ఇడ్లీని ఇష్టపడని వారు బహు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఇడ్లీ కి చాలా ప్రాముఖ్యత నిస్తారు. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈఇడ్లీ చాలామంది ఇళ్లలోనే తయారు చేసుకుంటారు. ఈ ఇడ్లీ మూలాలు ఎక్కడివనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇడ్లీ కి పెద్ద చరిత్రే ఉంది.ఇడ్లీ లో వేయి రకాలున్నాయని అంటారు కానీ అన్ని వాడుకలో లేవు.
కేవలం 10-15 రకాల ఇడ్లీ మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిలో బటన్ ఇడ్లీ, తల్లే ఇడ్లీ, సాంబర్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ ఎక్కువగా లభ్యమవుతాయి. ఇక ఇడ్లీ లోనే రకరకాల పదార్ధాలు కలిపి డ్రై ఫ్రూట్ ఇడ్లీ,ఇడ్లీ చాట్,ఇడ్లీ ఉప్మా,ఇడ్లీ మంచూరియా, ఇడ్లీ బజ్జీ వంటివి కూడా తయారు చేస్తున్నారు. అలాగే గోదావరి జిల్లాలో పొట్టిక్కలు చేస్తారు.ఇవి కూడా ఇడ్లీలో ఒక రకం. ఇవి అన్నిచోట్లా లభ్యంకావు.
ఇక ఇడ్లీ ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చిందని ఫుడ్ హిస్టారియన్ కె.జె.ఆచార్య పరిశోధించి చెప్పారని ఒక కథనం ప్రచారంలో ఉంది . ఇండోనేసియా వారి ‘కెడ్లీ’నే ఇండియాలో ‘ఇడ్లీ’ గా మారిందని అంటారు. అలాగే లిజి కొలింగమ్ అనే మరో ఫుడ్ హిస్టారియన్ అరబ్ వ్యాపారులు సముద్రతీర ప్రాంత ప్రజలకు ఈ ఇడ్లీని పరిచయం చేశారని అపుడెపుడో శెలవిచ్చారు. ఇంకొందరేమో ఇడ్డలిగె’ అనే కన్నడ పదం నుంచి ‘ఇడ్లీ’ వచ్చిందని చెబుతారు.
అలాగే 12వ శతాబ్దానికి చెందిన సంస్కృత పదం ‘ఇడ్డరిక’ నుంచి ఇడ్లీ వచ్చిందనే వాదన కూడా ప్రచారంలో ఉంది.మరికొందరు సౌరాష్ట్ర (గుజరాత్) ప్రాంతానికి చెందిన నేతకార్మికులు ఉపయోగించే ‘ఇడడ’ నుంచి ఈ ఇడ్లీ పుట్టిందని అంటారు.
కాగా అంతకు ముందే పదకొండవ శతాబ్దం (1127-1138 A.D) లో మూడవ సోమదేవుడు అనే చాళుక్య ప్రభువు “అభిలాషితార్థ చింతామణి” అని ఓ పుస్తకాన్ని రచించాడు. దాన్నే “మానసోల్లాసం” అని పిలుస్తారు. అందులో ఇడిలికం గురించి ఒక శ్లోకం ఉంది. సుశీతా ధవళా శ్లక్ష్ణా ఏతా ఇడరికా వరాః |తస్యైవ మాషపిష్టస్య గోళకాన్ విస్తృతాన్ ఘనాన్ |… తెల్లనివీ, మృదువైనవి అయిన ఇడ్లీలు గొప్పవి. అవి ఉద్దిపిండితో గుండ్రంగా, పెద్దగా, బరువుగా చేయబడతాయని రాశారట. శ్రీనాథుని కాశీఖండంలో ఇడ్లీ గురించి ప్రస్తావించినట్టు చెబుతారు. కొన్నివందల ఏళ్ళ క్రితం గ్రీస్, రోమ్, చైనా వంటి అనేక దేశాలతో మనకు సంబధాలున్నాయి. యాత్రికులు, సైనికుల రాకపోకలు, సముద్రం మీదుగా ఓడల ద్వారా వాణిజ్యం జరిగేది.
నాటి పల్లవ, చోళ,చాళుక్య, కాకతీయ, రాష్ట్రకూటరాజులు ఇండోనేషియా, కాంబోడియా తదితర ప్రాంతాలకు సామ్రాజ్యాలను విస్తరించారు. అక్కడి రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. అక్కడి వారితో పాటు అవిరిమీద ఉడకపెట్టే పదార్థం ‘కెడ్లి’ తయారీ విధానం మన దేశానికి చేరిందని కూడా అంటారు.
ఏడవ శతాబ్దం నాటి టెబెట్ సన్యాసుల గ్రంథాలలో భారతీయులకు ఆవిరిమీద ఉడకబెట్టే విధానం తెలియదని రాసినట్టు చెబుతారు. మొత్తానికి ఈ వంటకం ఏ దేశానిదైనా .. మూలాలు ఎక్కడివైనా ఎక్కువ మంది ఇష్టపడే అల్పాహారంగా ఇక్కడ స్థిరపడిపోయింది. కాలానుగుణంగా పలు రూపాలు సంతరించుకుని ఆకలి తీరుస్తున్నది.
‘రామసేరి ఇడ్లీ’ ఇడ్లీ లలో రాజు లాంటిది. కేరళలోని పాలక్కాడ్‌లో చిన్నకుగ్రామమైన రామసేరి పేరుతో ఆ ఇడ్లీలు ప్రఖ్యాతి గాంచాయి. రామ సెరిలో ఇడ్లీ లు అద్భుతంగా ఉంటాయట. ఈ ఇడ్లీ’ దోసె ‘ ను పోలి ఉంటుంది. విభిన్నఆకృతితో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. డిఫెన్స్ ఫుడ్ రిసెర్చి లెబోరేటరి(డీఎఫ్‌ఆర్‌ఎల్) వారు కూడా ఆస్ట్రోనాట్స్ కోసం ప్రత్యేకంగా ‘స్పేస్ ఇడ్లీ’తో పాటు పౌడర్ చెట్నీ తయారు చేసి పంపారట. చెన్నైకి చెందిన ఎనియవన్ అనే వ్యక్తి ఇడ్లీకి వీరాభిమాని. ఇడ్లీకి ఒకరోజు ఉండాలంటూ ‘వరల్డ్ ఇడ్లీ డే’ మొదలుపెట్టాడు. మార్చి 30న ఇడ్లీ జరుపుకుంటున్నారు.
(సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు గారు రాసిన వ్యాసం చూసాక ఇది రాయాలనిపించింది )
———–KNM