Different roles……………………………………..
విలక్షణ నటుడు మోహన్ లాల్ ఇటీవల కాలంలో డిఫరెంట్ క్యారెక్టర్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఇమేజ్ చట్రాలను ఛేదించి కొత్త పాత్రలతో తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రత్యేకంగా కథలు రాయించుకుని సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో 10 సినిమాల వరకూ ఉన్నాయి. అవన్నీ ఒక దానికొకటి పొంతన లేని క్యారెక్టర్లు కావడం విశేషం.
ఆరట్టు
ఆరట్టు వచ్చే ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. థియేటర్లలో విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఆరట్టు సినిమాకు బి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. ఉదయకృష్ణ స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమాలో మోహన్‌లాల్ నెయ్యట్టింకర గోపన్ అనే పాత్రలో నటిస్తున్నారు.
మోహన్ లాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక గా చేస్తోంది. ఈ సినిమా టీజర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఆమధ్య కేరళలో వరకట్న సమస్యతో యువతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఈ సమస్యపై దృష్టి పెడుతూ ఈ సినిమా నిర్మించారు. అభిమానులు పెద్ద అంచనాలతో ఉన్నారు.
మాన్‌స్టర్
మలయాళంలో సంచలనం సృష్టించిన ‘పులిమురుగన్’ దర్శకుడు వైశాఖ్ తో మోహన్ లాల్ చేస్తున్న సినిమా ఈ ‘మాన్‌స్టర్’. ఈ సినిమా గెటప్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘పులిమురుగన్’ తెలుగులో ‘మన్యంపులి’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోని పెరుంబవూర్ ‘మాన్‌స్టర్’ మూవీని నిర్మిస్తున్నారు.
ఇవి చేస్తూనే ‘దృశ్యం’ డైరెక్టర్ జీతు జోసెఫ్‌తో ‘ట్వల్త్ మ్యాన్’ అనే థ్రిల్లర్ మూవీ మొదలు పెట్టారు. అలాగే లూసిఫర్’ తీసిన పృథ్వీరాజ్ దర్శకత్వంలో ‘బ్రో డాడీ’ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత షాజీ కైలాస్ డైరెక్షన్ లో ‘అలోన్’ అనే సినిమా చేయబోతున్నారు. అలాగే దృశ్యం 3 కూడా అనౌన్స్ చేశారు.
ఇక మోహన్ లాల్ మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా కూడా మారారు. మోహన్‌లాల్ మొదటి సారిగా డైరెక్ట్ చేస్తున్న సినిమా పేరు ‘బరోజ్’. ఈ సినిమాలో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఒక వెరైటీ గెటప్ లుక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గుండు.. గుబురు గడ్డం తో మోహన్ లాల్ గెటప్ వెరైటీ గా ఉంది. అంతకుముందు కూడా కొన్ని గెటప్స్ వచ్చాయి.
ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.త్రీడీ లో తీస్తున్నారు. దేశంలో తొలి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్ డైరెక్టర్ జిజో పున్నూస్ కథను సమకూర్చారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ సినిమా ఫోటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.
పోర్చుగల్, స్పెయిన్, ఆఫ్రికా, భారత్ సముద్రయాన చరిత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత మార్చిలోనే మొదలైంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
ఇలా సినిమాల మీద సినిమాలు ప్రకటిస్తూ మోహన్ లాల్ దూసుకుపోతున్నాడు.ఈ స్థాయిలో సినిమాలు, వెరైటీ క్యారెక్టర్లు చేస్తున్న నటుడు ఇండియా మొత్తం మీద మరొకరు లేరు. కథల విషయంలో .. క్యారెక్టర్ల రూపకల్పన లో ఆయనకు ఎలాంటి పట్టింపు ఉండదు.
అభిమానులు ఏదో అనుకుంటారని .. ఇమేజ్ దెబ్బతింటుందని భావించరు. వేరే భాషల సూపర్ స్టార్లతో పోలిస్తే మోహన్ లాల్‌ను భిన్నంగా నిలబెట్టేది ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే అని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా మోహన్ లాల్ ను అందరూ సొంతం చేసుకుంటున్నారు.