ఆ పాట ఎప్పటికి నిత్యనూతనమే

Sharing is Caring...

“గాంధీ పుట్టిన దేశమా ఇది .. నెహ్రు కోరిన సంఘమా ఇది.” ఈ పాట ను చాలామంది వినే ఉంటారు. 1971 లో విడుదలైన “పవిత్ర బంధం” సినిమాలోని పాట అది. ఎపుడో 50 ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత ఆరుద్ర రాసిన ఆ పాట ఆనాటి ,,, నాటి సమాజానికి దర్పణంగా నిలిచింది. నాడు ఏ పరిస్థితుల గురించి ఆరుద్ర రాసారో ఇప్పటికి అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి.

పాటలో ఉన్నదంతా వాస్తవమే. ఇప్పటికి ఈ పాట అక్కడక్కడా వినిపిస్తుంటుంది. పాత తరం వాళ్లకు ఈ పాట గురించి బాగా తెలుసు. ప్రవిత్ర బంధం లో అక్కినేని నాగేశ్వరరావు హీరో.వాణిశ్రీ, కాంచన హీరోయిన్లు. వి. మధుసూదన రావు డైరెక్టర్.

కథలో సన్నివేశానికి తగ్గట్టు పాటలు ఉంటేనే జనం స్పందిస్తారు. ఆరోజుల్లో దర్శకుడు,రచయిత, సంగీత కర్త ఎంతో కష్ట పడి తెర వెనుక పనిచేసేవారు. పాట లోని భావాన్ని అర్ధం చేసుకుని గాయకులు పాడేవారు. అందుకే అప్పటి పాటలు ఇప్పటికి అందరికి గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి పాటల్లో ఆరుద్ర రాసిన ఈ పాట ఇప్పటికి నిత్య నూతనం గా ఉండటం విశేషం.

ఈ పాట ను సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు నటభైరవి రాగం లో చేశారు. ఎంతో ఆర్ద్రత కలిగిన రాగమది. ఘంటసాల మాస్టారు అద్భుతంగా పాడారు. ఒకప్పటి పాట కచ్చేరీలలో ఈ పాట తప్పనిసరిగా ఉండేది. అప్పట్లో నిరుద్యోగులు కూడా ఈ పాట పాడుకునే వారు.

ఇక సన్నివేశం గురించి చెప్పుకోవాలంటే హీరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఎక్కడ ఉద్యోగం దొరకదు. బీచ్ కొచ్చి పల్లీలు కొనుక్కొని తినబోతుండగా అనాధ పిల్లలు గుమిగూడతారు. పల్లీలు వాళ్లకు పంచేసి ఈ పాట పాడతాడు. 
 
‘గాంధీ పుట్టిన దేశమా ఇది/ నెహ్రూ కోరిన సంఘమా/ సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా’ అంటూ పాట మొదలవుతుంది.  సమాజంలో అందరికి సమాన హక్కులు, శాంతి, సుపరిపాలన అందించే విధంగా ఉండేదే రామరాజ్యం. కానీ నేటి సమాజంలో పేదవారు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. రామరాజ్యం మళ్లీ వస్తుందా? అని హీరో ప్రశ్నించినట్టు పల్లవి ఆరుద్ర ఎంతో చక్కగా రాశారు.

‘సస్యశ్యామల దేశం… అయినా నిత్యం క్షామం/ ఉప్పొంగే నదుల జీవజలాలు… ఉప్పు సముద్రం పాలు…’ అనే చరణంలో, పచ్చగా ఉన్న ఈ భారతదేశం ఎప్పుడూ కరువులోనే మునిగి ఉంటోంది. ఈ స్వార్థ రాజకీయాల వల్ల జీవజలాలన్నీ పనికిరాకుండా సముద్రంలో కలిసిపోతున్నాయి… అని తన బాధను వ్యక్తం చేశారు ఆరుద్ర.

‘యువకుల శక్తికి … భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు’ అంటూ చురకలు తగిలించారు.  ‘అధికారంకై పెనుగులాటలో అన్నదమ్ముల పోటీ/హెచ్చెను హింసాద్వేషం ఏమవుతుందీ దేశం’… అధికార దాహంతో, సొంత అన్నదమ్ములే ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని, వాళ్ల మధ్య హింస కూడా చెలరేగుతోందని, ఇలా సాగితే దేశ పరిస్థితి ఏమిటి? అని సమాజాన్ని ప్రశ్నించారు ఆరుద్ర.

‘వ్యాపారాలకు పర్మిట్… వ్యవహారాలకు లెసైన్స్/ అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్’… నేడు లంచం ఇస్తే ఏ పనులైనా సాఫీగా సాగిపోతాయనీ, నీతినిజాయితీలు కొరవడ్డాయంటూ సమాజంలో పేరుకుపోయిన అవినీతిని ఆరుద్ర కడిగిపారేశారు.

‘సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు/పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం’ అనే చరణంలో… రికమెండేషన్ లేనిదే శ్మశానంలో సైతం చోటు దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఓటు వేసి గెలిపించినా, ప్రజల రాజ్యాన్ని పెత్తందారులు అవకాశంగా మార్చుకుంటున్నారని, చావును సైతం పెద్దలు రాజకీయం చేస్తున్నారని తన ఆవేదనను ఆరుద్ర ఎంతో అద్భుతంగా పాట రూపంలో మలిచారు .
సమాజ వ్యవహార శైలి కి ఈ పాట నిజమైన దర్పణం.  మంచి సన్నివేశం దొరికితే చెలరేగిపోయే రచయితల్లో ఆరుద్ర ఒకరు. ఆయన ఈ వేళ మనమధ్య లేకపోయినా ఆయన రాసిన ఈ పాట శాశ్వతంగా నిలిచిపోయింది. ఇంకా ఎన్నాళ్లయినా అలాగే ఉండిపోతుంది. అందులో సందేహమే లేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!