ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మన నుంచి దూరమై అపుడే నాలుగేళ్లు అవుతోంది . ఈ సందర్భంగా బాలు స్మృతులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. చిన్నతనం లో పై ఫోటోలో కనబడే ఇంట్లో బాలు కొంతకాలం పెరిగారు. ఆడుకున్నారు . పాటలు పాడుకున్నారు.
ఈ ఇల్లు ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర ఉన్న మాచవరం లో ఉంది. బాలు తాత గారు ఈ ఇంటిని నిర్మించగా తండ్రి సాంబమూర్తి దానిని అభివృద్ధి పరిచారు. తర్వాత కాలంలో ఈ ఇంటిని అమ్మేసి సాంబమూర్తి నెల్లూరు జిల్లాకు వెళ్లారు. ఈ మాచవరం కి దగ్గర్లోనే బాలు బంధువులు ఉన్నారు. బాలు మేనమామ ములుగు సుబ్బులు ఇక్కడికి దగ్గర్లోని మడనూరులో ఉండే వారు.
తర్వాత కాలంలో కూడా బాలు మేనమామ గారింటికి వచ్చి తమ ఇల్లు చూసి వెళుతుండేవారు. కొన్నేళ్ల క్రితం కందుకూరు కి చెందిన అభిమానులచే ఆ ఇంటి ఫోటోను తెప్పించుకున్నారు. బాలు పుట్టింది నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామం అయినప్పటికీ పలు ప్రాంతాల్లో పెరిగారు. సాంబమూర్తి నెల్లూరులోనే స్థిరపడి తిప్పరాజు వీధిలో సొంత ఇల్లు కట్టుకున్నారు. బాలు పెరిగి పెద్దయ్యాక తన మకాం చెన్నైకి మార్చారు.
తదనంతరం నెల్లూరు ఇంటిని ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించాలని భావించి కంచి పీఠం వారికి బాలు అప్పగించారు. ఇందులో వేదపాఠశాల నిర్వహిస్తున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య వారిని నెల్లూరుకు బాలు ఆహ్వానించారు.
ఆ ఇంట్లో కంచి పీఠాధిపతికి స్వయంగా పూజలు నిర్వహించి … ఇంటి పత్రాలను శంకరాచార్య స్వామికి బాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి వారు బాలును అభినందించారు. అలాగే బాలు ఎన్నో గుప్త దానాలు చేసారు. ఎంతమందికో అవకాశాలు ఇచ్చారు. తనదగ్గర పనిచేసిన టెక్నిషియన్స్ కు , కొంతమంది అభిమానులకు సంగీత పరికరాలు కొనిచ్చిన ఉదారణలున్నాయి.
దక్షిణాది,ఉత్తారాది భాషలనే కాకుండా బాలు అన్ని భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. అలాగే నాలుగు భాషల్లో పాటలు పాడినందుకు ఆరు జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక గాయకుడు బాలు ఒక్కరే.
కాగా శంకరాభరణం లోని రాగం తానం పల్లవి అనే పాట బాలూకి ఇష్టమైన పాట .. బాలు స్వర పేటికకు రెండు సార్లు ఆపరేషన్ జరిగింది . అయినా ఎపుడూ ఆ స్వరం ఆగలేదు . ఇక బాలు గాడ్ ఫాథర్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి. ఆమాట ఆయనే స్వయంగా చెప్పారు.
కోదండపాణి పేరుతో ఆడియో స్టూడియో మద్రాసు లో నిర్మించారు . సామాన్య కుటుంబం లో పుట్టి గొప్ప స్థాయికి ఎదిగిన బాలు ని కరోనా పొట్టన పెట్టుకుంది. ఎందరో అభిమానులకు ఆయనను దూరం చేసింది. గాన గాన గంధర్వుడికి “తర్జని” నివాళులు అర్పిస్తోంది.
——-KNM
PHOTO COURTESY…. Nirmal Akkaraju
post updated on 25-9-2024