అద్భుతమైన ఛండాలం! (2)

Sharing is Caring...

Taadi Prakash ……………………………………………………….

Mohan on the great O.V Vijayan (2) ………………………………………….

నాటి రష్యా, చైనా విభేదాల్లో విజయన్ మెల్లగా మావోయిజం వైపు మొగ్గాడు. ఎడిటర్ తో పొసగలేదు. ఈలోగా ‘ఖసక్ ఇందే ఇతిహాసం’ అనే నవల రాశాడు. అది ఇప్పటికి మలయాళంలో ఏడెనిమిది సార్లు అచ్చయింది. నిజానికి కేరళలో ఆయన్ని ఫలానా నవలా రచయిత అంటారు గానీ, కార్టూనిస్టుగా గుర్తుంచుకోరు.

తరువాత హిందూ పత్రికలో ఏడెనిమిదేళ్ళు కార్టూనింగ్. ఎమర్జెన్సీలో కార్టూన్లు వేయడం వదిలేశాడు. ప్రస్తుతం స్టేట్స్ మన్ పత్రికలో ఉన్నాడు.ఎమర్జెన్సీలో ఆయన రాసిన అత్యద్భుతమైన పరమ అసహ్యపు నవల ధర్మపురాణం. కేరళలో పూర్తిగా సీరియలైజ్ కాకుండా మధ్యలోనే ఆపేశారు. దానికి ఆయనే చేసిన ఇంగ్లీషు అనువాదాన్ని ఈమధ్యనే పెంగ్విన్ వారు ప్రచురించారు.

నవల చదివితే వాంతొచ్చినట్టుంటుంది. బంగారు కమోడ్ మీద రాజుగారు టాయ్లెట్ కు కూచునే సీన్ తో మొదలౌతుంది. అప్పుడు రేడియోలో జాతీయ గీతాలాపన. రాజుగారి సుఖవిరేచనం కోసం ప్రజలంతా రెండు నిముషాలు మౌనంగా ప్రార్థిస్తారు. ఇది ఆయాక మంత్రివర్గ సభ్యులంతా రాజుగారి విసర్జనను పంచుకు తింటారు.

ఇక ప్రతి పేజీలో హింసారతి, జైళ్ళు, గూఢచారులు, విదేశీ ఏజెంట్లు, రాజు గారి తైనాతీలు, వాళ్ల ఉంపుడుగత్తెలూ, యుద్ధం, తిండిలేని చంటిపిల్లలూ – ఒక్క ముక్కలో ఇది మన భారతదేశం. ధర్మపురం అంటాడాయన. నవల చదువుతుంటే జనం గావుకేకలూ, రోదనలూ, విలన్ వికటాట్టహాసాలు, చచ్చే పిల్లల మూలుగులూ వినిపిస్తాయి.

“ఛాంబర్ ఆఫ్ హర్రర్స్”లో నడుస్తున్నట్టుంటుంది.కార్టూనిస్టు అనేవాడికి సినిసిజం ఎంతోకొంత ఉంటుంది గానీ ఆయన సినిసిజం మనకి కడుపులో తిప్పుతుంది. ఆయన పేర్చే ప్రిజుడిస్ ని మనం భరించలేం. ఆయన ఉన్మాదాన్ని బొత్తిగా ఒప్పుకోలేం. తట్టుకోలేం. కానీ బొమ్మల్లో మాదిరిగానే (ఇంకా వివరంగా, శక్తివంతంగా) ఆయన అచ్చులో పెయింట్ చేసే దృశ్యాలు వెంటాడి వేధిస్తాయి.

కలల్లో భయపెడతాయి. అత్యద్భుతమైన అసహ్యం. ఒక పట్టాన వదిలించుకోలేరు. మీ కడుపులో పట్టనంతటి అందమైన కక్షని కూరుతాడు విజయన్. కక్కలేరు, మింగలేరు. “సాగా ఆఫ్ ధర్మపురి” పేరిట ఇంగ్లీష్ లో వచ్చింది ఈ నవల. ఏ బుక్ షాపుల్లోనైనా కొని చదవండి. మీ చావు మీరే చావండి. కార్టూనిస్టు అనేవాడు ఇంత దారుణానికి ఒడికట్టగలడా.. అని విస్తు పోగలరు.చక్కని ప్రతిభ, వల్గారిటీ, గొప్ప కళా సిద్ధాంతం, ఈవిల్ జీనియస్, అమృతం, బురద, నెత్తురూ, విదేశీ సెంట్లు, వీటి వింత కాంబినేషన్ విజయన్.

జోకర్ ఏడుపు
“నా వృత్తిలో ఓ మూఢ నమ్మకం బలంగా వుంది. నేను నవ్వించాలి. కానీ నేను చిత్రించాల్సిన వాస్తవం నిండా విషాదం గూడుకట్టుకునుంది” అంటాడు విజయన్.అమెరికా లాంటి పశ్చిమ దేశాల్లో జేమ్స్ తర్బర్ లాంటి కార్టూనిస్టుల ప్రపంచం వేరు. నా ప్రపంచాన్ని తర్బర్ అర్థం చేసుకోలేడు. ఆయన ప్రపంచంలో తెల్లటి ఒంటికొమ్ము గుర్రాలు ఎగిరొచ్చి తోటలో పూలని సుతారంగా ముద్దాడతాయి.

కానీ, నేను తృతీయ ప్రపంచపు కార్టూనిస్టుని. నాముందు గడ్డితిని బతికే చంటిబిడ్డలు కనిపిస్తుంటారు. వాళ్ళు ఆక్స్ ఫామ్ ఎడ్వర్టైజ్మెంట్ లోంచి దీనంగా చూస్తుంటారు. ఆ పసికళ్ళలో ముసలితనం తొంగి చూస్తుంటుంది. బీహార్, ఒరిస్సా, యు.పి.లలో ఎక్కడో వాళ్ళమ్మ ‘గడ్డిదుంప’ ఉడికించి పెడుతుంది. ఇలాంటి దానిమీద కార్టూన్ గీయాలి అంటే కడుపు మండుతుందంటాడు విజయన్. స్వాతంత్య్రం, స్వేచ్ఛ అని అబద్ధాలు చెప్పిన వాళ్ళందర్నీ ఎలుగెత్తి శాపనార్థాలు పెడతానంటాడు.

కార్టూనింగ్ పశ్చిమ దేశాల వరసని మనం అనుసరిస్తున్నాం. కానీ మనది పేద దేశం. మన కార్టూన్ రూపూ, భాషా, తీరూ మనదిగా ఉండాలి. నవ్వినా, ఏడ్చినా అది ఏలూరు ఏడ్చినట్టూ, బెజవాడ కన్నీరు కార్చినట్టూ ఉండాలి గానీ, లండన్ నవ్వినట్టూ, వాషింగ్టన్ బెక్కినట్టూ ఉండకూడదు. ఎవరి ఏడుపు వారే ఏడవాలి. అదే అందం (వికారంగా ఉన్నాసరే…)దీని కోసం బాగా తంటాలు పడాలి. పగలూ, రాత్రి యజ్ఞంలాగా చూడాలీ, చదవాలి.
బొమ్మలు మళ్ళీ గీయాలి. ఇలా చెప్పేదంతా కార్టూనిస్టులమైన మేమంతా చేయుచున్నామా? అంటే మా అందరి బొమ్మలూ ఒక్కదగ్గర పెట్టి ‘లేదూ లేదూ’ అని మీరు గొల్లున నవ్వుతారు. మేం బావురుమని ఏడుస్తాం.

Pl. Read it Also ………………………  అద్భుతమైన ఛండాలం! (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!