వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగుతానని ప్రకటన చేసిన నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సారి రఘురామ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇండిపెండెంట్ గా అయితే జనసేన .. బీజేపీ .. టీడీపీ ల మద్దతు తీసుకోవచ్చని రఘురామ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీలతో సంప్రదింపులు మొదలు పెట్టారని అంటున్నారు. ఆ మూడు పార్టీలు జగన్ కి వ్యతికరేకం కాబట్టి వారి ఓటు బ్యాంక్ తో ఎన్నికల్లో గెలుపు సులభం అవుతుందని రఘురామ వర్గీయులు అంచనా వేస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజుకి 4,47,594 ఓట్లు వచ్చాయి…31,909 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి శివ రామరాజు కి 4,15,685 ఓట్లు రాగా జనసేన అభ్యర్థి నాగబాబు కి 2,50,289 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకి 13,810 ఓట్లు పడ్డాయి.బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాల రావు కి 12,378 మాత్రమే వచ్చాయి.
ఇక 2014 లో బీజేపీ పార్టీ అభ్యర్థి గోకరాజు గంగరాజు 5,40,306 ఓట్లు వచ్చాయి. వైసీపీపై 85,351 ఓట్ల మెజారిటీ తో గంగరాజు గెలిచారు 2019 లో అదే బీజేపీకి 5,లక్షల 27 వేల మేరకు ఓట్లు తగ్గాయి. 2014లో టీడీపీ బీజేపీ పొత్తు లో ఉన్నాయి కాబట్టి బీజేపీ బలం పెరిగింది. 19 లో పొత్తు లేదు కాబట్టి ఓట్లు తగ్గాయి అనుకోవచ్చు.
అదే 2014 లో వైసీపీ అభ్యర్థి కి 4,54,955 ఓట్లు వచ్చాయి. (19 ఎన్నికలతో పోలిస్తే ఓట్లు 8 వేలు ఎక్కువ ) 2009 లో ఇక్కడ కాంగ్రెస్ కు 3,89,422 ఓట్ల బలం ఉంది. అదంతా వైసీపీకి బదిలీ అయింది. అందుకే 2014.. 2019 ఎన్నికల్లో ఆపార్టీకి 4 లక్షల ఓట్ల పైనే వచ్చాయి. అంటే ఆ పార్టీ బలంగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అలాగే టీడీపీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. అందులో కూడా సందేహం లేదు.
ఒక వేళ ఉప ఎన్నిక ఖాయం అనుకుంటే …టీడీపీ .. జనసేన మద్దతు ఇస్తే .. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓట్లు జనసేన ఓట్లు కలిస్తే …6,65,974 ఓట్లు అవుతాయి . అంటే వైసీపీ కున్న బలం కంటే ఎక్కువే. కానీ అన్ని ఓట్లు సాలిడ్ గా రఘురామకే పడతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఇలా లెక్కలు వేసుకునే రఘురామ రాజు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని అంటున్నట్టు తెలుస్తోంది.
ఇక బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన రఘురామ రాజుకి మద్దతు ఇస్తుందా ? సొంతంగా బరిలోకి దిగుతుందా ? అలాగే సామాజిక సమీకరణాలు వర్క్ అవుట్ అవుతాయా? మిగతా పార్టీల తరపున రాజులు అంతా బరిలోకి దిగరా ? వారంతా ఓట్లు చీల్చరా ? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ఈ ముందస్తు ప్రశ్నలకు ఇపుడే జవాబులు దొరకవు.
ఒక వేళ నిజంగా అన్ని పార్టీలు కలిసి రఘురామను బరిలోకి దింపితే ఆ ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. వైసీపీ కి ఒక సవాల్ గా పరిణమిస్తుంది. ఎన్నికలు మరో రెండేళ్లలో పెట్టుకుని రఘురామ రాజు అంత సాహసం చేస్తారా అనేది కూడా సందేహమే. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో ? అసలు ముందు రఘురామ రాజీనామా చేయాలిగా ??
———-KNMURTHY