ఈ కొత్త లొల్లి ఏమిటో ?

Sharing is Caring...

Govardhan Gande …………………………………………..

సమైక్యాంధ్ర అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. వివిధ పార్టీల నాయకులు ఈ అంశంపై ఏదేదో మాట్లాడుతున్నారు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వేల మంది బలి దానాలు, అణచివేత, పీడనల తర్వాత సమైక్య రాష్ట్ర ప్రజలు విడిపోయి ఎవరికి వారు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏడేళ్ల కిందటే అక్కడ ఆంద్ర ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డాయి.

ఎవరి రాజకీయాలు వాళ్ళవి .. ఎవరి సమస్యలు వారివి. అయినా వైషమ్యాలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ఏపీ లో కూడా పార్టీ పెట్టమంటున్నారని కేసీఆర్ అనగానే .. ఏపీ మంత్రి రెండు రాష్ట్రాలను కలిపేయండి అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలపాలని ఇద్దరు ముఖ్యమంత్రులు కుట్ర చేస్తున్నారట! ఆ కుట్రను ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత తన “దివ్య దృష్టి”తో కనుగొన్నట్టు వ్యాఖ్యలు చేయడం తో లొల్లి మొదలైంది.

అదే పార్టీ నేత ఒకాయన .. ఆ కుట్రకు మద్దతు నిస్తానని ప్రకటించేశారు. మరో మహిళా నాయకురాలు కూడా ఈయన గారి వాదనను సమర్థించారు.ఈవిడ గారి వాదన కూడా వింతగా ఉన్నది. ఏడేళ్ల పాలన బాగా లేదని సమైక్య రాష్ట్రమే మేలు అనే అర్థం స్ఫురించేలా మాట్లాడుతున్నారు ఆవిడ. 

2014 లో ఏర్పడింది భౌగోళిక తెలంగాణ మాత్రమే కదా. దాన్ని ఎలా బాగు చేసుకోవాలి? దానికి ఉన్న ప్రణాళిక ఏమిటి? అనే సంగతి జనానికి వివరించి, వారిని ఒప్పించి అధికారం పొంది తెలంగాణను ప్రగతి బాట పట్టించాలి కదా.అదేమీ లేకుండా ఈ పాలన బాగాలేదు కాబట్టి సమైక్య రాష్ట్రమే మేలు అనే వాదన హేతుబద్ధమేనా?

అలా అనుకుంటే ఇండియా స్వతంత్ర దేశంగా మారి 75 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ అభివృద్ధి సాధించలేదు అందువల్ల  మళ్లీ బ్రిటీష్ ఇండియాలో కల్సిపోదామా? మళ్లీ పరాయి పాలన కిందికి వెళ్లిపోదామా? అనే తరహా వాదన ఇది. ఆవిడ గారి వాదన అలా ఉంది మరి. రాష్ట్రం ఎలా ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది? దాని ఆవశ్యకత ఏమిటి? రాజ్యాంగం అందుకు వీలుగా ఎలాంటి నియమావళిని ఏర్పాటు చేసింది అనే కనీస అవగాహన లేని ఇలాంటి వారు చట్ట సభల్లో ఏమి చేయగలరు?

వీరు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు?వారి ఆలోచనలు, అవసరాలు,ఆకాంక్షలు ఏమిటి అనే కనీస స్పృహ లేని ఇలాంటి పసలేని వాదనలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కనీస జ్ఞానం లేని, ప్రజల మనోగతం అర్ధం చేసుకోలేని, అందుకు విరుద్ధంగా ప్రవర్తించే వీరు మన చట్టసభలకు ఎన్నికవుతుండడం కూడా బాధాకరమే. 

తాను ముందు నుంచీ సమైక్య వాదినేనని ఆ “పెద్ద” మనిషి  చెప్పి పడేసారు. అసలు ఓ జాతి స్వత్రంతంత్రంగా ఉండాలా? పరాయి పంచన చేరాలా ? అనే సంగతిని  నలుగురు అంటే నలుగురే నాయకులు నిర్ణయిస్తారా ? అలా నిర్ణయించడానికి వీరికి ఉన్న అర్హతలు ఏమిటి? అధికారాలు ఏమిటి? ఆ అధికారాలు ఎవరిచ్చారు వీరికి? 

తెలంగాణ సమాజం మునుపటిలా అమాయకంగా ఉందనుకుంటున్నారా వీరు? ప్రజల మనోగతంతో తమకు ఏ సంబంధమూ లేదనుకుంటున్నారా?అసలు ఈ కొత్త డ్రామాకు ఎవరు తెర తీశారు. ఎందుకీ చర్చలు ?ఈ చర్చల వెనుక ఉన్నదెవరు ? మళ్ళీ సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా ? అనే సందేహాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.

ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్చలు ఆవేశకావేషాలు పుట్టిస్తాయి. రాజకీయ నేతలకు ఆ విషయం తెలీదా అంటే తెలుసు. కానీ తమ స్వార్ధం కోసం ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తుంటారు. లొల్లి పెట్టడానికి ఆజ్యం పోస్తుంటారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!