తమిళనాట జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో తేలింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏబీపీ -సి ఓటర్ జనవరిలో నిర్వహించిన సర్వే లో డీఎంకే కే ఫలితాలు అనుకూలమని తేలింది. తర్వాత టైమ్స్ నౌ -సి ఓటర్ చేసిన సర్వేలో కూడా అదే రీతి ఫలితాలు వచ్చాయి. తాజాగా కొద్దీ రోజుల క్రితం నిర్వహించిన సర్వే లో కూడా ఓటర్లు డీఎంకే కి పట్టం కట్టే మూడ్ లో ఉన్నారని స్పష్టమైంది. మొత్తం 234 స్థానాల్లో డీఎంకే కూటమి 43 శాతం ఓట్ల తో 161 నుంచి 169 సీట్లను కైవసం చేసుకోవచ్చనేది సర్వే సారాంశం.
ఇక మిగిలిన పార్టీల విషయానికొస్తే అన్నా డీఎంకే కేవలం 53 నుంచి 61 సీట్లకే పరిమితం కావచ్చట. అన్నాడీఎంకే కు 30. 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. ఇక నటుడు కమలహాసన్ పార్టీ 7 శాతం ఓట్లతో 2 నుంచి 6 సీట్లు గెలుచుకోగలదని అంచనా. చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ పార్టీ 6. 4 శాతం ఓట్లతో 5 సీట్లను గెలుచుకోవచ్చని సర్వే చెబుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ సీఎం కావాలని 40 శాతం మంది ఆయనకు మద్దతు పలికారు. పళని స్వామి సీఎం కావాలని 29. 7 శాతం మంది కోరారు.
ప్రస్తుత సర్కార్ పై 48 శాతం అసంతృప్తిగా ఉన్నారట. ఈ సర్వేలను బట్టి చూస్తుంటే స్టాలిన్ దూసుకుపోతున్నారని చెప్పుకోవాలి. డీఎంకే అధికారం కోల్పోయి 10 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుత ప్రభుత్వంపై ఓటర్లు అసంతృప్తిగా ఉండటం .. అన్నాడీఎంకేలో బలమైన , మంచి ఇమేజ్ ఉన్ననాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ కావచ్చు. అదే విధంగా హీరో రజనీ కాంత్ రంగంలోకి దిగకపోవడం స్టాలిన్ కి ప్లస్ అనుకోవచ్చు. కమల్ కి రాజకీయ అనుభవం లేకపోవడం .. పార్టీ నిర్మాణం సరిగ్గా లేకపోవడం మైనస్ పాయింట్లు కావచ్చు. డీఎంకే తో పోలిస్తే ఆ రెండు పార్టీలకు పటిష్టమైన కేడర్ లేదని చెప్పుకోవాలి. ఈ సర్వేల సత్తా ఏమిటో ఫలితాలు వచ్చాక కానీ తెలియదు. గతంలో కొన్ని సర్వేలు విఫలమైనాయి. వాస్తవ ఫలితాలు వేరేగా ఉన్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో ?
————-K
అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎంపీ రాజగోపాల్ సర్వే అంటే నూటికి నూరు శాతం నిజం అని నమ్మే విధంగా ఉండేవి తరువాత జనాలకి అర్ధం తెలిసింది సర్వే అంటే పెద్ద బూటకం అదో పెద్ద నాటకం అని. ఇంకా సర్వేలు పట్టుకొని ముందు పెట్టుకోవడం అవివేకం