Sex trafficking ………………………………………
తెలంగాణ లో అమ్మాయిల అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయి. అక్రమ రవాణాకు గురైన యువతులు వ్యభిచార గృహాలకు చేరుతున్నారు. అక్కడ బలవంతంగా సెక్స్ వృత్తిలోకి దిగుతున్నారు. 2020లో ఈ తరహా కేసుల నమోదులో దక్షిణాదిలో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఉత్తరాదిలో మహారాష్ట్ర తెలంగాణ తో సమానంగా ఉంది. ఏపీ ఆ తర్వాత స్థానంలో ఉంది.
యువతుల్ని ఉపాధి .. ఉద్యోగాల పేరిట మభ్యపెట్టి తీసుకొస్తున్న ట్రాఫికింగ్ ముఠాలు వారిని భయపెట్టి.. హింసకు గురిచేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఈ నిజాలను చెబుతున్నాయి.
బంగ్లాదేశ్ నుంచి అధిక సంఖ్యలో యువతులను ట్రాఫికింగ్ ముఠాలు వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అస్సామ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల సరిహద్దుల్లోకి తీసుకొస్తూ .. అక్కడ నుంచి విమానాలు రైళ్ల ద్వారా దేశంలోని మెట్రో నగరాలకు చేరవేస్తున్నారు.
సరిహద్దుల వరకు ఒకరు తీసుకొస్తే .. అక్కడ నుంచి వేరే ముఠా సభ్యులు వారిని తరలిస్తారు. ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఈ ముఠాలు జాగ్రత్తలు తీసుకుంటాయి. పోలీసుల దృష్టి పడకుండా చూసుకుంటారు.తరలింపు సమయంలో దొరికే వాళ్ళు తక్కువే అని చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ సదుపాయాలు పెరిగిన నేపథ్యంలో ట్రాఫికింగ్ ముఠాలకు నిమిషాల్లోనే అన్ని విషయాలు తెలిసి పోతుంటాయి. దీంతో వాళ్ళు అప్రమత్తం అవుతుంటారు.
అయినప్పటికీ పోలీసు బృందాలు కూపీ లాగి బాధితులకు వ్యభిచార గృహాల నుంచి రక్షిస్తున్నారు. జిల్లాలలో ఏర్పాటు చేసిన మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు ఈ కేసులను పరిష్కరించేందుకు కృషిచేస్తున్నాయి. అయితే నిందితులకు శిక్షలు వేయించడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారు.
2020 వ సంవత్సరంలో దేశం మొత్తం మీద 1,651 కేసులు నమోదు అయ్యేయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రల్లో అత్యధికంగా 184 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో వీటి సంఖ్య 171. తెలంగాణలో 2018లో 242, 2019లో 137 కేసులున్నాయి. గత ఏడాది తో పోలిస్తే కేసులు పెరిగాయి.