లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్టు కొన్ని మీడియా సంస్థలు గురువారం వార్తలను ప్రచారంలోకి తెచ్చాయి.కానీ “ఆ వార్తలు అసత్యం .. నేను బతికే ఉన్నా”నంటూ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియ జేస్తూ .. అసత్య వార్తలను ఆమె ఖండించారు. ఒక ఆడియో టేప్ ను కూడా ఆమె రిలీజ్ చేశారు. కాగా సుమిత్ర మహాజన్ మృతి చెందారని కాంగ్రెస్ నేత శశిథరూర్ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ కూడా చేశారు. వాస్తవాలను చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఇదే వార్తను ప్రసారం/ప్రచారం చేశాయి. ఇవన్నీ సుమిత్రా మహాజన్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఆ వార్తలను ఖండించారు.
బిజెపి ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా శశి ధరూర్ ట్వీట్ ను గమనించి ఆయనను హెచ్చరించారు. ఈ లోగా బీజేపీ నేతలు విమర్శలు చేయడంతో శశిథరూర్ తో సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. తాను మరణించానో లేదో ధృవీకరించకుండా సంతాపం ప్రకటించడం ఏమిటని సుమిత్రా ప్రశ్నిస్తున్నారు. కేంద్రం .. లోకసభ స్పీకర్ ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు.మధ్య ప్రదేశ్ ఇండోర్ లోక సభ స్థానం నుంచి సుమిత్రా ఎనిమిది సార్లు గెలిచారు. 2014 నుంచి 2019 వరకు లోకసభ స్పీకర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే శశిథరూర్ మాజీ స్పీకర్ కు క్షమాపణలు చెప్పారు. గత 24 గంటల్లో ట్వీట్లు పెట్టడం .. తర్వాత సుమిత్రా ఖండించడం జరిగాయి.కాగా బతికి ఉన్న నాయకులను మరణించారని ప్రచారం చేయడం మీడియాలో ఇదే మొదటి సారి కాదు. గతం లో కూడా పలు మార్లు జరిగాయి.