His own mark on film literature……………
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా ఆయన సుప్రసిద్ధుడు. ఆయన కవిత్వాన్ని చదవని వారు తక్కువ.సినిమా పాటల విషయం లో కూడా శ్రీశ్రీ తక్కువేమీకాదు.
ఎన్నో సార్లు తన సత్తా చాటుకున్నారు. తన స్థాయి తగ్గించుకోకుండా మంచి గీతాలను అందించి .. సినీ సాహిత్యంపై తనదైన ముద్రను వేశారు. ఆనాటి దర్శకులు విప్లవ గీతాలంటే ప్రత్యేకంగా శ్రీశ్రీ ని పిలిపించి పాటలు రాయించేవారు. కమ్యూనిజం,సోషలిజం, సమానత్వం, సమ సమాజ నిర్మాణం వంటి అంశాలు శ్రీ శ్రీ కవితా వస్తువులు. శ్రీ శ్రీ తన సినిమా పాటల్లో కూడా పీడిత జనం, కార్మికుల గురించి ప్రస్తావించేవారు.
“వెలుగు నీడలు” సినిమాలో “పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి హృదయగీతికా” అనే పాట ఎవర్ గ్రీన్ సాంగ్. ఇప్పటికి అక్కడక్కడా వినిపిస్తుంటుంది. సమాజం లోని అసమానతలు … కులమత ద్వేషాలు… పదవి వ్యామోహాలు… మనుషుల మధ్య జరుగు తున్న దోపిడి గురించి పాటలో వివరిస్తూ సమసమాజ స్థాపన కు ఎదురుతిరగడమే పరిష్కారం అని చెబుతారు.
“స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి… సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి..”.”కాంచ వోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి” “సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం” అని మనిషి కి శ్రీశ్రీ కర్తవ్య బోధ చేశారు.
ఆయన ఏ పాట రాసినా అది జనరంజకంగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది. పల్లవులు .. చరణాలు అలా ఆటోమాటిక్ గా సెట్ అయిపోతాయి. “తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా” అనే పాటను అల్లూరి సీతారామ రాజు సినిమా కోసం శ్రీశ్రీ రాశారు. సినిమా లో పీడిత జాతిని జాగృతం చేసే సందర్భంగా రాసిన పాట ఇది. ఈ గీతానికి జాతీయ స్థాయిలో అవార్డ్ కూడా లభించింది. ఈ పాటలో ఒక తప్పు దొర్లింది.
ఆ విషయం కూడా శ్రీశ్రీ బహిరంగంగానే అంగీకరించారు. ఆపాట మూడవ చరణంలో “ప్రతి మనిషి తొడలు గొట్టి .. శృంఖలాలు పగులగొట్టి , చురకత్తులు పదును పెట్టి .. తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి.సంహారం సాగించాలి “అంటూ రాశారు. ప్రతిమనిషి అన్నపుడు ‘సింహంలా గర్జించాలి’ అని ఉండాలి. కానీ’ సింహాల్లా గర్జించాలి’అని తప్పు దొర్లినట్టు చెప్పి తన తప్పును అంగీకరించారు.
“యమగోల” సినిమా లో ‘సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడేను ప్రారబ్ధం ‘ అంటూ సాగే పాట విభిన్నంగా ఉంటుంది. పాలకుల దోపిడీ, వెట్టి చాకిరి ని వ్యతిరేకిస్తూ విప్లవ నినాదాలు చేస్తూ నరకలోకంలో హీరో పాడే పాట ద్వారా విప్లవాలు దోపిడీ ని అడ్డుకోగలవని అంతర్లీనంగా కమ్యూ’నిజాన్ని’ చొప్పించి చెప్పిన పాట అది.
“దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా” అనే పాటలో మతం ముసుగులో జరిగే మోసాలను ఎండగట్టారు. “దేవుడు చేసిన మనుషులు” అనే సినిమా కోసం ఆ పాట రాశారు. సినిమాలలో శ్రీ శ్రీ కేవలం విప్లవ గీతాలే రాయలేదు. మనసును హత్తుకునే మధుర గీతాలు మరెన్నో రాశారు.
‘కలకానిది విలువైనది’, ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై’, ‘ఓ రంగయ్యో పూల రంగయ్యో’, ‘తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం’ , ‘ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే’, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం’, ‘నందుని చరితము వినుమా’, ‘నిను చూడ మనసాయేరా’, ‘అలాగా వచ్చి .. ఇలాగా తెచ్చి’ వంటి పాటలు ఎన్నో రాశారు. వీటిలో ‘మనసున మనసై’ పాట అందరూ ఆత్రేయ రాశారు అనుకుంటారు.
అన్నట్టు ఆత్రేయ .. శ్రీశ్రీ ఇద్దరూ క్లాస్ మేట్స్ కాదు కానీ గ్లాస్ మేట్స్ ..ఆత్రేయ వాగ్దానం సినిమాలో శ్రీశ్రీ చేత ఒక హరికథ రాయించారు. అదే సీతా కల్యాణ సత్కథ. వామపక్ష భావాలు గల శ్రీ శ్రీ ఈ హరికథను అద్భుతంగా అక్షర బద్ధం చేశారు. ఆ హరికథ కు సంగీత దర్శకుడు పెండ్యాల జన సమ్మోహనమైన బాణీ అందించారు.
తెర వెనుక ఘంటసాల… తెరమీద రేలంగి హరికథను రక్తి కట్టించారు. ఈ సీతా కల్యాణ సత్కథ ఇప్పటికి వినిపిస్తుంటుంది. ఈ హరికథ రాసేందుకు శ్రీశ్రీ చాలా కసరత్తే చేసారట. ఎన్నో గ్రంధాలను పరిశీలించారట. ఆ స్టైల్ లో మరో హరికథ ఇప్పటివరకు రాలేదు. శ్రీశ్రీ నటుడు మాదాల రంగారావు తో సన్నిహితంగా ఉండేవారు. మాదాల తీసిన విప్లవ శంఖం ..మహాప్రస్థానం తదితర సినిమాలకు మాటలు పాటలు కూడా అందించారు. శ్రీ శ్రీ చనిపోయినపుడు దగ్గరుండి అన్నికార్యక్రమాలు రంగారావే చేయించారు.
—————-K.N.MURTHY