volcano attack ……………………………….
అక్కడ ప్రజలు అగ్నిపర్వతాల పక్కనే జీవిస్తుంటారు. అగ్నిపర్వతాలు పేలి లావా ఉప్పొంగి ఊర్లోకి వస్తే మటుకు బెంబేలెత్తి పరుగులు దీస్తుంటారు. కాంగో లోని ‘గోమా’ నగర ప్రజలకు ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం కాకపోయినా అపుడప్పుడు ఎదురవుతుంటాయి.
నిత్యం అగ్నిపర్వతాలు పేలవు .కాబట్టి ధైర్యంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసిస్తున్నారు. 2021లో ‘నైరా ఇరగొంగొ’ అగ్నిపర్వతం విస్ఫోటనంతో ప్రజలు భయోత్పాతానికి లోనయ్యారు.
ఈ నైరా గొంగొ అగ్నిపర్వతం 2002 తర్వాత 2021లో బద్దలైంది. దాంతో లావా పైకి ఉప్పొంగి ‘గోమా’ నగరం ప్రధాన రహదారుల పైకి ప్రవహించింది. దీంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలో నుంచి పరుగులు దీశారు. అగ్ని పర్వతం పేలినపుడు ఆకాశం అంతా ఎరుపు రంగులోకి మారిపోయింది.
అక్కడి వాతావరణమంతా భయం కలిగించేలా మారిపోయింది. భూప్రకంపనలకు రోడ్లు కూడా బీటలు వారాయి. ప్రజలు భీతిల్లి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు.
‘గోమా’కు ఉత్తరాన ఉన్న ప్రదేశంలో లావాను చల్లబరుస్తున్న సమయంలో ఊపిరి ఆడక ఐదుగురు మరణించారు. కొంతమంది శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అగ్నిపర్వతం నుంచి ప్రవహించిన లావా ఇళ్లను ముంచెత్తడంతో 9 మంది కాలిపోయారు.
గోమా జైలు నుంచి ఖైదీలను తరలిస్తుండగా ట్రక్కు బోల్తా పడి 14 మంది దుర్మరణం చెందారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం కావడంతో ప్రజలు భయపడ్డారు . రోడ్లపైకి వచ్చి కూర్చున్నారు. కొందరు దగ్గర్లో ఉన్న ‘కీవు’ సరస్సులోని పడవ లు ఎక్కి కూర్చున్నారు.
మరికొందరు రువాండా సరిహద్దు వైపు పరుగులు పెట్టారు. పొలాల్లోకి లావా ప్రవహించి అక్కడి పంటను కూడా దగ్ధం చేసింది. అదే సమయంలో మరో మారు ‘నైరాగొంగొ’ విస్ఫోటనానికి అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు చేయడంతో ప్రజలు నగరాన్ని వదిలి తలో దిక్కు వెళ్లిపోయారు. గోమా జనాభా సుమారు 7 లక్షలు ఉంటుందని అంచనా.
1977 లో ఇదే అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల సుమారు రెండువేల మంది మరణించారు. 2002 లో జరిగిన విస్ఫోటనం కారణంగా తప్పించుకునే దారిలేక కొన్ని వందలమంది మృతి చెందారు. లక్షమందికి పైగా నిరాశ్రయులయ్యారు.
‘నైరాగోంగో’ అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతమని అంటారు.ఇది గోమా నగరానికి 7 మైళ్ళ దూరం లో ‘విరుంగా’ పర్వతాల్లో ఉన్నది. ఇది బద్దలైనపుడు వెలువడే లావా దిగువ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడో సరస్సులాగా ఏర్పడింది. దీని వెడల్పు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఇది గోమా నగరానికి దగ్గర్లో ఉంది.
1882 నుంచి ఈ అగ్నిపర్వతం సుమారు 34 సార్లు విస్ఫోటనం చెందింది. ఒక సారి విస్ఫోటనం చెందితే దాని తాలూకు చిచ్చు కొన్ని నెలల పాటు ఆరకుండా ఉంటుందట. పొంగిన లావా వచ్చి ఆ సరస్సులో కలిసిపోతుంది. ‘నైరా గొంగొ’ కాకుండా మరో నాలుగు అగ్నిపర్వతాలు ‘కాంగో’లో ఉన్నాయి.