AKHIL GOGOI ———-అఖిల్ గొగోయ్ …2021 అసోం అసెంబ్లీ ఎన్నికల్లో జైలు లో ఉండే గెలిచిన మరో ఉద్యమ కారుడు. శిబ్ సాగర్ నియోజకవర్గ ప్రజలను నిజంగా అభినందించాలి. వాళ్ళు నిజంగా చైతన్యం కలవారే అని చెప్పుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజల కోసం పోరాడుతున్న ఒక నాయకుడిని ఎమ్మెల్యే గా గెలిపించుకున్నారు.
ఇంతకూ అఖిల్ గొగోయ్ ఎవరు ? ఏమిటి అని కూపీ లాగితే అతనికి సంబంధించిన విశేషాలు చాలానే ఉన్నాయి. ఇతగాడు పౌరసత్వ సవరణ చట్టం (CAA) వ్యతిరేక ఉద్యమకారుడు. ఈ నేపథ్యంలోనే 2019 లో గొగోయ్ ను దేశద్రోహం అభియోగం పై అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. గువాహటి లోని కాటన్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్న అఖిల్ గొగోయ్ 1995-96 మధ్యకాలంలో కాటన్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు.
అప్పటినుంచే అవినీతి వ్యతిరేక పోరాటాలకు శ్రీకారం చుట్టాడు. ఆర్టీఐ కార్యకర్తగా మారాడు. అస్సాం లోని గోలాఘాట్ జిల్లాలోని సంపూర్ గ్రామ్ రోజ్గార్ యోజన పధకంలో 12.5 మిలియన్ డాలర్ల కుంభకోణాన్ని వెలికి తీసాడు. అపుడే అతనికి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ జాతీయ సమాచార హక్కు అవార్డును ఇచ్చి సత్కరించింది. అలాగే అవినీతిపై పోరాడినందుకు గాను షణ్ముగం మంజునాథ్ సమగ్రత అవార్డు అందుకున్నాడు. దీంతో ఒక్కసారి గొగోయ్ పేరు వెలుగులోకి వచ్చింది.
కాగా గొగోయ్ కిసాన్ ముక్తి సంగ్రామ్ సమితి (కెఎంఎస్ఎస్) స్థాపించి అటవీ భూముల హక్కుల కోసం కూడా ఉద్యమం చేపట్టాడు. గోగోయి భూముల హక్కులు గురించి తెలుసుకోవడానికి తరచుగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించేవాడు. రైతుల జీవానాధారాన్ని దెబ్బతీసే పెద్ద ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించే వాడు.
ఇందులో భాగంగానే ఆదివాసీలతో కలసి పని చేసాడు. వారి హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాడు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం గోగోయి పై ఇప్పటి వరకు 100 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గొగోయ్ గత ఏడాది అక్టోబర్ లో కిసాన్ ముక్తి సంగ్రామ్ సమితి.. మరికొన్ని సి ఏ ఏ వ్యతిరేక సంస్థల మద్దతుతో రైజోర్ దళ్ ను స్థాపించారు.
ఈ సంస్థ అస్సామ్ జాతీయ పరిషద్ తో కలసి 18 స్థానాలకు పోటీ చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ గొగోయ్ కి మద్దతుగా నిలిచింది. తర్వాత సుబ్రామిత్ర కి టిక్కెట్ ఇచ్చింది. దీంతో గొగోయ్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుభ్రామిత్ర మూడో స్థానంలో నిలిచారు. జైల్లో ఉన్న 46 ఏళ్ళ గొగోయ్ తరపున ఆయన తల్లి ప్రియదా గొగోయ్ ప్రచారం నిర్వహించారు.
ఆమెకు తోడుగా వందలాదిమంది కార్యకర్తలు రంగంలోకి దిగారు. కుమారుడి కోసం ప్రచారం చేస్తున్న తల్లికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేధా పాట్కర్, సందీప్ పాండే తదితరులు కూడా అండగా నిలిచి ప్రచారం చేశారు. వారి ప్రయత్నం ఫలించింది.
అఖిల్ గొగోయ్ 11,875 ఓట్ల ఆధిక్యత తో విజయం సాధించాడు. గొగోయ్ కి మొత్తం 57,219 ఓట్లు వచ్చాయి. 46.06 శాతం ఓటర్ల మద్దతు పొందాడు. కాగా గొగోయ్ పార్టీ తరపున పోటీ చేసిన వారెవరూ ఎన్నికల్లో గెలవలేదు. ఇక బీజేపీ అభ్యర్థి విజయం కోసం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వంటి వారు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. అసోం చరిత్రలో గొగోయ్ ది చారిత్రాత్మక విజయం. ఇంతకు ముందు అసోంలో జైలులో ఉండి గెలిచిన వారు ఎవరూ లేరు.
————–K.N.M