ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి. ఈ దాడుల తీరు చూస్తుంటే పుతిన్ కరడు గట్టిన యుద్ధోన్మాది గా మారాడా అనిపిస్తుంది. ఇపుడు ప్రపంచం పుతిన్ ను ఆ దృష్టితోనే చూస్తోంది. నరమేధం సృష్టించిన నేతగా పుతిన్ చరిత్రకెక్కాడు.
రష్యన్ దళాలు ప్రతి రోజూ ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోతున్న ప్రజల పైనా కనికరం చూపడం లేదు. ఆస్తులు ద్వంసమవుతున్నాయి. సైనికుల తూటాలకు ప్రజలు కుప్పకూలిపోతున్నారు. దాడులు జరిగే అవకాశం ఉండటంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భూగర్భ బంకర్లన్నీ జనంతో నిండిపోయాయి. తిండి తిప్పల్లేక ప్రజలు నరక యాతన పడుతున్నారు.
సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని, సరిహద్దులు దాటి, పొరుగున ఉన్న ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పొలండ్, స్లొవేకియాలోకి చేరుకుంటున్నారు. మగవారు మాత్రం యుద్ధంలో సహకరించేందుకు ఉండిపోయారు. గత 48 గంటలలోపే 50 వేల మందికి పైగా ఉక్రెనియన్లు దేశం విడిచి పారిపోయారు.
చంకలో పిల్లలు, చేతిలో సామాన్లు పట్టుకొని, తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకుని కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. కొన్ని దేశాలు శరణార్ధులకు శిబిరాలు ఏర్పాటు చేశాయి. ప్రజల వలసలకు సంబంధించిన దృశ్యాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఎవరైనా పుతిన్ ను శాపనార్ధాలు పెట్టకుండా ఉండలేరు.
ఉక్రెయిన్‌పై దాడులకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా సొంత దేశంలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పుతిన్ అభినవ హిట్లర్‌గా అభివర్ణిస్తూ.జనాలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ.ర్యాలీలు చేపడుతున్నారు.యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. పుతిన్ ఫోటోను హిట్లర్ మాదిరిగా మార్ఫింగ్ చేసి ప్రదర్శిస్తున్నారు. అన్ని దేశాల్లో కూడా ఇలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
కాగా చర్చలకు సిద్ధమన్న పుతిన్ ఇప్పటికైనా మనసు మార్చుకుంటాడా అనేది సందేహమే. అయితే కఠినమైన ఆంక్షల విధింపు నేపథ్యంలో చివరికి పుతిన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కూడా అమెరికా ప్రకటనతో పుతిన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలోనే పుతిన్ అణు యుద్ధానికి దిగవచ్చనే వార్తలు కూడా ప్రజలను గజగజ వణికిస్తున్నాయి.