Thrilling experience………………………………………….సినిమాలలో మనం నదుల మీద.. సముద్రాల మీదుగా నడిచి వెళ్లే దేవతలను .. దేవుళ్లను చూసుంటాం. వారికి అపూర్వ శక్తులు ఉన్నాయి కాబట్టి అది సాధ్యం అనుకోవచ్చు. అయితే అలాంటి శక్తులు లేకపోయినా మనం కూడా నది మీద నడిచే అవకాశం ఉంది. అయితే పారుతున్న నది మీద కాకుండా గడ్డ కట్టిన నది మీద. అది పూర్తిగా సాధ్యమే. అది ఎక్కడో కాదు మన ఇండియా లోనే. నిజంగా అదొక అరుదైన అనుభవం. అద్భుతమైన అనుభూతి.
అలాంటి అనుభూతి సొంతం చేసుకోవాలంటే మనం లద్ధాఖ్ ప్రాంతానికి వెళ్ళాలి. ఆ నది పేరు ఏమిటంటే … జన్ స్కార్. ఇది సింధు నదికి ఉపనది. ఈ నది జన్ స్కార్ …లేహ్ కొండల మధ్య నున్నలోయ గుండా ప్రవహిస్తుంది.శీతాకాలంలో మాత్రం ఇది ఘనీభవించి గడ్డ కడుతుంది.
ఆ సమయంలో దీన్నేజన్ స్కార్ ప్రాంత ప్రజలు రహదారిగా ఉపయోగిస్తారు. లేహ్ చేరుకోవడానికి ఈ మార్గాన్నివాడుతుంటారు. ప్రతి రోజూ వస్తువులు కూడా చిన్న వాహనాల ద్వారా రవాణా అవుతాయి.
ఇక్కడ ఇచ్చిన ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించండి. అందులో కనబడుతున్నది నదే..గడ్డకట్టిన నది ప్రాంతం ..రహదారిలా కనిపించే ఆ నది పైనే యాత్రీకులు నడుస్తున్నారు. మంచు గడ్డ కట్టి రాతిపలక లాగామారుతుంది.
అలాంటి పలకలతో ఆ మార్గమంతా నిండి ఉంటుంది. అందుకే సులభంగా నడవవచ్చు. ఇక్కడ మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. ఈ నది పై ప్రయాణం చేసేందుకు ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు.
ఈ నది పై నడకను చాదర్ ట్రెక్ అంటారు. చాదర్ ట్రెక్ ఎంజాయ్ చేయాలనుకునే వారు లేహ్ కెళ్ళాలి. అక్కడ ట్రెక్ నిర్వాహకులు ఉంటారు. వారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. యాత్రికులు కనీసం 24 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఒకే అయితే … ట్రెక్కింగ్ కోసం ప్రతిరోజూ 40 నుండి 50 మంది ని అనుకూల సమయంలో అనుమతిస్తారు.
మొత్తం ట్రెక్ 105 కిలోమీటర్లు ఉంటుంది. 4 లేదా 5 రోజులు పడుతుంది. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం బాగుంటుంది. గైడ్స్ మన కూడా వస్తారు. మధ్యలో రాత్రి బస అంటే వాటర్ ప్రూఫ్ స్లీపింగ్ టెంట్స్ లో ఏర్పాటు చేస్తారు.
అక్కడే భోజన సదుపాయం కల్పిస్తారు. అందుకు గాను సుమారు మనిషికి 20 వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఈ నడక కోసం ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకోవాలి. మొత్తానికి ఇదో థ్రిల్లింగ్ అనుభవం. అవకాశం ఉంటే వెళ్ళిరండి.
——-KNM