ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం పున:ప్రసారం అవుతుంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 న మొదలయ్యింది. అప్పటి నుంచి సుమారు 1100 ఎపిసోడ్లు ప్రసారమైనాయి. గాన గాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమ రూపకర్త. రామోజీ రావు సహకారంతో బాలు ఈ కార్యక్రమానికి ప్రాణం పోశారు. ఎంతో మంది గాయనీ గాయకులకు అవకాశం కల్పించారు. ఎంతో మంది ప్రతిభను వెలుగులోకి తెచ్చారు.
ఈ టీవీ లో వచ్చే ప్రోగ్రాముల్లో కుటుంబం మొత్తం కూర్చుని తిలకించే ఏకైన ప్రోగ్రాం ఇదే. 25 ఏళ్లపాటు నడిచిన ఈ కార్యక్రమం బాలు మరణం తర్వాత ఆగిపోయింది.18 సిరీస్ లు టెలికాస్ట్ అయింది. ఇప్పటికి పాత ఎపిసోడ్లను జనం చూస్తుంటారు. ఈ ప్రోగ్రాం కు పోటీ గా కొందరు వివిధ పేర్ల మీద ఇలాంటి షో లు నిర్వహించినా అవేవీ సుదీర్ఘకాలం కొనసాగ లేకపోయాయి. ఇక బాలూ ఆ షో ని చాలా జాగ్రత్తగా నిర్వహించారు.అమోఘంగా నడిపారు. కేవలం పాటలే కాకుండా ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను బాలు చెప్పేవారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక్కో విశిష్ట అతిధిని పిలిచేవారు. వారిని ప్రేక్షకులకు పరిచయం చేసే వారు. అలా వచ్చిన అతిధులే కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించేవారు. కొత్త గాయకులకు సలహాలు సూచనలు ఇచ్చేవారు. దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో ఇది.
విశిష్ట అతిధులుగా మంగళంపల్లి బాలమురళికృష్ణ, సాలూరి రాజేశ్వరరావు,కేవీ మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్, ఇళయరాజా,కీరవాణి, సుశీల,జానకి, కే. విశ్వనాధ్ , బాలచందర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉష,కౌసల్య,గోపికా పూర్ణిమ, మల్లికార్జున్, సందీప్,హేమచంద్ర,కారుణ్య మొదలైనవారు ఎందరో ఈ పాడుతా తీయగా ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఈ ప్రోగ్రాం ద్వారా సినీ పరిశ్రమ కు ఎందరో సింగర్స్ పరిచయమైనారు.
బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తో పాటు రైటర్ చంద్రబోస్,సింగర్ సునీత లు కూడా ఈప్రోగ్రామ్ లో మోడరేటర్ల గా ఉంటారని సమాచారం. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లను చిత్రీకరించారని తెలుస్తోంది. చరణ్ బాలు వారసుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోగలరని .. బాలు జ్ఞాపకాలను, ఇతర విశేషాలను పంచుకుంటూ ఈ షో ను నడిపించగలరని రామోజీరావు భావిస్తున్నారని అంటున్నారు. ఎపిసోడ్స్ మొదలైతేనే కానీ చరణ్ తండ్రిలా ప్రేక్షకులను అలరించగలరో లేదో చెప్పలేం. తండ్రి స్థాయిలో అని చెప్పలేం కానీ సింగర్ గా చరణ్ కి కూడా గుర్తింపు ఉంది. నేపధ్య గాయకుడిగానే కాకుండా చరణ్ తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. తమిళ్ చిత్రాలను నిర్మించారు.