ఆ హెలికాప్టర్ ఎలా కూలిందో ? భద్రతపై సందేహాలు!

Sharing is Caring...

Security ……………………………………..

భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ఎలా ప్రమాదానికి గురైంది అర్ధంకాక ఎయిర్ ఫోర్స్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మరో అయిదు నిమిషాల్లో లాండ్ కావాల్సిన హెలికాప్టర్ హఠాత్తుగా ఎందుకు కూలిపోయిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

అత్యంత సురక్షితంగా భావించే ఈ హెలికాప్టర్ ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బిపిన్ రావత్ ఆయన సతీమణి మరో 11 మంది హెలికాఫ్టర్ కుప్ప కూలిన ఘటనలో మరణించారు. బిపిన్ రావత్ 2015 లో కూడా ఇలాంటి ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నారు.

ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు  ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు.ఈ విమానం ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో క్షేమంగా ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఈ బృందం హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు రావత్‌ బయల్దేరారని సమాచారం. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ఏరియాలో ఈ హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.

అటవీ ప్రాంతంలో చెట్టుపై ఒక్కసారిగా పడటం తో మంటలు చెలరేగాయి. అత్యంత సురక్షితమైందిగా భావించే ఈ సిరీస్ హెలికాఫ్టర్ లను రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. వీఐపీల పర్యటనలకు వీటినే ఉపయోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనల కోసం కూడా దీనినే వినియోగిస్తున్నారు. ఈ మోడల్  హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు ఉంటాయి.

ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు చేస్తారు. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉపయోగిస్తారు. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ హెలికాఫ్టర్ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటలో 580 కిలోమీటర్లు చేరుకుంటుంది.

ఇండియా మొత్తం 80 హెలికాప్టర్లను  రష్యాకు చెందిన రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్టు కంపెనీ నుంచి కొనుగోలు చేసేందుకు 2008 లో ఒప్పందం కుదుర్చుకుంది. 2013 లో అన్ని హెలికాఫ్టర్లు భారత్ కు చేరాయి. మరో 71 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.  2018లో కొన్ని హెలికాప్టర్లు భారత్‌కు వచ్చాయి . ఏ వాతావరణంలో అయినా ఇవి పని చేస్తాయి.

అడవులు, సముద్రాలు.. ఎడారులపై నుంచి  సురక్షితంగా ప్రయాణించేలా వీటిని నిర్మించారు.  36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల సరుకులను తరలించే సామర్ధ్యంతో పనిచేస్తాయి. తాజా ప్రమాదంతో ఈ సిరీస్ హెలికాఫ్టర్ సురక్షితమైనదా ? కాదా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. K Anand K December 8, 2021
error: Content is protected !!