Bharadwaja Rangavajhala …………………………………..
Ntr’s biggest hit ………………………………………….సూపర్ హిట్ సినిమా యమగోల సినిమా వెనుక చాలాసుదీర్ఘ కథ ఉంది. డీవీ.నరసరాజుగారు రచన చేసిన యమగోల సినిమాకు బెంగాలీ సినిమా జీవాంత మానుష ఆధారం. యమగోల కు ఓ పదహారేళ్ల అవతల రిలీజైన దేవాంతకుడు సినిమా కూ జీవాంత మానుష సినిమానే ఆధారం.జీవాంత మానుష అనే బెంగాలీ సినిమా 1958లో విడుదలయ్యింది. ప్రఫుల్ల చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా అదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా తీశారు.ఇదే కథను ఆధారం చేసుకుని తెలుగులో “దేవాంతకుడు” తీశారు చిత్తజల్లు పుల్లయ్యగారు.
1960లో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్నే సాధించింది.ఇది జరిగిన ఓ పదహారు సంవత్సరాల తర్వాత కెమేరామెన్ కమ్ నిర్మాత సూరపనేని వెంకటరత్నం కు దేవాంతకుడు గుర్తొచ్చింది.1976లో విడుదలైన వెంకటరత్నం సినిమా “ఈ తరం మనిషి” దారుణంగా దెబ్బతిన్నది. మిస్టర్ సంపత్ నవల ఆధారంగా ఆ సినిమా తీశారు. ఈ సినిమా జనం చూడరు అని హీరో శోభన్ చెప్పినా వినకుండా తీసి చేతులు కాల్చుకున్నారు పాపం వెంకటరత్నం. అలా ఈ తరం మనిషి దెబ్బతినడంతో వెంటనే సినిమా అనౌన్స్ చేయాలనుకున్నారు వెంకటరత్నం. అప్పుడు అతనికి తట్టిన కథ దేవాంతకుడు. యముడికి ఉన్న సేలబులిటీని ఆధారం చేసుకుని దేవాంతకుడినే కాస్త అటూ ఇటూ చేసి తీసేయాలనుకున్నారు. అప్పుడు కాపీ హక్కుల ప్రస్తావన వచ్చింది. దేవాంతకుడు హక్కుల కొనుగోలు కోసం ప్రయత్నిస్తే ఆ సినిమా తీసిన వాళ్లెవరూ దొరక్కపోవడంతో నేరుగా బెంగాలీ సినిమా హక్కులే కొనుక్కున్నారు.
ఆ సినిమా ముళ్లపూడి వెంకటరమణకు చూపించారు. ఆయన ఇది మనకు నడవదు. నరసరాజుగారు అయితే బెటరు అని సలహా చెప్పారు. అప్పుడు నరసరాజుగారిని అప్రోచ్ అయి దేవాంతకుడినే మళ్లీ తీద్దామనుకుంటున్నాను అని చెప్పారట వెంకటరత్నం. దేవాంతకుడు సినిమాకు సదాశివబ్రహ్మం రచయితగా పనిచేశారు. ఆ సినిమా చూసిన నరసరాజు గారు ఈ కథను ఇంకా బెటరుగా రాసుకుని తీయవచ్చు అన్నారు. హీరో స్వర్గనరకాలకు వెళ్లివచ్చినట్టు కల రావడం వరకు తీసుకుని మిగిలిన వ్యవహారం అంతా మనం విడిగా రాసుకుంటే బాగుంటుందని సూచించారు. అలాగే రాసుకున్నారు. అయితే యమగోలకు ప్రేరణ మాత్రమే దేవాంతకుడు తప్ప దేవాంతకుడు కథకీ యమగోల కథకీ తేడా చాలానే ఉంటుంది. కథతో పాటు యమగోల అనే టైటిలు బాగుందని కూడా అడ్వైజ్ చేశారు నరసరాజు. ఈ యమగోల అనే టైటిలు కూడా దేవాంతకుడు తీసిన సి.పుల్లయ్యగారిదే.
దేవాంతకుడు విజయవంతం అయిన తర్వాత కొంతకాలానికి ఆయన యమగోల పేరుతో సినిమా తీయాలనుకుని ఆదుర్తి సుబ్బారావు తమ్ముడు ఆదుర్తి నరసింహమూర్తిని రచయితగా పెట్టుకుని ఓ స్క్రిప్టు రాయించారు. అది సగంలో ఉండగానే పుల్లయ్యగారి ఆరోగ్యం క్షీణించింది.చనిపోయారు. ఆదుర్తి నరసింహమూర్తి కథను పుల్లయ్యగారి కుమారుడు సి.ఎస్ రావు తీసుకుని మరికాస్త డవలప్ చేసి అప్పటికి తన చేతిలో ఉన్న నిర్మాత డి.ఎన్ రాజుగారికి చెప్పారు. ఈ నిర్మాత గారు సదరు స్క్రిప్టు మీద ఒపీనియన్ అడగడం కోసం డి.వి.నరసరాజును పిలిచారు. ఆయన చదివి నాకు ఇది నచ్చలేదు అని చెప్పారు కథ ప్రధానంగా పురాణాల మీద సెటైరుగా నడిచింది. నరసరాజుగారి అభిప్రాయాన్ని గౌరవించిన నిర్మాత రాజుగారు సి.ఎస్ రావు ప్రతిపాదనను పక్కన పెట్టేశారు.రాజ్ కుమార్ నటించిన ఓ కన్నడ సినిమా హక్కులు కొని కృష్ణతో తెలుగులో తీసేశారు.అయితే సిఎస్ రావు దగ్గరున్న యమగోల ఫైలును రామానాయుడు కొనుగోలు చేసి తన దగ్గర పెట్టుకున్నారు. నాయుడుగారిని అప్రోచ్ అయిన వెంకటరత్నం సదరు స్క్రిప్టు వద్దని … టైటిల్ కు మాత్రం ఐదు వేలిచ్చి కొనుగోలు చేశారు.
నరసరాజు, తాతినేని రామారావు కలసి ఇరవై రోజుల్లో కొత్త కథ తయారు చేశారు.కథ తయారవుతుండగానే హీరోగా ఎన్టీఆర్ అయితే బాగుంటుందని సలహా చెప్పారు నరసరాజు. పల్లవీ పిక్చర్స్ పర్మినెంట్ హీరో శోభన్ బాబు కూడా ఎన్టీఆరే అనడంతో అటు మొగ్గారు. ఎన్టీఆర్ కూడా ఓకే అనడంతో డైలాగ్ వర్షన్ మొదలెట్టుకున్నారు. అందులో యముడు, చిత్రగుప్తుడు బ్రోతల్ కేసులో అరెస్టు కావడం అనే సన్నివేశాన్ని మొదట ఎన్టీఆర్ కు చెప్పారు నరసరాజు గారు. దీనికి ఎన్టీఆర్ పడీ పడీ నవ్వి డెఫినెట్ గా మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారట.ముళ్లపూడి కోతికొమ్మచ్చి రెండో భాగంలో జీవాంత మానుష రైట్స్ వెంకటరత్నం కొనుగోలు చేయడం తనను అప్రోచ్ అయిన విషయం రాశారు. అక్కడ నుంచీ తతిమా కథంతా నరసరాజుగారి తెరవెనుక కథలు లో రాశారు. అలా పుట్టిన యమగోల సినిమా ప్రారంభ సమయంలో యమలోకపు సెట్ లో షూటింగు నడచినంత కాలం రచయిత నరసరాజు సెట్ లో ఉండాలని ఆదేశించారట ఎన్టీఆర్ . రాజుగారు కూడా సరే అనడంతో కథ ముందుకు పోయింది.
తెలుగులో విజయవంతమైన ఈ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ తో రీమేక్ చేశారు. అందులో యముడు కారక్టర్ ఆయన , హీరో కారక్టరు ఆయన కుమారుడు ప్రభూ వేశారు. సినిమా దెబ్బతిన్నది. తెలుగులో కూడా యముడుగా ఎన్టీఆరూ సత్యం పాత్రలో బాలయ్య అనుకున్నారు మొదట. ఎన్టీఆరే వద్దని యముడు సత్యనారాయణతో చేయిద్దామనడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. హిందీలో లోక్ పరలోక్ పేరుతో వెంకటరత్నమే తీశారు. తాతినేని రామారావే డైరక్ట్ చేశారు. అక్కడ మాత్రం సినిమా విజయవంతమయ్యింది. సో … యమగోల కథ దాదాపు నరసరాజుగారిదే అన్నమాట. ఇలా చాలా మంది హీరోల నిర్మాతల చేతులు మారి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిన కథలన్నీ ఆయన మీద బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ లిస్టులో నరసరాజుగారే రాసిన రాముడు భీముడు కూడా ఉంది. అది కూడా ఇద్దరు ముగ్గురు హీరోలనూ నిర్మాతలనూ చుట్టి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి సక్సస్ అయ్యింది. మెతుకు మీద పేరు రాసున్నట్టే .. సినిమా కథ మీద కూడా పేరు రాసుంటుందనేవారు నరసరాజుగారే … ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా .