Suresh Vmrg…………………………………
Maruthi 800……………………………………………..
మధ్యతరగతి భారతీయుడి నాలుగు చక్రాల కల నెరవేర్చిన ‘మారుతీ 800’. 1980 ప్రాంతాల్లో అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని కార్లకు ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా భారతీయ మధ్యతరగతి ప్రజల కోసం తయారుచేసిన మారుతి 800 కారు ఎప్పటికీ నా ఫేవరిట్.
1950 నాటి సంగతి. నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్యమంత్రిగా వున్న మనూభాయ్ షా … చౌకధరలో, పూర్తిగా దేశీయంగా తయారుచేయగల కార్ల గురించి ఆలోచించారు. ఈ కార్లను ప్రభుత్వ రంగంలో తయారుచేసి, దేశానికి మంచి ఆదాయం సమకూర్చవచ్చన్న ఆయన ప్రతిపాదనను నెహ్రూ సీరియస్‌గా తీసుకోలేదు. రాజకీయ సంకల్పం లేమి కారణంగా ఈ ఐడియా ప్రయివేటు రంగానికి మళ్లిపోయింది.
వోక్స్‌వేగన్, టయోటా, రేనాల్ట్ వంటి అంతర్జాతీయ కార్ల సంస్థలు ఈ ఐడియా మీద కొంత పనిచేశాయి కానీ, గిట్టుబాటు కాదని వదిలేశాయి. 1968లో లండన్‌లో వోక్స్‌వేగన్ కంపెనీలో అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసుకుని ఇండియా తిరిగొచ్చిన సంజయ్‌గాంధీ ఈ ప్రాజెక్టును మళ్లీ తెరమీదికి తీసుకొచ్చారు. ఇరవై మూడేళ్ల వయసులో ‘మారుతీ ఉద్యోగ్’ పేరుతో ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాడు సంజయ్.
కొద్దికాలం తర్వాత కంపెనీ పేరును హనుమాన్ అని మార్చాడు. కానీ, కొద్దిరోజుల్లోనే కంపెనీ మీద ఆరోపణలు రావడం మొదలైంది. ప్రధాని కొడుకు కాబట్టి అడ్డగోలుగా అనుమతులు లభించాయని, కార్ల తయారీకి అవసరమైన భూమిని అతితక్కువ ధరకు సేకరించారని, ప్రభుత్వంతో అవసరాలున్న కొన్ని ప్రయివేటు కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయని ఆరోపణలొచ్చాయి.
ఈ పరిణామాల మధ్య కొన్నేళ్లపాటు ‘మారుతీ ఉద్యోగ్’ కార్యకలాపాలు మందగించిపోయాయి. 1977లో అధికారం లోకి వచ్చిన జనతా ప్రభుత్వం మారుతీ ఉద్యోగ్‌ను లిక్విడేట్ చేసింది. 1980లో విమాన ప్రమాదంలో సంజయ్‌గాంధీ మరణించాడు. అదే ఏడాది ఇందిరాగాంధీ తన కుమారుడి స్మృతిసూచికంగా మారుతీ ఉద్యోగ్‌ను జాతీయం చేసింది. 1980 ఎన్నికల్లో మళ్లీ ప్రధాని పదవి అధిరోహించడానికి ఇందిరకు ఉపయోగపడిన అంశాల్లో మారుతీ కూడా ఒకటి.
ప్రభుత్వ రంగ సంస్థగా మారుతీ ఉద్యోగ్ … 1980 చివర్లో జపనీస్ కంపెనీ సుజుకీతో భాగస్వామ్యం తీసుకుంది. కేవలం రెండేళ్లలో, 1983 డిసెంబర్ 14న సంజయ్‌గాంధీ పుట్టినరోజున మారుతి 800 కారు భారతీయ మార్కెట్లోకి విడుదలైంది. లక్కీ డ్రా ద్వారా తొలి కారు హర్‌పాల్ సింగ్ అనే ఢిల్లీ వాసికి దక్కింది.
ప్రధాని ఇందిర స్వయంగా ఆయనకు కారు తాళాలు అందించారు. తొలి ఎడిషన్ ధర అన్ని పన్నులూ కలుపుకుని యాభైవేల రూపాయలు. నాణ్యతా ప్రమాణాల విషయంలో అందరి ఊహల్నీ అధిగమించింది మారుతి కారు. సాంకేతికంగా, నిర్మాణపరంగా దృఢమైనదని, భారతీయ రోడ్లకు అనువైందని అంతర్జాతీయ కార్ల తయారీ నిపుణులు సర్టిఫై చేశారు.
దాదాపు27 లక్షల కార్ల అమ్మకం తరువాత … 2003లో మారుతి 800 తయారీ ఆగిపోయింది. బి.ఎస్-4 ప్రమాణాలకు అనువుగా లేకపోవడంతో కంపెనీ 800 తయారీని ఆపేయాల్సివచ్చింది. కానీ, 800 కారు నమూనాను అప్‌డేట్ చేస్తూ మరిన్ని కొత్తకార్లను తయారుచేయడం మొదలుపెట్టింది. మారుతీ జెన్, ఆల్టో పేర్లతో 800కి అప్‌డేట్ వెర్షన్లను తయారుచేసిన మారుతీ సుజుకీ ఇవ్వాళ్టికీ వాటిని మార్కెట్లో వుంచింది.
మారుతీ 800 అధికారికంగా ఆగిపోయి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినా కూడా ఇవ్వాళ్టికీ దానిమీద ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. స్కూటర్లలో బజాజ్ చేతక్ లాగే … రోడ్డు మీద కనిపించే ప్రతి పది కార్లలో ఒకటి మారుతీ 800 అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.పదిహేనేళ్ల వ్యవధి పూర్తయినా ఫిట్‌నెస్ టెస్టుల్లో పాసవుతూ, మళ్లీమళ్లీ గ్రీన్ రిజిస్ట్రేషన్ సాధించిన కారు దేశవ్యాప్తంగా మారుతీ 800 ఒక్కటే.
pl.read it also………………….. ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (2)