హీరో ఒకే .. కథే వీక్ ..

Sharing is Caring...

సూపర్ స్టార్ కృష్ణ మనవడు,ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన మొదటి సినిమా ఇది. రకరకాల జోనర్స్ ను కలగలిపి తీసిన సినిమా ఈ ‘హీరో’. సినిమా రిచ్ గానే తీశారు కానీ కథ మీద మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.

ఇదివరలో శమంతకమణి, భలేమంచి రోజు సినిమాలతో దర్శకుడిగా కొంత పేరు తెచ్చుకున్నశ్రీరామ్‌ ఆదిత్య.. ఈ సారి ఓ కామెడీ కథకి మాఫియా లింకులు కలిపి కథ నడపడానికి కష్టపడ్డాడు. చాలాచోట్ల సన్నివేశాలు లాజిక్ లేకుండా సాగుతాయి.

స్టోరీ లైన్ చిన్నది … దాన్ని సాగదీశారు. ఫస్టాఫ్‌ అంతా రోటీన్‌గా సాగుతుంది. దీంతో ప్రేక్షకుడు అక్కడక్కడ బోర్ ఫీలవుతాడు. హీరో పాత్రను మలచిన విధానం కూడా కొంత ఓవర్ ప్రొజెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. హీరో మొదటి సినిమా కాబట్టి ఒక జోనర్ కే పరిమితమై మంచి కథ ఎంచుకుని ఉంటే అశోక్ ఎంట్రీ ఇంకా బాగుండేది. సినిమా మొదట్లోనే కృష్ణ,మహేష్ బాబు పేర్లను ప్రస్తావిస్తూ ఇతను నట వారసుడని ప్రేక్షకులకు హింట్ ఇస్తూ కొన్ని డైలాగులు పెట్టారు.

సినిమాలో బిగినింగ్ ఎపిసోడ్ బాగుంది. ఏమాటకామాట చెప్పుకోవాలి అశోక్ ఫైట్స్,డాన్సులు బాగానే చేశాడు. గెటప్ కూడా భిన్నంగా ఉంటే బాగుండేది. ఇక పాటలు గొప్పగా లేవు. హీరో హీరోయిన్ల మీద మంచి పాటలు పెట్టే ప్రయత్నం చేయలేదు. మధ్యలో పాత పాటల సమాహారం గా “బదన్ పె సితారె” హిందీ సాంగ్ కొన్ని తెలుగు పాటలు … అవీ కృష్ణవి యాడ్ చేయడం బాగానే ఉంది.

సూపర్ స్టార్ సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని యధాతదంగానో ,, రీమిక్స్ చేసి కానీ పెట్టి ఉంటే ఆ ఇంప్రెషన్ డిఫరెంట్ గా ఉండేది. ఫైట్లు పైన శ్రద్ధ పెట్టారు కానీ పాటలు పెట్టక పోవడం పెద్ద మైనస్ పాయింట్. తొలి సినిమాతోనే హీరోని కామెడీ, రొమాన్స్, యాక్షన్, డ్యాన్స్..అన్నీ చేసేయగలడని చూపించే ప్రయత్నం చేశారు. ఇది దర్శకుడి ఆలోచనో లేక నిర్మాతల ఆలోచనో తెలీదు.

ఈ కారణంగా డైరెక్టర్ కథ కథనం మీద దృష్టి పెట్ట లేకపోయాడు. ప్రతి సన్నివేశంలో హీరో ఎలివేషన్ పైనే ఫోకస్ పెట్టారు. హీరో ను చంపడానికొచ్చిన క్రిమినల్స్ జోకర్లు గా ప్రవర్తించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కథలో రొమాన్స్ పండే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్లు లేవు. జగపతి బాబు క్యారెక్టర్ గురించి ఆడియన్స్ పెద్ద అంచనాలు వేసుకుంటారు. కానీ చివరికి తుస్ మనిపించారు.

ప్రధాన పాత్రలపై మరి కొంత శ్రద్ధ పెట్టి ఉంటే కథ ఆసక్తికరంగా ఉండేది. క్లైమాక్స్లో బ్రహ్మాజీ షూటింగ్ ఎపిసోడ్ బాగుంది. బ్రహ్మజీ అదరగొట్టారు. అయితే యాక్షన్ ఎపిసోడ్ ను కామెడీ గా మార్చేశారు. క్లైమాక్స్ ‘దూకుడు’ ని గుర్తు చేస్తుంది. డైలాగులు బాగానే ఉన్నాయి. సలీం భాయ్ పాత్ర ను కూడా సరిగ్గా మలచలేకపోయారు. లాజిక్ విస్మరించి చూస్తే సినిమా పర్వాలేదనిపిస్తుంది. నటీ నటులు అందరూ బాగానే చేశారు. జనవరి 15 న విడుదలైన ఈ సినిమా ఇపుడు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!