చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది.
ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా జనం ముందు బాగానే ఉంటారు. అది తెలీక అభిమానులే ఆవేశకావేషాలకు లోనవుతుంటారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఒక్కోసారి నేతల అనుచరులు కూడా తొందరపడి ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఎక్కడన్నా తాము విమర్శించిన నేతలు కలివిడిగా కనిపిస్తే .. ఆశ్చర్యపోతుంటారు. నాలుక కరుచుకుంటుంటారు. ఎపుడైనా నేతలంతా ఒకటే. అందుకే అనుచరులు కానీ అభిమానులుకానీ ఆవేశపడి చొక్కాలు చించుకోకూడదు .
ఇక చాలా రోజుల తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ .. ఏపీ సీఎం జగన్ ఒక పెళ్ళికి హాజరై పక్క పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకొన్నారు. కలసి భోజనం చేసారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతకు ముందు ఏమేమి విమర్శలు చేసుకున్నారో అన్ని మర్చిపోయి జబర్దస్తుగా జోకులేసుకున్నారు. అంతటితో ఆగలేదు. ఇద్దరూ కలిసి టీ తాగేందుకు వెళ్లి ఐదు నిమిషాల పాటు రహస్యం గా మాట్లాడుకున్నారు.
ఏమి మాట్లాడుకున్నారొ ? ఊహించుకోవచ్చు. ఏపీ రాజకీయాలు .. తిట్ల పురాణం .. బీజేపీ రాజకీయాలు ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నారు. హాట్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళ భేటీలో ఈ విషయాలపై చర్చ జరిగి ఉండొచ్చు.అలాగే ముఖ్యంగా బీజేపీ వ్యవహార శైలిపైనే చర్చజరిగి ఉండొచ్చు. కేంద్రం పై పోరాట వైఖరి అవలంభిస్తున్న కేసీఆర్ జగన్ సహకారం కోరి ఉండొచ్చని భావిస్తున్నారు.
జల వివాదం తర్వాత …. ఈ ఇద్దరూ కలుస్తారని ఎవరూ ఊహించలేదు. కలిసినా ఇంత కలివిడిగా ఉంటారని అనుకోలేదు. నాలుగు నెలల క్రితం కృష్ణా జలాల వివాదం ఏర్పడిన సందర్భంగా ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ప్రాజెక్టుల వద్ద ఏకంగా పోలీసు పహారా కూడా పెట్టిన ఉదాహరణలున్నాయి.
నాటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు సీఎంలు మళ్లీ మాట్లాడుకోగలరా?అని అందరూ అనుకున్నారు. ఇద్దరూ కలవడం భేషజాలకు పోకుండా మాట్లాడుకోవడం మంచి పరిణామమే. పెళ్లిళ్ల సందర్భాల్లో కాకుండా ఉభయ రాష్ట్రాల సమస్యలపై కూడా కూర్చొని మాట్లాడుకుంటే మరింత బాగుంటుంది. విభజన బిల్లు ప్రకారం ఇంకా ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంది. ఇవన్నీ కూడా సజావుగా సాగాలంటే రెండు రాష్ట్రాల సీఎం ల మధ్య సఖ్యత ఉండాల్సిందే. వీరే కాదు భవిష్యత్తులో ఎవరున్నా కలసిమెలసి ఉండాలి.