ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో చెల్లం సార్ గా నటించిన ఉదయ్ మహేష్ ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 15 నిమిషాల పాత్ర తోనే అతగాడు సూపర్ క్రేజ్ సాధించాడు. గూగుల్ సెర్చ్ లో ఇపుడు చెల్లం సార్ గురించి అత్యధికంగా వెతుకున్నారు. సోషల్ మీడియాలో చెల్లం సార్ హల్ చల్ చేస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజనులు చెల్లం సార్ .. నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుంది ? కరోనా ఎప్పుడు అంతమౌతుంది అంటూ సరదాగా ప్రశ్నలు వేస్తున్నారు. వికీ పీడియా లాగానే మనకు చెల్లం సార్ మరో గూగుల్ అంటూ మీమ్స్ ను ట్విట్టర్ లో వదులుతున్నారు.
ఉదయ్ మహేష్ గురించి చెప్పుకోవాలంటే అతగాడు కొత్తగా తెరపైకి వచ్చిన నటుడు కాదు. తమిళం లో మూడర్ కూడం … కబాలి .. తంగమాగన్ ,మాయ ,ఎన్నకుల్ ఒరువన్ తదితర చిత్రాల్లో నటించాడు. నాళై , చక్రవ్యూగం వంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. స్టార్ విజయ్ సిరీస్ “ఆఫీస్” లో విశ్వనాథన్ పాత్రలో మంచి గుర్తింపు సాధించాడు. తమిళ ప్రేక్షకులకు ఉదయ్ మహేష్ బాగా తెలుసు. అక్కడ ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు. ఆయన అసలు పేరు ఉదయభాను మహేశ్వరన్ .. సినిమాలు, సీరియల్స్ లో ఉదయ్ మహేష్ గా పాపులర్ అయ్యారు.
ఇక ఫ్యామిలీ మాన్ 2 లో చెల్లం సార్ గా కాసేపే కనిపించినా పెద్ద స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ సిరీస్ లో చెల్లం సార్ పాత్ర ద్వారానే కథ మలుపు తిరుగుతుంది. కథా పరంగా చెల్లం జాతీయ దర్యాప్తు సంస్థలో పని చేసి రిటైర్ అయిన ఆఫీసర్. తమిళ రెబెల్స్ నాయకుడు భాస్కరన్ తో సన్నిహిత సంబంధాలు కలిగిన వాడు. చెన్నైలో భాస్కరన్ తమ్ముడు సుబ్బు ను పట్టుకునే విషయంలో మనోజ్ వాజ్ పాయ్ కి సహకరిస్తాడు. భాస్కరన్ గ్రూప్ కుట్రలను అవసరమైనప్పుడల్లా మనోజ్ వాజ్ పాయ్ కి చెబుతూ సహాయ పడతాడు. సిరీస్ లో చెల్లం పాత్ర చిన్నదే. అయినా ప్రేక్షకులకు బాగా గుర్తుండి పోతుంది. ఈ పాత్ర ద్వారా ఉదయ్ మహేష్ అనూహ్య ఆదరణ పొందుతున్నారు.