Govardhan Gande ………………..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సినీతారలంటే క్రేజ్ ఉండటంతో మీడియా కూడా ఈ ఎన్నికల గురించి ఊదర గొడుతోంది. ఈ ఎన్నికల ప్రక్రియ కూడా వినోదంగా మారింది. వాస్తవానికి వీటివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదు. కాసేపు ఎంటర్టెయిన్మెంట్ మినహా.
ఈ తారల సంఘంలో ఎన్నో అంశాలను తెరపై అద్భుతంగా ప్రదర్శించగల నైపుణ్యం,నేర్పు కలిగిన వారు.ఎన్నో సందేశాలను చదువు,సంధ్యా,లోకజ్ఞానం లాంటివి ఏమీ లేని వారికి కూడా అరటిపండు ఒలిచిపెట్టినట్లుగా, తెరపై కళ్ళకు కట్టినట్లు, మనసుకు హత్తుకునేలా వివరించగల నేర్పరులు. సమాజాన్ని ఓ మంచి దిశలో నడిపించగల నైపుణ్యం వారి సొంతం. అది వారి బాధ్యత కూడా. ఈ నైపుణ్యంతో వారు సమాజాన్ని మంచిదిశలో నడిపించగలరు. పక్కదోవ పట్టించగలరు కూడా.వీరంతా కలిసి నిర్మించే సినిమా చేస్తున్నది వేల కోట్ల వ్యాపారం. ఈ వ్యాపారం అంతా కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోనే చిక్కుకున్నది.
మిగతా వందలాది మంది కళాకారులకు దక్కుతున్నది కొద్ధిపాటి సొమ్ము మాత్రమే. అది దినసరి కూలీలకు అందే లెక్క లాంటిది మాత్రమే.తెరపై వీరిలో కనిపించే మెరుపులు జీవితాల్లో మాత్రం భూతద్దంతో వెదికినా కనిపించదు. చిత్రపురి లోకి వెళ్ళిచూస్తే తెరవెనక జీవితం ఎంత దయనీయంగా,దుర్భరంగా ఉంటుందో బోధపడుతుంది.తెరపై వెలుగులు,జిలుగులు ప్రదర్శించే వీరందరి సంయుక్త శ్రమ ఫలితమే సినిమా కదా. అదే సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రధాన వినోద సాధనం కదా.
1000 మంది లోపు సభ్యులున్న ఈ సంఘానికి ఎన్నికలు జరగనున్నాయి.కానీ వీరు చాలా అడ్డు గోడలు నిర్మించుకున్నారు. కులం, ప్రాంతం, భాష. ఇపుడివే ఈ సంఘం ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలు. ఇదే ఇప్పుడొక విషాదకర పరిణామం. తెలుగు వారే పోటీ చేయాలి! ఇక్కడి వారే పోటీ చేయాలి! పరాయి భాష వారు ఇక్కడ ఎలా పోటీ చేస్తారు? స్థానికులే పోటీ చేయాలి? పరాయి రాష్ట్రం వారికి ఈ సంఘంతో ఏమి పని? వారు వారి రాష్ట్రంలో పోటీ చేసుకోవాలి? ఆ రాష్ట్రంలో బయటి వారిని పోటీ చేయనివ్వడం లేదుకదా. ఇవన్నీ ఇపుడిక్కడ ఎన్నికల నినాదాలు. ఈ నినాదాలు,వాదనల వెనక.కులం,ప్రాంతం, భాష అనేవి వెలుపలికి కనిపించేవి మాత్రమే. దీని వెనక పెద్ద ఎజెండానే ఉన్నది. అది వెలుపలికి కనిపించదు. మొత్తం సినిమాను గుప్పిట్లో పెట్టుకొని పరిశ్రమను,వ్యాపారాన్ని శాసించాలనేది అంతర్గత ఎజెండా. నిజానికి ఈ సంఘం కర్తవ్యం అది కాదు.
సంఘం లోని సభ్యుల కష్టనష్టాలను తెలుసు కొని,పరిష్కార మార్గాలు చూపడం.సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం,పరిష్కారానికి ప్రయత్నించడం,ఇతర సమస్యల్లో సభ్యులకు చేయూత నివ్వడం,ఆదుకోవడం ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గం విధి. కానీ ఈ విధిని చిత్తశుద్ధితో,నిజాయితీగా నిర్వర్తించిన సందర్భాలు చాలా అరుదు. వేషాలు లేక,దొరకక .. పూట గడవని కళాకారులు అనేక మంది ఉంటారు. వీరికి ఏదో వేషం ఇప్పించి వారి ఆకలిని తీర్చే యత్నాలు చేసిన “స్టార్ కళాకారులు” చాలా కొద్ది మందే ఉన్నారు.
హైదరాబాద్ లో ఉన్న ఈ సంఘంలో తెలుగు, కన్నడ, తమిళ,మలయాళ,హిందీ,కళాకారులున్నారు. వీరిలో నటులు,డబ్బింగ్ ఆర్టిస్టులు,సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరిలో చాలా మందికి తెలుగు రాదు. అయినా వీరందరి శ్రమ,నైపుణ్యం,మేధస్సు కలబోతే కదా సినిమా గా రూపుదిద్దుకునేది. అపుడే కదా ఓ సినిమా జనం ముందుకు వచ్చేది. అపుడే కదా అది వ్యాపారం జరిగేది.వీరందరి కడుపు,జేబులు నింపేది. ఇదంతా మరచిపోయి .. నువ్వు పరాయి భాష వాడివి,ఈ రాష్ట్రానికి చెందని వాడివి అని కుంటి,అర్ధంలేని,అహేతుకమైన,సంకుచిత వాదనలు చేయడం ఎలా సమర్థనీయం?
ఇక సెప్టెంబర్ లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ .. మంచు విష్ణు … జీవితా రాజశేఖర్ తదితరులు పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్ వర్గానికి మెగాస్టార్ చిరంజీవి ,మంచు విష్ణు కు నరేష్ .. హీరో కృష్ణ .. జీవితకు హీరో బాలకృష్ణ తెర వెనుకనుంచి సపోర్ట్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి మార్పులు చేర్పులు జరగవచ్చు.