Nirmal Akkaraju …………………………………..
ఎఱ్ఱ చందనం ప్రపంచంలోనే అరుదైన చెట్టు. బడా స్మగ్లర్లు ఆ చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. తెర వెనుక వారుండి కూలీలచేత చెట్లు నరికిస్తుంటారు. ఇదొక పెద్ద ఇండస్ట్రీ స్థాయికి ఎదిగింది. చెట్లు నరకడం నుంచి .. ఆ దుంగలను ఎలా రవాణా చేయాలో కూలీలకు శిక్షణ ఇస్తారు. అటవీశాఖ అధికారులు వచ్చినపుడు .. ఎలా తప్పించుకోవాలో మెళకువలు నేర్పిస్తారు.
అయితే ఒక్కోసారి కూలీలు దొరికి పోతుంటారు.గతంలోఎన్కౌంటర్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. టన్నుకు కోటి రూపాయలు ధర పలికే ఈ ఎఱ్ఱ చందనం చెట్లు చిత్తూరు,కడప,కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. అక్కడే వేల మంది కూలీలు ఎఱ్ఱ చందనం స్మగ్లింగ్ ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు. ఉపాధి దొరక్క ఖాళీగా ఉండే యువతకు ఎర వేసి శిక్షణ ఇచ్చి ఈ పనులు చేయిస్తున్నారు. అధికారులకు దొరకనంత కాలం బాగానే ఉంటుంది .. దొరికితే మాత్రం బతుకు రక్త చందనం గా మారుతుంది.
ఆ నాలుగు జిల్లాల్లో వందమందికి పైగా స్మగ్లర్లు ఉన్నారు. తెలిసి … తెలియక ఈ ముఠాల ఉచ్చులో ఇరుక్కుని ఎందరో జైలు పాలవుతున్నారు. తల్లి తండ్రులు మాత్రం పిల్లలను బయటకు తీసుకురాలేక . ఇబ్బందులు పడుతున్నారు.
ఓ తండ్రి ఆవేదన …… ఆయన మాటల్లోనే ….
“మాది కడప జిల్లా పొద్దుటూరు.నేను టైలర్ ని సార్..కళ్ళు సరిగా అవపడక, వ్యవసాయం చేస్తున్నాను. పొలం ఉంది తెలుగు గంగ, రాజశేఖర్ రెడ్డి పుణ్యాన పోతి రెడ్డి పాడు, కె-సి కెనాల్ నీళ్ళతో బాగానే ఉన్నాము. వరి, అరటి, మినుము పండుతాయి. మా ఊరిలో రెండు కార్లు వేస్తాము. 2004 దాక కరవు కానీ తర్వాత నీళ్ళొచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం రైతులకు బానే చేస్తుంది సార్. నీళ్ళు రాకపోయినా ఎండిన బోర్లకు 2004 తర్వాత జీవం వచ్చింది.
నాకొక కొడుకు. వాడికి డిగ్రీ మూడవ సంవత్సరం అయిపోయింది. చెడు వ్యసనాలు పట్టాడు. సారా తాగడం, బిర్యానీ తినడం ఇంటికి రావడం. డబ్బులేడ నుండి వస్తున్నాయో తెలియదు. మాకు అనుమానం వచ్చి అడిగినాం సార్. ఫ్రెండ్స్ ఇస్తున్నారని చెప్పాడు.ఒక రోజు ఫోన్ వచ్చింది, నీ కొడుకును పోలీసులు పట్టుకున్నారని…నాకు వెంటనే కళ్ళ ముందు నా చిన్నతనం గుర్తొచ్చింది.
మా ఊర్లో మా జిల్లాలో ఎఱ్ఱ చందనం ఎక్కువ సార్..అది విజయవాడ, మద్రాసు, బెంగుళూరు, కొంత చైనా సింగపూర్ పోతుందంట సార్ .మా ఫ్రెండ్స్ కొందరికి కొంత మంది షావుకార్లు తాపిచ్చే వారు. ఫ్రీ గా వస్తుందని తాగేవారు. తర్వాత అప్పట్లో 500 ఇస్తామంటే వాళ్ళెంబడ పోయేటోళ్ళు. అడవుల్లో ఎఱ్ఱ చందనం దుంగలు కొట్టి తోలేవారు. పట్టు కుంటే వీళ్ళ జీవితాలు నాశనం..
షావుకార్లు మటుకు తప్పుకునేవాళ్ళు. కొన్ని సార్లు వాళ్ళే పెద్ద లోడు తప్పించడానికి జీపు లోడు పట్టించేవారు. అలా కూలీలు ఎప్పుడూ దొరికేవారు షావుకారు తప్పుకునేవారు. ఇప్పుడు నాకొడుకు ఒంగోలు సబ్ జైల్ లో ఉన్నాడు..ఏందిరా అని వచ్చాను. నాయనా బొలేరో ఎక్కు ముందు పైలట్ గా మేముంటాము..అన్నారు. విజయవాడ లో దింపి వస్తే 5 వేలు ఇస్తామన్నారు.
ఇదే మొదటిసారి, ఇంతకు ముందు తాపాడు కదా కాదనలేకపోయాను నాయనా అన్నాడు. ఇప్పుడు బెయిల్ కోసం ఒక లాయర్(నేను కాదు)దగ్గరకు వచ్చాను. డబ్బులు అప్పు చేశాను. కరోనా కదా మా ఇంటోళ్ళు పెట్టిన బువ్వ, బిస్కెట్లు ఇవ్వనివ్వలేదు ఇదిగో సార్ అని డబ్బా చూపారు. కళ్ళల్లో నీళ్ళు పిల్ల నాయాళ్ళకు తెలియదు. షావుకార్లు ఆశ చూపి ఊళ్ళో పిల్లలని వదలరు. వీళ్ళు దొరుకుతుంటారు.షావుకార్లను కట్టడి చేసేదాకా మా జీవితాలు ఇంతే. వాళ్ళకి లక్షలు, కోట్లు, మాకు అప్పులు, కేసులు. ఇది మా చిన్నప్పటి నుండి కడప జిల్లాలోని కొన్ని ఊర్లలో ఎఱ్ఱ చందనం కూలీల కథ ” అంటూ అతగాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.