మోటుపల్లి లో కాకతీయుల తమిళ శాసనం !

Sharing is Caring...

 Tamil inscription of the Kakatiyas!…………………………………..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు.

మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి గోపుర గోడ పై ఉన్నఈ శాసనాన్ని కనుగొన్నారు. ఆలయ పునరుద్ధరణ పనుల కోసం మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ అధ్యక్షులు బోండా దశరథరామిరెడ్డి ఆహ్వానం మేరకు శివనాగిరెడ్డి మోటుపల్లి వెళ్లారు.

ఆలయాన్ని పరిశీలించే క్రమంలో ఈ శాసనం వెలుగు చూసిందని శివనాగిరెడ్డి చెబుతున్నారు. గోడ నిర్మాణంలో అడ్డంగా పెట్టిన ఓ రాయిపై ఉన్న అక్షరాలను అచ్చు తీసి చదవగా అది ప్రతాపరుద్రుడు వేయించిన ‘దాన శాసనం’ గా తేలిందని వివరించారు. ఈ అంశాన్ని కేంద్ర పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో ఆ శాసనం నకలును తీశామని .. మోటుపల్లి ని దేశి ఉయ్యకొండపట్నం అనే వారని … ఒక తమిళ ఉత్సవానికి కొంత భూమిని దానం చేసినట్టు శాసనంలో ఉన్నట్టు మునిరత్నం రెడ్డి వివరించారని శివనాగిరెడ్డి అంటున్నారు.

మోటుపల్లి రేవు పూర్వ కాలంలో వాణిజ్య కేంద్రం గా భాసిల్లింది. వ్యాపార రీత్యా తమిళులు ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే ప్రతాప రుద్రుడు తమిళంలో శాసనం వేయించి ఉంటారని  శివనాగిరెడ్డి అభిప్రాయ పడ్డారు.  

ఆ శాసనం ప్రకారం స్థానిక వర్తకుడొకరు  రాజ నారాయణ్ పెరుమాళ్  ఆలయం నిర్మించి .. ఒక ఉత్సవం నిర్వహించేందుకు క్రీ.శ. 1308 ఆగస్టు 1 న స్థలాన్ని దానం చేశారు. అదే విషయాన్నీ ప్రజలకు తెలియ జెప్పడం కోసం ప్రతాప రుద్రుడు శాసనం వేయించారు. అప్పట్లో కాకతీయులు ఓరుగల్లు కేంద్రంగా తెలంగాణా, ఆంధ్రాలను పాలించారు.

కాగా మోటుపల్లి వీరభద్రాలయంలో క్రీ.శ.1244లో గణపతిదేవుడు సముద్ర వ్యాపారుల భద్రత కోసం అభయ శాసనం ఒకటి  వేయించారు. తెలుగు, సంస్కృత, తమిళభాషల్లో ఈ శాసనం ఉంది. ఆ శాసనం వేసిన 64 ఏండ్లకు ప్రతాపరుద్రుడు తమిళ శాసనాన్ని వేయించారు.

కోదండరామస్వామి గర్భాలయ అధిష్ఠానంలోని కుముద వర్గంపై దాదాపు 10తమిళ శాసనాలున్నాయని, వాటి నకళ్లు తీసి, చారిత్రక విషయాలను కనుగొనాలని కేంద్ర పురావస్తుశాఖ, శాసన విభాగ సంచాలకులకు విజ్ఞప్తి చేసినట్టు శివనాగిరెడ్డి వివరించారు.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూవీరత్నం August 7, 2021
error: Content is protected !!