ఆఫ్ఘన్ లో ఆకలి కేకలు !!

Sharing is Caring...

Miserable conditions…………………………………………..

తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సమీప దేశాలకు తరలి వెళ్లారు. అప్పట్లో కొన్నాళ్ళు చూద్దాంలే అని ఆగిన ప్రజలు ఇపుడు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.పనులు లేక ..ఆహరం దొరక్క కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల మంది పిల్లలు ఆహారం అందక పస్తులు పడుకుంటున్నారు. తక్షణ అవసరాలు తీర్చకపోతే 10 లక్షలమంది ఆకలితో మరణించే ప్రమాదం ఉందని రెండునెలల క్రితమే ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.ఇప్పటికే కొన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టింది.

ఆఫ్ఘన్ తాలిబన్ల వశమయ్యాక దేశంలో పేదరికం రేటు మరింత పెరిగింది. ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం … తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడకపోవడంతో నిన్న మొన్నటి దాకా .. ఎలా గోలా బతుకు ఈడ్చుకొచ్చిన మధ్యతరగతి ప్రజలు ఇపుడు రోడ్డున పడ్డారు.

కరోనా వైరస్‌ , తీవ్ర కరవు పరిస్థితులు .. మరో వైపు పనులు లేక ..దొరకక  3.8 కోట్ల దేశ జనాభాలో 25  శాతం మంది ఆకలితో అలమటిస్తున్నారు. మరో 40 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) నివేదిక ప్రకారం దాదాపు 19 మిలియన్ల ఆఫ్ఘన్‌లు లేదా జనాభాలో 45 శాతం మంది ఆహార సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 3.2 మిలియన్ల మంది  తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రంగానే ఉంది. 

వాస్తవానికి గత కొంత కాలంగా దేశ జనాభాలో సగం మందికి పైగా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి దుర్భరంగా మారింది. గతంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇచ్చేదికాదు. ఆగస్టులో తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నాక మానవ హక్కులను కాలరాయడం, భయోత్పాత పరిస్థితులను సృష్టించడం ,అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకపోవడం వంటి కారణాల నేపథ్యంలో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారు.

ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసినప్పటికీ అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్‌కు ఆర్థిక సహాయం చేయడం లేదు. కొన్ని దేశాలు మాత్రం నేరుగా ఐక్యరాజ్య సమితి కి నిధులు పంపి సహాయక చర్యలు చేపట్టమని కోరుతున్నాయి. ప్రపంచ దేశాలు తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడానికి సుముఖంగా లేవు. తాలిబన్ల వైఖరి కూడా మారలేదు. నిధులు లేక తాలిబన్‌ కొత్త ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు  ఇవ్వలేకపోతోంది. దీంతో ఉద్యోగులు కూడా రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయి . 

ఇక విద్య వైద్య రంగాలు కూడా కుంటుపడ్డాయి. ప్రజాసేవలు నిలిచిపోయాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సంస్థలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే ఈ సహాయం చాలదు. నెలకు 22 కోట్ల డాలర్ల ఆర్ధిక సహాయం అవసరమని అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితులను ఎదుర్కొనాలంటే తాలిబన్ల వైఖరి మారాలి.అయితే అదంతా సులభం కూడా కాదు. పాపం మధ్యలో ప్రజలు నలిగి పోవాలి.ఈ నరకం ఇంకెన్నాళ్లో ? 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!