Ramjee Pasam ……………………………………………
Godavari Pulasa Fish ……………………… గోదావరి పులస వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. “పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి” అంటారు. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు ‘హిల్సా’ అని పిలుస్తారు.
పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం.పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. ‘హిల్సా ఇలీషా’ అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత.
ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.
పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరికేయవు. ఏటి మధ్యకు వెళ్ళి వలలను మత్య్సకారులు ఏర్పాటు చేసుకుంటారు. తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటిరెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు దొరకనే దొరకవు. దొరికితే వారి పంట పండినట్లే. వలలో పడిన వెంటనే ఈ చేపలు మరణిస్తాయి. అందుకే ఇవి బతికుండగా జాలర్లు కూడా చూసిన దాఖలాలు ఉండవు.
పులసలు రెండు రకాలు. పోతు పులస, ఆడ పులస. ఆడ పులస నే ‘శనగ పులస’ అని కూడా అంటారు. గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా, రాజమండ్రి దగ్గర దొరికిన పులస ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత సులువేమీ కాదు. పులస చేపతో పులుసు చేయడానికి ముందు పులసకి ఉన్న పొలుసులు తీసేసి శుభ్రం చేయాలి. చేదుకట్ట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలూ, అల్లం, జీలకర్రా, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి. వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నె (వీలయితే మట్టి దాక) స్టవ్ మీద పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. నూనె సెగ వచ్చేలా కాగాక నూరి ఉంచుకున్న ముద్దలు ఒక్కొక్కటీ వేసి దోరగా వేయించాలి.
లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకున్న చింత పండుని రసం తీసి గిన్నెలో పోయాలి. అలాగే టమాటా పళ్ళని చిదిమి గిన్నెలో వేయాలి. లేత బెండకాయ ముక్కల్ని పొడుగ్గా తరిగి పులుసులో వేశాక, ఒక్కొక్క చేప ముక్కనీ జాగ్రత్తగా పులుసులో మునిగేలా జారవిడవాలి. గిన్నెమీద జల్లి మూత (చిల్లులున్నది) పెట్టి మంట పెంచాలి. కుతకుతా ఉడుకుతూ బుళుకు బుళుకు మనే చప్పుళ్ళు చేస్తుంది పులుసు.
పులుసు నుంచి కమ్మటి వాసన రావడం మొదలవ్వగానే మంట తగ్గించి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. చాలాసేపు మరిగాక పులుసు చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి వేడి పులుసు లో వెన్నముద్ద కలపాలి. పులుసు బాగా చల్లారాక మొన్న వేసవిలో పెట్టిన కొత్తావకాయ మీది తేటని పులుసులో కలపాలి. ఒకరాత్రంతా కదపకుండా గిన్నెలోనే ఉంచేసి, మర్నాడు ఉదయం అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది రుచి … అబ్బో అదుర్స్.
డిమాండ్ ను బట్టి పులస చేపల ధర ఒక కిలోకు 2000 నుండి 5000 రూపాయల వరకు ఉంటుంది.