ఎవరీ వసీం రిజ్వీ ..ఎందుకు హిందువుగా మారాడు ?

Sharing is Caring...

యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ వసీం రిజ్వీ మరో మారు వార్త ల్లో కెక్కారు. ఆయన ఇస్లాం మతాన్ని వీడి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి గా పేరు మార్చుకున్నారు. తన మరణానంతరం భౌతికకాయాన్ని దహనం చేయాలని కోరారు. ఘజియాబాద్‌ దస్నా ఆలయానికి చెందిన యోగి మహంత్‌ నర్సింహానంద సరస్వతి చితికి నిప్పుఅంటించాలని ప్రకటించారు.

కొన్నాళ్ల క్రితం ఉగ్రవాదాన్ని, జిహాద్‌ను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఖురాన్‌లోని 26 వచనాలను తొలగించాలంటూ వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసారు. అప్పట్లో అది పెద్ద వివాదానికి దారితీసింది. అయితే రిజ్వీ వేసిన పిటిషన్‌ అర్థంలేనిదంటూ సుప్రీంకోర్టు దాన్ని కొట్టి పడేసింది. ఆ సందర్భంగా వసీం రిజ్వీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

షియాలు,సున్నీలు రిజ్వీ వైఖరిని ఖండించారు.అతను వేసిన పిల్ ప్రచారం కోసమే అని దుమ్మెత్తి పోశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని విమర్శించారు. మార్చి 11న పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, రిజ్వీకి వ్యతిరేకంగా పలు నగరాల్లో నిరసన వ్యక్తమైంది. కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. 

మొరాదాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది రిజ్వీ “తల నరికిన ” వ్యక్తికి రూ. 11 లక్షల రివార్డు ప్రకటించారు. దీనిపై కూడా కేసు నమోదైంది . ఉత్తరప్రదేశ్‌లోని మరో ముస్లిం సంస్థ షియానే హైదర్-ఎ-కర్రార్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా రిజ్వీ తల నరికిన వ్యక్తికి రూ.20,000 రివార్డును ప్రకటించింది.

ఈ క్రమంలోనే రిజ్వీని బహిష్కరించాలని కొందరు ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. నాడు ఆ విధంగా రిజ్వీ దేశ వ్యాప్తంగా అందరికి పరిచయమైనారు. అంతకుముందు కూడా రిజ్వీ వివాదాలకు కొత్త కాదు. ట్రిపుల్ తలాక్ ..  అయోధ్య వివాదం వంటి అంశాలపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు .

ఎవరీ వసిమ్ రిజ్వీ ?
గత ఏడాది వరకు వసీం రిజ్వీ యుపి షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. క్లాస్ II రైల్వే ఉద్యోగి కుమారుడు. రిజ్వీ కాలేజీ విద్యను కూడా పూర్తి చేయలేదు. రిజ్వీ 2000లో లక్నోలోని ఓల్డ్ సిటీలోని కాశ్మీరీ మొహల్లా వార్డు నుండి సమాజ్‌వాదీ పార్టీ (SP) కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. 2008లో షియా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు.

2012లో రిజ్వీ నిధులను స్వాహా చేశారని షియా మత గురువు కల్బే జవ్వాద్‌ ఆరోపించారు. తర్వాత ఆరేళ్లపాటు పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో షియా వక్ఫ్ బోర్డు కూడా రద్దయింది. అయితే రిజ్వీ తర్వాత కోర్టు ను ఆశ్రయించి మళ్ళీ పదవిని పొందాడు. 2019లో ‘రామ్ కీ జన్మభూమి’ అనే సినిమాని కూడా నిర్మించాడు.

నవంబర్ 2020లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) UPలో వక్ఫ్ ఆస్తుల అమ్మకం, కొనుగోలు,బదిలీలలో అవకతవకలకు సంబంధించి రిజ్వీ మరికొంతమంది పై రెండు కేసులు నమోదు చేసింది. ఆయనపై పోలీస్ స్టేషన్లలో కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసుల వెనుక “కుట్ర కోణం ” ఉందని రిజ్వీ ఆరోపించారు.

2019 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో “ముస్లిం పిల్లలను విద్యకు.. ఇతర మతాలకు దూరంగా ఉంచడానికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మదర్సాలను ప్రోత్సహిస్తోందని .. నిధులు సమకూరుస్తోందని .. ప్రాథమిక మదర్సాలను మూసివేయాల”ని రిజ్వీ అభ్యర్థించారు.

రాబోయే 15 ఏళ్లలో దేశం లోని సగానికి పైగా ముస్లిం జనాభా ISIS భావజాలానికి మద్దతుదారులుగా మారతారు… ఇస్లాం పేరుతో వారిని (ప్రాధమిక మదర్సాలలోని విద్యార్థులు) రాడికల్స్‌గా మార్చుతున్నారు” అని లేఖలో ఆరోపించారు. ఈ లేఖ కూడా వివాదాస్పదమైంది. బాబ్రీ మసీదు…  రామమందిరం వివాదం కోర్టులో ఉన్నప్పుడు, రిజ్వీ అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని, మసీదును లక్నోలో నిర్మించవచ్చని సూచించారు. రిజ్వీ వ్యవహారశైలి ముస్లింలకు ఏం మాత్రం నచ్చలేదు. చివరికి మతం మార్చుకుని హిందువుగా మారారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!