ఎందుకామె వర్మ చెంప చెళ్లుమనిపించింది ?

Sharing is Caring...

అవి “క్షణం క్షణం “సినిమా తీస్తున్న రోజులు . దర్శకుడు రామగోపాల వర్మ మంచి ఊపులో ఉన్న టైమ్ అది. వర్మకు ఆ సినిమా పనిమీదే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన పని పడింది. వర్మకు చాలా సన్నిహితురాలైన ఒకామె ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని అడిగింది. “ఎందుకు” అన్నాడు వర్మ.”రేపు నా పుట్టిన రోజు” అని చెప్పెందామె.

“లేదు ఖచ్చితంగా వెళ్ళాలి .. అర్జెంట్ పని ” అన్నాడు వర్మ. “అంటే నా పుట్టిన రోజుకంటే నీ పనే నీకు ఎక్కువా” అని అడిగిందామె. దానికి వర్మ “నీ పుట్టిన రోజుకు అంత ప్రత్యేకత ఏముంది ? అంతో ఇంతో సాధించాననుకునే నేనే ఎపుడూ పుట్టిన రోజు జరుపుకోలేదు” అన్నాడు. ఆమెకు మండి పోయింది. పిచ్చ ఆవేశం వచ్చింది.

అంతటితో వర్మ ఊరుకున్నాడా ? లేదు…పెద్ద క్లాస్ పీకడానికే  రెడీ అయ్యాడు. “నాకు తెలిసి నువ్వు సాధించింది శూన్యం. అలాంటిది నువ్వు పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి ఓ అంతగా ఇదవ్వాల్సిన అవసరం ఉందా” అన్నాడు. ఆమె వర్మ మాటలను ఆసక్తిగా, కోపంగా విన్నది..అక్కడితో ఆగుతాడేమో అని ఓపిగ్గా చూసింది. ఊహు. వర్మ ఆగ కుండా తన ధోరణిలోనే మాట్లాడుతున్నాడు.

” నువ్వు పుట్టి లోకాన్ని ఉద్ధరించేంత పెద్ద కారణం ఉందని అనుకుంటున్నావా ? నీ  తల్లి తండ్రులు కలసి నపుడు ప్రత్యేకంగా నీకు మాత్రమే జన్మ నివ్వాలనే తలంపు వాళ్లకు ఎంత మాత్రం ఉండి ఉండదు. ఎవరు ..ఎందుకు ఎపుడు నీ పుట్టుకకు కారణమయ్యారో నీకు ఏ మాత్రం తెలియడానికి ఆస్కారం లేనపుడు .. నీ జన్మ మీద నీకు కంట్రోల్ లేనపుడు ఇంక నువ్వు కేవలం పుట్టినంత మాత్రాన .. అందులో గొప్పదనం ఏముందని అనుకుంటున్నావు ” అంటూ ప్రశ్నలు సంధించాడు.

అప్పటికే ఆమె కోపం నషాళానికి అంటింది. ఒక్కో ప్రశ్న ఒక్కో కత్తిలా మారి శరీరం పై గాయాలు చేస్తున్న ఫీలింగ్ కలిగింది . అతడు కొంచెం ఆపటంతో అనూహ్యంగా వెళ్లి  వర్మ చెంప చెళ్లుమనిపించింది. ఊహించని ఈ పరిణామానికి వర్మ షాక్ తిన్నాడు. అంతే. ఆమె కోపంతో విసవిసా నడుచుకుంటూ వెళ్ళింది. అప్పటినుంచి మాటలు లేవు.కలుసుకోవడాలు లేవు . ఆ తర్వాత ఆమె మళ్ళీ వర్మను కలవలేదు. వర్మ కూడా ఆమెను కలిసేందుకు ప్రయత్నించలేదు.

కానీ ఆమెను మాత్రం వర్మ మరిచిపోలేదు. ఆమె జ్ణాపకాలు బాగా గుర్తున్నాయి . పుట్టిన రోజు తేదీ కూడా గుర్తుంది. 91 లో ఈ సంఘటన జరిగింది. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత ఆమె ఫోన్ నంబర్ సంపాదించి  పుట్టినరోజు నాడు  హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతూ మెసేజ్ పంపాడు. కానీ ఆమె నుంచి రిప్లై రాలేదు. వర్మ కూడా లైట్ గా తీసుకున్నాడు.

కానీ తన అభిప్రాయానికి మాత్రం కట్టుబడి ఉన్నాడు. “పుట్టిన తర్వాత ఏం చేశావన్న దాంట్లో సెలెబ్రేషన్ ఉండాలి కానీ పుట్టినందుకే  సెలెబ్రేట్ చేసుకునే వాళ్లు అత్యంత మహా చేతకాని వాళ్ళు”  అని తన నమ్మకం అంటూ వర్మ తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు. వర్మ అభిప్రాయం కరక్ట్ .. కానీ చెప్పే తీరులో ఎక్కడో తేడా వచ్చింది. అందుకే ఆమె చెంప చెళ్లుమనిపించింది.

————-K.N.MURTHY  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!