ఖైదీల హక్కుల కోసం జైల్లో దీక్ష చేసిన నేత !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా … ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ వచ్చేది . ఒక రోజు పులిహోర మరుసటి రోజు ఉప్మా ఇదీ మెనూ … ఈ ఉప్మా కూడా బియ్యం రవ్వతో చేసిందే . రెండూ కూడా ఖైదీలకు ఇచ్చే రేషన్ బియ్యంతోనే తయారు చేస్తారు తప్ప పూరీలు తదితరాలు ఉండవు. అందుకని …. వాయిదాలకు వెళ్లినప్పుడు ఎస్కార్ట్ పోలీసుల సహకారంతో … ఫూరీలూ, పెసరట్లు లాంటివి తినేవాణ్ణి నేను.

ఓ సారి జైలు సూపర్నెంటు గుడవలయ్య (అదేం పేరు అనుకునేవాణ్ణి …) తో జరిగిన సంభాషణల్లో ఉదయం పూట పులిహార ఉప్మా ప్లేస్ లో ఇడ్లీలు పూరీలు దోశలు పెట్టొచ్చు కదా అన్నా …ఆయన అన్నారూ … ఆ రోజుల్లో ఎం.వి.రమణారెడ్డి అనే నక్సలైట్ ఖైదీ ఉండేవాడు … అతన్తో పాటు ఇంకా కొందరు నక్సలైట్లు ఉండేవారూ … వారు బ్రేక్ ఫాస్ట్ ఉండాలని గొడవకు దిగిన సందర్భంలో ప్రభుత్వం ఈ మెనూ పెట్టింది.

మీకు నెట్ వర్క్ ఉంటుంది కదా … దాంతో ఒకే సారి చాలా జైళ్లల్లో బ్రేక్ ఫాస్ట్ డిమాండ్ ముందుకు తీసుకువచ్చారప్పుడు … దీంతో ప్రభుత్వం సర్లే అనేసింది ఎందుకొచ్చిన తల్నొప్పి అని … బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పిందిగానీ … స్పెషల్ రేషన్ ఎలాట్మెంట్ జరగలేదు బాబూ అంచేత పులిహోర బియ్యం రవ్వ ఉప్మా తప్పవు మీకు అలాగే పండగలకు చేసే మైసూరుపాకు కూడా మీకు పెట్టే శనగపప్పులో కోసి చేసే వంటకమే తప్ప దానికీ విడిగా రేషన్ అలాట్మెంట్ లేదు అని క్లారిఫై చేశారాయన.

ఈ సెనగపప్పు ఏమిటీ అనుకుంటారు కదా … చాలా మంది … అందుకని ఈ విషయం కూడా చెప్పాలి. జైల్లో ఒక రోజు కందిపప్పు పప్పు వస్తుంది. మరో రోజు శనగపప్పు పప్పు వస్తుంది. ఆ తర్వాత రోజు పెసరపప్పు పప్పు వస్తుంది. లంచ్ పప్పు చారు పెరుగు ఉంటుంది. డిన్నర్ కూర సాంబారు ఉంటుంది. అదన్నమాట సంగతి … అలా వచ్చే శనగపప్పులో కొంత తీసి పండగలకు ఘట్టిగా ఉండే మైసూరుపాకులు చేస్తారు. నేను వాట్ని ముద్దుగా ఇటుకరాళ్లు అని పిల్చుకునేవాణ్ణి.

అప్పుడు విన్నా చాలా స్పష్టంగా ఎం.వి.రమణారెడ్డి గారి గురించి … అప్పుడే ఆయన మీద కోపం వచ్చింది… బ్రేక్ ఫాస్ట్ కు స్పెషల్ రేషన్ విషయంలో ఎందుకు పట్టుపట్టలేదు అని … అంతకు ముందు విరసం పత్రికల్లోనూ కెవిఆర్ యమర్జన్సీ నాటి రచనల్లోనూ చదివా … అలాగే ఆయన అనువాదాలు కూడా చదివా … ఆయన నడిపిన ప్రభంజనం పత్రిక గురించి విన్నా … యమర్జన్సీలోనే ఆయన విరసం నుంచీ బయటకు వచ్చి కార్మిక నాయకుడుగా మారారు.

ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ రాజకీయపార్టీల్లో చేరారు. తెలుగుదేశం ఆయనకి హోప్ ఇచ్చినట్టుంది. అందులో చేరారు. ఆయన లానే చాలా మంది ఎన్టీఆర్ ను నమ్మి అందులో చేరారు.తర్వాత బయటపడ్డారు. జీవితం ఎన్ని మలుపులు తిరిగినా ఆయన కలం పక్కన పెట్టలేదు. రాస్తూనే ఉన్నారు. రాజకీయాలే కాదు …విచిత్రంగా … సినిమాల మీద కూడా ఆయన రచనలు చేసేవారు. ఆయనకి ఈ రంగం మీదా పట్టు ఉండడం నన్ను ఆశ్చర్య పరచింది.

బిఎన్, కెవి లాంటి వారి టేకింగును గురించీ వాళ్ల స్కీమ్స్ గురించీ చాలా లోతుగా పరిశీలించి రాసే వారాయన. ప్రొద్దుటూరు నుంచీ ఆయన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల్లో చేరుతూ బయటకు వస్తూ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉన్నప్పటికీ … పొలిటికల్ అవేర్నెస్ తో ఉండేవాడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా మాట్లాడారాయన. రాయలసీమ హక్కుల గురించి మాట్లాడిన చొరవతో తెలంగాణ ఉద్యమాన్ని అర్ధం చేసుకుని మాట్లాడేవారాయన.అప్పుడే ఆయన్ని నేను పన్జేసే టీవీ ఛానల్ చర్చలకు ఆహ్వానిస్తూ అప్పుడప్పుడూ కాల్ చేసేవాణ్ణి. అలా ఆయనతో కొంత కాలం సాన్నిహిత్యం ఉండేది. వాళ్ల అమ్మగారిలో కూడా ఫైటింగ్ స్పిరిట్ బలంగా ఉండేదని రాజమండ్రి జైల్లో ఉండగానే విన్నాను.

రమణా రెడ్డి జైల్లో ఉండగా … వాళ్ళ అమ్మగారు  ఇంటర్యూకి వచ్చినప్పుడు మీ అబ్బాయి నిరాహారదీక్ష చేస్తున్నాడు ఇంటర్యూ ఇవ్వం అని చెప్పినప్పుడు … ఆవిడ అప్పటి సూపర్నెంట్ మీద సీరియస్ అయి దెబ్బలాడి మరీ స్పెషల్ ఇంటర్యూతో కొడుకును కలిసారని అలా జైల్లో చెప్పుకునేవారు. రాయలసీమ రచయితల రచనల్లో ఓ తడి కనిపిస్తుంది. అలాగే కల్సినప్పుడు వారి పలకరింపులో అది అనుభవంలోకి వస్తుంది.

పరిచయం అయిన వెంటనే కలిపేసుకుంటారు ఇది చాలా మంది సీమ రచయితల్లో చూశాన్నేను. ఎమ్వీఆర్ లోనూ ఇది కాస్త ఎక్కువగానే చూశాను. టీవీ జర్నలిస్టుగా పరిచయం చేసుకుని నెమ్మదిగా నా గురించి చెప్పినప్పుడు నువ్వు అనేయడం … కలిపేసుకుని మాట్లాడడం … భలే అనిపించేది … విరసం తొలి నాటి కలం సైనికుడు ఎమ్వీఆర్. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!