Business with Ghosts …………………………………..దెయ్యాల పేరు మీద వ్యాపారం ఇపుడు జోరుగా సాగుతోంది. విదేశాలలో ఎంతోమంది వెబ్సైటులు పెట్టి ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. చాలామంది దెయ్యాలు /ఆత్మలు అంటే ఇష్టపడతారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అవకాశం దొరికితే చూడాలని ప్రయత్నిస్తారు. దెయ్యాలు /ఆత్మలు అంటే నమ్మకం లేని వాళ్ళకంటే నమ్మకం ఉన్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉండటమే ఇందుకు కారణం. దెయ్యాల కథలతో తీసిన సినిమాలకు, సీరియల్స్ కు అందుకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఆత్మలను చూడాలనుకుంటే..
మీకు ఆత్మలు ఉన్నాయని నమ్మకం ఉన్నా, లేకపోయినా.. వాటిని చూడాలనుకునే వారి కోసం కొన్ని వెబ్సైట్లు వెలిశాయి. ఆత్మలను చూసేందుకు ఇష్టపడే వ్యక్తులు, సందర్శకుల కోసం ఇలాంటి సైట్లు ప్రపంచవ్యాప్తంగా దెయ్యాలు తిరిగే ప్రదేశాల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఘోస్ట్ హంట్ వెబ్సైట్స్ లోకి వెళితే ఎక్కడెక్కడ భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి? అక్కడికి దగ్గర్లో బస ఏర్పాట్లు ఏమిటి ?… చెల్లించాల్సిన మొత్తం వివరాలు కనిపిస్తాయి. మీకు అనుకూలమైన రోజులో మీకు నచ్చిన ప్రదేశాన్ని బుక్ చేసుకుంటే, అక్కడ ఒక రాత్రి గడిపేందుకు అవకాశం ఆసైట్లు కల్పిస్తాయి.
వివిధ సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లేముందు మనం ఎలా హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటామో అదే పద్దతిలో ఈ ఘోస్ట్ వెబ్సైట్స్ ద్వారా అన్ని బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆత్మలు /దెయ్యాలున్న ప్రదేశాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6.30 వరకూ గడపవచ్చు. అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా? శబ్దాలు, కనిపించే ఆకారాల వెనుక దాగిన మిస్టరీ గురించి తెలుసుకోవచ్చు.
అయితే ఈ హాంటెడ్ ప్రదేశాలకు వెళదామనుకునే వారు ఖచ్చితంగా కొన్ని షరతులు పాటించాలి. 18 ఏళ్లలోపు వారికి ప్రవేశం లేదు. ఆనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, గర్భిణులకు, మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ అలవాటు ఉన్నవారికి అనుమతి లేదు. ఔత్సాహికులకు బీమా సదుపాయం కూడా ఉన్నది. నిర్వాహకుల అనుమతితోనే కెమెరాలు తీసుకెళ్లాలి. మరింకెందుకు ఆలస్యం.. మీకు ధైర్యం ఉంటే ఓసారి ప్రయత్నించండి. తప్పు ఏముంది ? ఇండియాలో అయితే ఇలాంటి సైట్లు మొదలు కాలేదు.
———–KNM