ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ “లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ నెలలో బిడ్లను ఆహ్వానించబోతోంది. వచ్చే జనవరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపారు. నవంబర్ చివరినాటికి అవసరమైన అనుమతులు పొంది జనవరిలో పబ్లిక్ ఆఫర్ జారీ కి సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాబోయే పబ్లిక్ ఆఫర్ లో 10 శాతం ఎల్ ఐ సి వాటాలను పాలసీదార్లకు రిజర్వ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చట్టం లో కొన్ని మార్పులు చేయబోతున్నారు. అలాగే పబ్లిక్ ఆఫర్ కి వెళ్లేందుకు అవసరమైన చట్ట సవరణలు చేస్తారు. పబ్లిక్ ఆఫర్ ద్వారా 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫర్ ధర ఎంత అనేది తర్వాత నిర్ణయిస్తారు. ఎల్ఐసీ ప్రయివేటీకరణను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సంస్థ పని తీరు బాగుంది. ప్రతి ఏటా లక్ష కోట్ల రూపాయల వార్షిక ప్రీమియం ను వసూలు చేస్తున్నది.
దేశ ప్రజలకు సంస్థపై నమ్మకం ఉంది. ప్రయివేట్ రంగంలో ఎన్ని భీమా సంస్థలు వచ్చినప్పటికీ ఎల్ ఐ సి తో పోటీ పడ లేకపోతున్నాయి. ప్రయివేటు సంస్థల కంటే ఎల్ ఐసీ నే ప్రజలు నమ్ముతున్నారు. అందుకే సంస్థ బీమా రంగంలో అగ్రగామిగా ఉంది. ఎల్‌ఐసి సంస్థ 30 కోట్ల పాలసీదారుల ఆస్తి. 1956 లో పెట్టుబడి పెట్టడం మినహా, ఇప్పటివరకు ఎల్ ఐ సి సంస్థ విస్తరణ, ఇతర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అందించలేదని అంటారు. పాలసీ దారుల అచంచల విశ్వాసంతో ఎల్‌ఐసీ అతిపెద్ద భీమా సంస్థగా అవతరించింది. అలాంటి ఈ సంస్థను ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని పాలసీ దారులు ప్రశ్నిస్తున్నారు.