ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తోంది. ఈ క్రమంలో వినిపిస్తున్న మాట తాలిబన్లు. ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకుంది ఈ తాలిబన్లే.తాలిబ్ అనే పదం నుంచి ఈ తాలిబన్ పుట్టుకొచ్చింది.
అరబిక్ లో తాలిబ్ అంటే విద్యార్థి అని అర్ధం.తాలిబన్లు అంటే విద్యార్థుల సమూహం అనుకోవచ్చు.1980 లో ఉత్తర పాకిస్తాన్లో ఆఫ్ఘన్ శరణార్థుల కోసం స్థాపించబడిన మదరసాలలో (ఇస్లామిక్ మత పాఠశాలలు) శిక్షణ పొందిన విద్యార్థులనే తాలిబన్లు అంటారు.
1990 దశకంలో తాలిబన్లు సమూహం గా ఏర్పడ్డారు. అయితే క్రమంగా ఒక మతానికి చెందిన వ్యక్తుల సమూహంగా రూపాంతరం చెందింది. ఈ సమూహం అతి క్రూరంగా వ్యవహరిస్తుంది. అందుకే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాకతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తాలిబన్లు మధ్యరాతి యుగం నాటి ఆచారాలను అమలు చేస్తారు.
1990 ప్రాంతంలో సోవియట్ సేనలను తరిమి కొట్టిన ముజాహిదీన్ వర్గాలు ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రెండు వర్గాలు ఎపుడూ గొడవ పడుతూ ఉండేవి. ప్రజలపై పన్నుల భారం మోపి పీడించేవి.
పాలకుల అనుచరులు ప్రజలను రకరకాలుగా వేధించేవారు. ఈ క్రమంలో 1994 లో ముల్లా ఒమర్ నాయకత్వంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ లో సుస్థిరతను,శాంతిని నెలకొల్పేందుకు పూనుకున్నారు.
వీరంతా ఉత్తర పాకిస్థాన్ లోని ఇస్లామిక్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే. సౌదీ అరేబియా అప్పట్లో ఆ పాఠశాలలకు నిధులు సమకూర్చేది. తొలి తరం వారంతా విద్యార్థులే అయినందున వారికి తాలిబన్లు అనే పేరు స్థిరపడింది.
అప్పటి నుంచి వారిని తాలిబన్లు అని పిలిచేవారు. పాక్ అండదండలతో .. ఐ ఎస్ ఐ సహాయంతో తాలిబన్లు ముజాహిదీన్ వర్గాలను తరిమి కొట్టారు. 1998 నాటికి ఆఫ్ఘనిస్థాన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి.
ప్రజలు సంతోష పడ్డారు. మొదట్లో బాగానే పాలించారు. కొన్నాళ్ళు గడిచాక తాలిబన్లు రెచ్చిపోయి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. అతివాదుల పెత్తనం పెరిగి పోయింది. ఇస్లామిక్ పాలన పేరిట కఠినమైన షరియా చట్టాన్ని ప్రవేశపెట్టారు.
మధ్య యుగం నాటి ఆంక్షలు,శిక్షలు అమలు చేశారు. హంతకులను బహిరంగంగా ఉరి తీసేవారు. అక్రమ సంబంధానికి పాల్పడితే బహిరంగంగా తలలు నరికేవారు. దొంగతనాలు చేస్తే చేతులు తీసేసేవారు. పురుషులు తప్పనిసరిగా గడ్డాలు పెంచాలి. మహిళలు బురఖాలు వేసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయట తిరుగకూడదు. బాలికలు పదేళ్ళు దాటితే పాఠశాలలకు వెళ్లకూడదు.
టీవీ, సినిమాలను బంద్ చేశారు. ఇస్లామిక్ మతం నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. పరమత సహనానికి అసలు స్థానం లేకుండా పోయింది. 2001 లో బామియాన్ బుద్ధ విగ్రహాలను పేల్చి వేశారు. ఎంత కాదన్నా తాలిబన్లకు పుట్టినిల్లు పాకిస్థాన్.
పైకి కాదని అంటున్న తాలిబన్లు తొలి తరం నేతలు పాక్ లోనే చదువుకున్నవారు. పాక్ నేతల సహాయ సహకారాలతోనే ఆఫ్ఘనిస్థాన్ ను ముట్టడించారు. ఒక దశలో వారు పాక్ లోనూ అరాచాకాలు సృష్టించారు. పెషావర్ లో ఒక పాఠశాల విద్యార్థుల ను ఊచకోత కోశారు.
2001.. సెప్టెంబర్ 11 న అమెరికాపై దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్థాన్ లో స్థావరం ఏర్పాటు చేసుకున్నాడని అమెరికాకు సమాచారం అందింది. లాడెన్ ను తమకు అప్పగించాలని తాలిబన్ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. అయితే తాలిబన్లు అందుకు అంగీకరించలేదు.
దాంతో తిక్కరేగిన అమెరికా తాలిబన్ల అంతు చూసేందుకు సైనికులను రంగంలోకి దించింది. దేశాన్ని కంట్రోల్ లోకి తీసుకుంది. ప్రభుత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తాలిబన్లు అప్పటికి పక్కకు తప్పుకున్నప్పటికీ మరల విజృంభించారు. పౌర ప్రభుత్వాలను వరుస దాడులతో బెంబేలెత్తించారు.క్రమంగా బలహీన పరిచారు.
2001 నుంచి తాలిబన్లపై చేస్తోన్న యుద్ధానికి గాను అమెరికా సుమారు 2 ట్రిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇది పెనుభారంగా మారడంతో తాలిబన్లతో షరతులతో కూడిన శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం తన సైనిక బలగాలను వెనక్కి పిలిపించింది.
ఒప్పందం ప్రకారం ఆఫ్ఘన్ లో ఉన్న ప్రభుత్వం తో తాలిబన్లు అధికారం పంచుకోవాలి. ముందు ఒప్పందానికి ఒకే అని సైనికులు అమెరికా వెళ్ళాక…తాలిబన్లు దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కాబూల్ ను హస్తగతం చేసుకున్నాక యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించారు. త్వరలో అఫ్ఘానిస్థాన్‌ను ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటిస్తామని కూడా చెబుతున్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు.
దీంతో తాలిబన్లు పూర్తిగా దేశాన్ని చేజిక్కించుకున్నారు. అమెరికా తలచింది ఒకటి… జరిగింది మరొకటి .. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి .. దాని గుర్తింపు కోసం ప్రపంచ దేశాలను కోరతామని తాలిబన్లు అంటున్నారు.
———-KNM