సిన తల్లి పాత్ర నన్నెంతో కదిలించింది !

Sharing is Caring...

Popular actress……………………………………..

“సిన తల్లి పాత్ర ప్రభావం నాపై చాలా ఉంది. ఇపుడల్లా ఆ ప్రభావం నుంచి బయట పడలేను.ఇప్పుడు ఆ సినిమా చూసినా నా కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతాయి. సినతల్లి పాత్ర నన్నెంతో కదిలించింది. సినతల్లి బాధను ఆ పాత్ర ద్వారా నేను కూడా అనుభవించాను.

డబ్బింగ్ సమయంలో డైలాగులు చెబుతుంటే కళ్ళ వెంట నీళ్లు కారేవి. పోలీసులు చిత్రహింసలు పెట్టే సీన్లు .. రాజన్న మరణం తర్వాత  సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు కూడా అంతే. దర్శకుడు ‘కట్’ చెప్పిన తర్వాత కూడా కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. నేను గ్లిజరిన్ అస్సలు ఉపయోగించలేదు. తెరపై కనిపించేవన్నీ నిజమైన కన్నీళ్లే.” అంటోంది నటి లిజోమోల్ జోస్.జైభీమ్ సినిమా తాలూకు అనుభవాలను ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. 

జొస్ జై భీమ్ సినిమాలో గిరిజన మహిళ గా భర్త కోసం పోరాటం చేసిన పాత్ర లో నటించి ప్రేక్షకుల మెప్పును పొందింది. ‘సినతల్లి’గా అందరి మన్ననలు అందుకుంటోంది. నాలుగైదు ఏళ్ళ క్రితం చిత్ర పరిశ్రమకు వచ్చిన జొస్ సమాజం పట్ల అవగాహన గల యువతి. కేరళలోని ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందిన జొస్ అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో డిగ్రీ చేసింది.ఆ తర్వాత కొన్నాళ్ళు ఒక కేరళ చానల్‌లో పని చేసింది. పాండిచ్చేరి యూనివర్శిటీ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ లైబ్రరీ సైన్స్‌లో జొస్ మాస్టర్స్‌ చదివింది.
 
ఆ సమయంలోనే స్నేహితురాలి సూచన మేరకు సినిమా ఆడిషన్స్‌కు ఫొటోలు పంపించింది. ఆడిషన్స్‌లో మూడు రౌండ్ల అనంతరం హీరో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘మహాశింటే  ప్రతీకారం’ సినిమా కోసం ఎంపికైంది.ఆలా చిత్ర పరిశ్రమ లోకి ప్రవేశించింది.2016లో వచ్చిన ‘రిత్విక్‌ రోషన్‌’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘హనీ బీ 2.5’ సినిమాతో మలయాళ స్టార్‌ నటిగా ఎదిగింది.

ఈ నేపథ్యంలో ఇటీవల హీరో సిద్దార్థ్‌ నటించిన తమిళ చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చాయ్’మూవీతో హీరోయిన్‌గా నటించింది. ఇందులో సిద్ధార్థ్‌కు జోడిగా నటించి ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. ఈ సినిమాలు కాకుండా స్ట్రీట్ లైట్స్, ప్రేమ సూత్రం, ఒత్త కోరు కాముకన్, తీతుమ్ నండ్రుమ్  చిత్రాల్లో జొస్ నటించింది. స్వల్పకాలంలోనే పరిశ్రమ దృష్టి లో పడింది.

జైభీమ్ సినిమాలో నటించే ముందు స్క్రిప్ట్ పూర్తిగా విని పాత్ర ఎలాఉంటుందో ఆకళింపు చేసుకుంది జొస్. దర్శకుడు జ్ఞానవేల్ జొస్ కి సినతల్లి పాత్ర గురించి మరింత వివరించి ఆమె నుంచిఅవసరమైన మేరకు నటనను రాబట్టుకున్నారు.. పాత్రలో లీనమయ్యే గుణం జొస్ కి ఉండటంతో అచ్చం సినతల్లి  ని మరిపించేలా నటించింది.
కాగా ఇటీవలే జొస్ తన బంధువు ..స్నేహితుడైన అరుణ్ ఆంటోనీ ని పెళ్లి చేసుకుంది.గృహిణిగా మారినా నటిగా కొనసాగుతానంటోంది. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!