కోవిడ్ 19 ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పనులు కూడా దొరకక కొందరు వ్యభిచార వృత్తి పట్ల ఆకర్షితులవుతున్నారు. పొట్ట కూటి కోసం పిల్లల సంరక్షణ కోసం మానాన్ని అమ్ముకుంటున్నారు. పంజాబ్ లోని మాలౌట్ పట్టణంలో నానక్ నగ్రి ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు మహిళలు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు. ఆ పరిస్థితుల్లో ఆ ఇద్దరు వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు రైడ్ చేయగా విటులతో సహా దొరికిపోయారు. ఆ ఇద్దరూ తల్లీ కూతుళ్లు కావడం విశేషం.
ఈ ఇద్దరూ వేరే పనులకోసం ప్రయత్నించారు. కానీ ఎక్కడ దొరకలేదు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో తల్లి వ్యభిచార వృత్తిలోకి దిగి కూతురుని కూడా వేశ్యగా మార్చేసింది. తెలిసిన వారి ద్వారా విటులను ఇంటికే పిలిపించుకుంటున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలిసి ఆ ఇద్దరిని .. విటులను అరెస్ట్ చేశారు. కరోనా సృష్టించిన దుర్భర పరిస్థితికి ఈ ఘటన ఒక ఉదాహరణ.
ఇలా దేశమంతటా జరుగుతోంది.వీళ్ళిద్దరూ దొరికారు కానీ దొరక్కుండా వృత్తి లో కొనసాగుతున్నవారెందరో ఉన్నారు.కరోనా కారణంగా సెక్స్ వర్కర్ల బతుకులు కూడా చితికి పోయాయి. వృత్తి నుంచి బయట కొచ్చి కరోనా కారణం గా మళ్ళీ వృత్తిలోకి వెళుతున్నారు. అలా వెళుతున్నవారిలో చిన్న పిల్లలు , పెద్దలు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా సెక్స్ వర్కర్ల జీవితాలను కోవిడ్ బాగా దెబ్బ తీసింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్ల పరిస్థితి కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 120,000 మంది సెక్స్ వర్కర్లు గత రెండేళ్లుగా ఆకలి దప్పులతో అలమటిస్తున్నారు. కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ప్రయివేట్ వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని .. వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతున్నారు.
గత రెండేళ్లుగా రేషన్, వైద్యం, మందులు, దొరకక నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్స్ వర్కర్లకు రేషన్, ఆర్థిక సహాయం చేయమని ఆదేశించింది.ఒంటరిగా ఉన్నవారికి రవాణా సౌకర్యాలు,మాస్కులు శానిటైజర్లు అందించమని ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తద్వారా వారి హక్కులను పరిరక్షించమని చెప్పింది.
సుప్రీం కోర్టు కూడా COVID రిలీఫ్ సపోర్ట్ సర్వీసెస్ కింద లాక్ డౌన్ సమయంలో సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ పంపిణీ చేయాలని సూచించింది. ఈ ఆదేశాలు సక్రమంగా అమలు కాలేదు. అదలా ఉంటే కరోనా మొదటి వేవ్ లో కంటే రెండో వేవ్ లో ఎక్కువమంది సెక్స్ వర్కర్లు అప్పులు చేశారు. నెలకు 15 నుంచి 20 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. తీసుకున్న రుణ మొత్తాలను కుటుంబ పోషణ కోసం వెచ్చించారు.కొందరయితే ప్రైవేటు ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారని విముక్తి ఏపీ కన్వీనర్ మెహరున్నీసా ‘తర్జని’ కి వివరించారు.ఈ క్రమంలో పేద మహిళలకు కుటుంబ.. పిల్లల పోషణకు ఈ వృత్తే ఏకైక మార్గంగా మారిందని అన్నారు. విముక్తి సెక్స్ వర్కర్స్ కూడిన సీబీవో .. సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నది.
—————KNM