రాజీవ్ హత్యకు కుట్ర పన్నిందెవరో?

Sharing is Caring...

Unbroken conspiracy…………………………. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై మే 21 కి ముప్పై ఏళ్ళు అవుతుంది. మనదేశ చరిత్రలో ఇదొక విషాద ఘటన. హత్యకు బాధ్యులు గా భావించి  సుప్రీంకోర్టు కొందరికి జీవిత ఖైదు.. మరికొందరికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై పలువురు పుస్తకాలు కూడా రాశారు. ఎంతో మంది అనుమానాలను వ్యక్తం చేశారు.

ఈ హత్యకేసు విచారణ సరిగ్గా జరగలేదనే అభిప్రాయం వక్తమైంది. ముఖ్యం గా హత్య వెనుక జరిగిన కుట్ర కు సంబంధించిన అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించినట్టు లేదు. ఈ హత్య కేసులో వివాదాస్పద వ్యక్తి చంద్రస్వామి పై అనుమానాలు వ్యక్తమైనాయి.

ఈ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ థామస్ సీబీఐ విచారణ సరిగ్గా జరగలేదనే రీతిలో మాట్లాడారు. ప్రధానులకు చంద్ర స్వామి సన్నిహితుడు కావడం తో సీబీఐ ఈ విషయంలో ముందుకు వెళ్లలేదా అనే అనుమానాలు కూడా కలిగాయి.  రాజీవ్ హత్యకేసు కి సంబంధించి సీబీఐ దర్యాప్తు చేసిన తీరులో తప్పిదాలు ఉన్నాయని కొన్నేళ్ల క్రితం జస్టిస్ థామస్ మాట్లాడారు.

ఈ కేసులో ప్రధాన కుట్రదారునిగా భావించిన శివరాసన్ ను సిట్ సభ్యులు కాల్చిన సమయంలో అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్న 40 లక్షల రూపాయలు ఎక్కడివో కనుగొనే  ప్రయత్నం చేయలేదు. ఈ కేసులో శిక్ష పడిన నిందితుల్లో ఒకరు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ డబ్బును చంద్రస్వామి ఇచ్చారని చెప్పారు. అయితే  సీబీఐ అధికారులు స్వామికి వ్యతిరేకంగా నోరు విప్పవద్దని అతగాడిని హెచ్చరించినట్టు జస్టిస్ థామస్ అప్పట్లో చెప్పారు. మొత్తం మీద చూస్తే … విచారణ సరైన రీతిలో సాగలేదని అనిపిస్తోంది.

విచారణ సంగతి అలా పెడితే….  ఘటన జరిగిన నాడు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. భద్రతా ఏర్పాట్లలో జరిగిన లోపాల గురించి జస్టిస్ వర్మ కమీషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వ్యవస్థల తీరును తప్పు పట్టింది. కొందరు సీనియర్ అధికారులకు ఏదో కుట్ర జరుగుతున్నదనే సమాచారం ఉన్నా సకాలంలో తగు చర్యలు తీసుకోలేదని అంటారు.

ఈ లోపాలకు సంబంధించిన ఒక్క అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదు. హత్య జరిగిన రోజు రాజీవ్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఒడిశా,విశాఖపట్నం  గుండా శ్రీ పెరంబుదూరు ఎన్నికల సభలో పాల్గొనడానికి చెన్నై వచ్చారు. భువనేశ్వర్, విశాఖ పట్నం లలో రాజీవ్ వెంట ఉన్న భద్రతా అధికారి సాగర్  చెన్నె ఎందుకు వెళ్ళలేదో ఎవరికి తెలీదు.

విశాఖలో విమానం సాంకేతిక లోపానికి గురైతే రాజీవ్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. విమానం బాగయిందని సమాచారం అందగానే రాజీవ్ సాగర్ లేకుండానే విమానం ఎక్కారు. చెన్నైలో భద్రతా అధికారి గుప్తా … సాగర్ వచ్చి పిస్టల్ ఇవ్వలేదన్నకారణంగా ఎలాంటి ఆయుధం లేకుండానే రాజీవ్ వెంట తిరిగారు.

అలాగే శ్రీపెరంబుదూరు సభ విషయం తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో లేదట. ఎవరు రాజీవ్ పర్యటనను ఖరారు చేశారో సమాచారం లేదు. ఇక పెరంబదూర్ సభకు రమ్మని ఎంపీ మరగతం చంద్రశేఖర్ ఢిల్లీ వెళ్లి రాజీవ్ ను ఆహ్వానించారు.

ఆ విషయం మూపనార్ వంటి సీనియర్ నేతలకు తెలియదు. నాటి సభలో ఎంపీ మరగతం కూతురు,అల్లుడు, కొడుకు, కోడలు కూడా పాల్గొన్నారు. మరగతం కోడలు వినోదిని శ్రీలంకకు చెందిన వారు. కానీ ఆమెను సిట్ విచారించలేదని అంటారు. ఎందువల్ల అనేది తెలీదు.

వాజపేయి సర్కార్ రాజీవ్ హత్య వెనుక కుట్ర కోణం పై దర్యాప్తు చేయమని కొన్ని ఏజెన్సీలను ఆదేశించింది. అవేవి కూడా గట్టి ప్రయత్నాలు చేయలేదు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మొత్తం మీద మిలిటెంట్ గ్రూప్ కుట్రకు రాజీవ్ గాంధీ బలై పోయారు. కుట్ర కోణాలు మాత్రం వెలుగు చూడలేదు. ఇకపై చూస్తాయన్న నమ్మకం కూడా లేదు. 

————-KNMURTHY 

ఇది కూడా చదవండి…………… శాస్త్రీజీ మరణం ఇప్పటికీ….ఎప్పటికీ మిస్టరీయేనా ?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!