Goverdhan Gande ……………………………………………………
Recommendations are put in the basket………………………………..రాచరికాలు పోయాయి. రాజులు పోయారు.కానీ , వాటి అవశేషాలు/ అంశలూ ఇంకా మిగిలే ఉన్నాయి.అవి ఇంకా సమాజాన్ని వేధిస్తున్నానే ఉన్నాయి.ప్రజాస్వామ్యం వచ్చిందని,తమ పాలకులను తామే ఎన్నుకోగలుగుతున్నామన్న ప్రజల సంతోషాన్ని నీరుగారుస్తున్నాయి.ప్రజాస్వామిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి.దాని పేరే గవర్నర్ గిరీ!
నిజానికి ఇది ఓ అలంకారప్రాయమైన పదవి మాత్రమే.యూనియన్ (కేంద్ర ) ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాజ్యాంగ బద్ధమైన వారధిగా ఉండవలసిన ఒక ఉద్యోగం మాత్రమే.కానీ వాస్తవంలో అలా ఉండడం లేదు.అదొక రాజకీయ పదవిగా మారిపోయింది.కాదు అలా మార్చివేశారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను రాజకీయ కారణాలతో వేధింపులకు గురి చేసే ఓ ఏజెంట్ స్థాయికి ఈ పదవిని దిగజార్చారు.తమకు ఇష్టం లేని పార్టీలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచినపుడు వాటిని కుంటి సాకులతో వేధింపులకు గురి చేయడమే ఈ పదవి పని అని చెప్పడానికి 70 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో చాలా ఉదాహరణలను చెప్పవచ్చు.
గతంలో ఇలాంటి పాత్రను రాంలాల్ అనే మహాశయుడు బహు గొప్పగా పోషించాడు.దేశ రాజధాని(కేంద్ర పాలిత ప్రాంతమో/ రాష్ట్రమో) లోని ప్రభుత్వాన్ని వేధించడంలో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అద్భుతంగానే పోషిస్తూనే ఉన్నాడు.తాజాగా బెంగాల్ లో కూడా ఈ రమణీయ రాజకీయ దృశ్యం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్నది.ఢిల్లీ నామినేట్ చేస్తే వచ్చే పదవిలో ఉండే ఏ ప్రజాబలం లేని ఓ వ్యక్తి ఎన్నికల్లో ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని సాంకేతిక అంశాలతో వేధింపుల పాల్జేసే ఈ పాత్ర/గవర్నర్ గిరీ నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేదే అని చెప్పక తప్పడం లేదు.
రాజ్యాంగాన్ని,దాని స్ఫూర్తిని గౌరవించి,రక్షించవలసిన పదవిని ఇంతగా దిగజార్చిన ఘనత మాత్రం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. రాజ్ భవన్ (గవర్నర్ అధికార నివాసం) ను రాచభవన్ గా, యూనియన్ ప్రభుత్వ కుట్రలకు వేదికగా మలచుకున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పాలి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలను ఆ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఓ అధికరణాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా కూల్చి పారేసింది. గవర్నర్ పాత్రను,370 అధికరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చల విడిగా దుర్వినియోగం చేసిందని విమర్శలు చేసి,నానా యాగీ చేసిన “విభిన్నమైన పార్టీ ” కాంగ్రెస్ పాత్రలోకి పరకాయ ప్రవేశ చేసింది.ఇప్పుడా పాత్రను విజయవంతంగా దుర్వినియోగం చేయగలుగుతున్నది.విభిన్నమైన పార్టీ అని చెప్పుకొని మరో మారు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వం ఎలాంటి బేషజమూ లేకుండా ఆ పాత్రను పోషిస్తున్నది.ఇప్పుడా గవర్నర్ గిరీ ఔచిత్యం పై చర్చ జరగ వలసి ఉన్నది.
80 వ దశకంలో గవర్నర్ వ్యవస్థ పై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి కేంద్రప్రభుత్వం తగు సూచనలు, సలహాలు ఇవ్వమని సర్కారియా కమీషన్ ను నియమించింది. గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తి ఏదైనా ఒక ప్రముఖ రంగం లో నిష్ణాతుడు అయి ఉండాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే వ్యక్తి అయ్యుండాలి. స్థానిక, రాష్ట్ర రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి అయి ఉండాలని సర్కారియా కమీషన్ తన నివేదికలో సూచనలు చేసింది. సాధారణ రాజకీయ కార్యకర్తగా కానీ, క్రియాశీలక రాజకీయ నాయకుడు /నాయకురాలిగా కానీ ఉండకూడదని సిఫార్సుల్లో స్పష్టం చేసింది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీకి చెందిన వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో వేరే పార్టీ అధికారంలో ఉన్న ఉన్న రాష్ట్రానికి గవర్నర్ గా పంపకూడదని కమీషన్ పేర్కొన్నది. గవర్నర్ నియమాకానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలని కూడా కమీషన్ సూచన చేసింది. కానీ కేంద్రప్రభుత్వాలు ఈ సిఫారసులను పాటించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ఈ అంశంపై చర్చించి .. పౌర సమాజం, ప్రజాస్వామిక వాదులు, స్వేచ్చా ప్రియులు బుద్ధిజీవులు అంతా కార్యోన్ముఖులై ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగాన్ని రక్షించుకోవలసిన అనివార్యమైన కర్తవ్యాన్ని గుర్తించవలసి ఉన్నది.

