Govardhan Gande…………………………..
Poverty vs India ……………………………………………
పాలక వ్యవస్థలు పౌరుల ఆకలి తీర్చాలి. ప్రజల అవసరాలను తెలుసుకోవాలి. వారి కనీస అవసరాల (కూడు,గుడ్డ నీడ)ను గుర్తించాలి.వారికి తగిన సదుపాయాలను సమకూర్చే ఆలోచనలు చేయాలి. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించాలి. బడ్జెట్లు కేటాయించాలి. ఎన్నికైన నాయకులు తాము ప్రజల కోసమే అని నిరూపించుకోవాలి. అది వారి విధి.
అదే మన రాజ్యాంగ నిర్మాతల స్వప్నం. రాచరికాలు,నియంతృత్వాలకు భిన్నమైన ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థ.సమాజాన్ని పాలించే ఈ పాలకవర్గం (రాజ్య వ్యవస్థ) పౌర సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్య వ్యవస్థ ను ప్రజలు నిర్మించుకున్నది అందుకే. ఎంతో దూరదృష్టితో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా సేవకుల (ప్రతినిధులు)ను ఎన్నుకునే విధానాన్నినిర్మించారు.
అలా ఎన్నుకున్నవారు ప్రజాసేవకులం అనే సంగతిని మరచిపోయి యజమానులం,రాజులం,అన్నింటికీ అతీతులం అని భావిస్తూ, ప్రవర్తిస్తూ కొద్ది మంది సంపన్నులు/కుబేరుల ధనదాహాన్ని తీర్చే సాధనంగా మారిపోతున్నారు. ఇది శోచనీయమైన పరిస్థితి. ధనమున్నవారికే మాత్రమే ఉపకరించే విధానాలను రూపుదిద్ది అమలు చేస్తే దానిని కుబేర స్వామ్యం అంటారు.
కరోనా/కోవిడ్ తో మొత్తం ప్రపంచం అల్లకల్లోలంగా మారి స్థంభించిన సమయంలో ఆశ్ఛర్యకరంగా దేశంలోని ఓ కుబేరుడి ఒక రోజు ఆదాయం రూ.1002 కోట్లు.కొందరు భారతీయ పారిశ్రామిక వేత్తలు ఏకంగా ప్రపంచ స్థాయి కుబేరులుగా అవతరించారు.అంటే అర్ధమేమిటి? కరోనా లాంటి విపత్తు కూడా వారి వ్యాపార విస్తరణకు ఎలాంటి అడ్డంకి కాలేదు అని కదా అర్ధం. పేదల కోసం ఆర్థిక విధానాలు రూపుదిద్దే దృక్పథం మన పాలకులకు లేదని స్పష్టంగా బోధపడుతున్నది.
మరో వైపు చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో లక్షల మంది పేదలు ప్రాణ భయంతో కట్టుబట్టలు,నెత్తిన మూటా ముల్లెతో సొంతూళ్లకు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలను ప్రపంచం మొత్తం చూసింది. ఈ నేపథ్యంలో Global Hunger Index (ఆకలితో అలమటించే వారి సంఖ్యను బట్టి దేశాల ర్యాంక్ ను నిర్దారించే సూచీ) ప్రకారం ఈ సంవత్సరం ఇండియా ర్యాంక్ 101.
ఈ నిజం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకంటే ఇది కొత్త సమస్యకాదు. గత సంవత్సరం ఇండియా ర్యాంక్ 94.చూస్తుంటే నానాటికి భారత్ స్థానం దిగజారుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 ప్రకారం న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా వంటి దేశాల సరసన భారత్ నిలబడింది. భారత్ తరువాతి స్థానాల్లో పాపువా న్యూ గినియా (102), ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్, సియార్రా లియోన్ (106), తిమోర్ లెస్తే (108), హైతీ (109), లిబియా (110) వంటి దేశాలు వరుసగా నిలిచాయి.
ఈ జాబితాలో సోమాలియా అట్టడుగున ఉంది. భారత్ కంటే పాకిస్తాన్ (92వ రాంక్ ), నేపాల్, బంగ్లాదేశ్ (76వ రాంక్ )లతో కొంత మెరుగ్గా ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో 2030 నాటికి ఆకలి బాధలు లేని సమాజం దిశగా పురోగతిని కొలవడానికి ఈ జాబితా తయారు చేస్తారు. ప్రస్తుత సూచీలను బట్టి 2030 నాటికి ఈ జాబితాలోని 47 దేశాలు ఆకలి లేని సమాజాన్ని సాధించడంలో వెనుక బడతాయని చెబుతున్నారు.