలో జరిగిన చేదు సంఘటనలను కప్పిపుచ్చి, ఏమీ జరగనట్టుగా వ్యవహరించడం వ్యక్తులకే కాదు ఏ జాతికీ మంచిది కాదనే వాదనలు ఉన్నాయి.
ఆర్టికల్ 370ని కేంద్రం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించేవారికి వారికి సినిమా చూస్తే బోలెడన్ని సమాధానాలు లభిస్తాయి.పచ్చి నిజాలను తెరకెక్కించిన వివేక్ అగ్రిహోత్రిని ప్రత్యేకంగా అభినందించాలి.
ఇలాంటి చిత్రాలు తీయడానికి నిజాయితీ, నిబద్ధత అవసరం. అది తనకుందని వివేక్ నిరూపించుకున్నారు. వాస్తవాలను గుర్తెరిగి కశ్మీర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరంపైనే ఉందనే పాజిటివ్ నోట్ తో ఈ మూవీ ముగుస్తుంది.
వివేక్ సాహసోపేతమైన కథని తెరకెక్కించాడంటూ.. అందరూ చూడాల్సిన చిత్రమంటూ హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్ర ప్రభుత్వాలు అడక్కుండానే వినోద పన్నుపై రాయితీనిచ్చాయి. ఇది అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శితమై చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. మరోవైపు ఈ సినిమాని చుట్టుముట్టిన వివాదాలూ తక్కువేం కాదు.
నాణేనికి ఒకవైపే చూపిస్తూ.. మమ్మల్ని విలన్లుగా చూపించారంటూ ఒక వర్గం వారు విరుచుకుపడ్డారు. ఈ సినిమాని నిలిపివేయమని ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.
సాంకేతిక అంశాల అభ్యంతరం చూపిస్తూ బొంబాయి హైకోర్టు ధర్మాసనం ఈ పిల్‌ని కొట్టివేసింది.కాశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో మేం ఎన్నోసార్లు స్థానిక నేతల నుంచి బెదిరింపులు ఎదర్కొన్నామంటూ ఆరోపించింది నటి పల్లవీ. నటీనటులకు వ్యతిరేకంగా ‘ఫత్వా’ కూడా జారీ చేశారట.
ఏదేమైనా..వాస్తవిక కథాంశం ఎంచుకొని, తక్కువ బడ్జెట్‌లోనే సినిమా తీసినా.. కథ, కథనంలో ఎక్కడా బిగి సడలకుండా నడిపించారు. ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిది మొదట్నుంచీ భిన్నమైన పంథానే. కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూ.. వాస్తవిక అంశాలనే కథాంశంగా ఎంచుకోవడం ఈయన ప్రత్యేకత. అంతకుముందు తీసిన ‘తాష్కెంట్ ఫైల్స్’ కూడా సంచలనమే.
వివేక్ సినిమా కోసం ఎంతలా తపిస్తాడంటే.. కాశ్మీర్ ఫైల్స్ కోసం మొత్తం షూటింగ్ జరిపింది నెలరోజులే. కానీ కథ కోసం రెండేళ్లపాటు పరిశోధన చేశాడు. కాశ్మీర్ రాష్ట్రం దాటి వెళ్లిపోయిన 5 వందల మంది కాశ్మీరీ పండిట్లను ఇంటర్వ్యూ చేశాడు.
తద్వారా వచ్చిన వాస్తవాలను బేస్ చేసుకునే కథ రాసుకుని తెరకెక్కించారు. ఈ సినిమాను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రికి ఈ సినిమాను ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.