కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం !

Sharing is Caring...

A film that mirrors human relationships ……………………………

ఎన్టీఆర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. ఎంతటి కఠినులైనా సినిమా చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంథానికి నిర్వచనం ఈ సినిమా. 1962లో రిలీజ్ అయింది. 

ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. చెల్లెలిపై పెంచుకున్న ప్రేమను, అనురాగ గాఢతను అనితర సాధ్యంగా తెరపై పండించి అన్నగారిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు ఎన్టీఆర్.

అందరిలా ఆప్యాయతనే కాదు. పరువును, ప్రాణాలను సైతం చెల్లెలి కోసం త్యజించిన అన్నయ్యగా ఎన్టీఆర్ విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం ఇది. ఈ సినిమా తర్వాత అన్నయ్యా మీలాంటి ఒక్క అన్నయ్య ఉంటే జీవితంలో ఇంకేదీ కోరుకోం అంటూ కుప్పలు తెప్పలుగా ఆడపడుచుల ఉత్తరాలు ఎన్టీఆర్ కి వచ్చాయట. తర్వాత రోజుల్లో అన్న పాత్రలు కొన్ని చేసినా ఈ సినిమా కొచ్చిన స్పందన మరే సినిమాకు రాలేదు. 

ఇందులో ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా నటించారు. ప్రఖ్యాత మలయాళ రచయిత , స్క్రీన్ రైటర్ కె.పి. కొట్టారక్కర రాసిన కథను దర్శకుడు ఎ. భీంసింగ్‌ ‘పాశమలర్’ గా తమిళ సినిమా తీశారు. దాని ఆధారంగానే ‘రక్త సంబంధం’ తెలుగులో తీశారు.  

తమిళంలో శివాజీగణేశన్, సావిత్రి చేయగా అవే పాత్రలను తెలుగులో ఎన్టీఆర్,సావిత్రి చేశారు. సావిత్రి భర్త ఆనంద్ పాత్ర కోసం కాంతారావును ఎంచుకున్నారు. తమిళ చిత్రంలో సావిత్రి నిజ జీవిత భర్త జెమినీ గణేశన్ ఆ పాత్రను పోషించారు. సావిత్రి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆమె నటనకి ప్రేక్షకులు తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతారు.కరుణ రసాభినయంతో సావిత్రి కన్నీళ్లు పెట్టిస్తారు. అన్నాచెల్లెళ్ళ అనుబంధం కథతో  రక్త సంబంధం చిత్రాన్ని మరిపించే మరో చిత్రం రాలేదు.

డైరెక్టర్ వి.మధుసూదనరావు కేరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఇది. ఈ చిత్రం కోసం ముందు అక్కినేనిని సంప్రదించారు. ఆయన నిర్మొహమాటంగా ‘సావిత్రి తప్ప మరొకరు ఈ పాత్రకి న్యాయం చేయలేరు . అలా అని ఇప్పుడు నేను సావిత్రికి అన్నగా నటిస్తే… జనం తిప్పి కొడతారని స్పష్టం చేశారు. సుందర్‌ లాల్‌నహతా రంగంలోకి దిగి ఎన్టీఆర్ ను డూండీ  ద్వారా సంప్రదించారు. ఆయన రెండో ఆలోచన లేకుండా డేట్స్‌ కన్‌ఫర్మ్‌ చేశారు.

ఎం.ఎస్‌. విశ్వనాథన్ బిజీగా వుండి మ్యూజిక్ అందించలేకపోయారు.ఆ బాధ్యత ఘంటసాలకి అప్పగించారు.రెండు పాటలకు ఒరిజినల్ ట్యూన్స్ తీసుకుని మిగతావన్నీ ఘంటసాల చేశారు.ముళ్లపూడి వెంకటరమణ నాటకీయతను పండిస్తూ మంచి డైలాగులతో బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. 

ఇక పాటలన్ని ఆణిముత్యాలే.  ‘చందురుని మించి అందమొలికించు ” అన్న పాట  హృద్యంగా ఉంటుంది అనిశెట్టి రచన అది. ‘బంగారు బొమ్మ రావేమే… పందిట్లొ పెళ్లి జరిగేనే…’ ఆరుద్ర రాశారు. ఈ రెండు పాటలు ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్.

మిగతావి కూడా బాగుంటాయి. అన్ని సందర్భానుసారంగా వచ్చే పాటలే. నిర్మాతలు ఊహించినట్టే సినిమా సూపర్ హిట్ అయింది. సుందర్ లాల్ నహతా .. డూండీలు ఈ సినిమాను నిర్మించారు. అందరికి ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. యూట్యూబ్ లో సినిమా ఉంది. ఆసక్తి గలవారు చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!