పై ఫొటోలో కనిపించే సునీల్ మిట్టల్ సామాన్యుడు కాదు.ఇవాళ మనం మొబైల్ ఫోన్లు మాట్లాడటానికి ఆద్యులలో ఈయన ఒకరు. ఎయిర్ టెల్ బ్రాండ్ ఈయనదే. ఎయిర్ టెల్ బ్రాండ్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి .. మొబైల్ ఫోన్లు లక్షల సంఖ్యలో పెరగడానికి దోహద పడింది ఈ మిట్టలే. ఎయిర్ టెల్ వచ్చాకనే.. ఆయన విజయం స్ఫూర్తి తోనే ఇతర కంపెనీలు మొబైల్ టెలిఫోన్ రంగం లోకి ప్రవేశించాయి.
ఎయిర్ టెల్ కంపెనీ ఇవాళ కొన్ని వందలమందికి ఉపాధిని అందిస్తోంది. దశలవారీగా మిట్టల్ ఎయిర్ టెల్ సేవలను విస్తృతం చేశారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ కస్టమర్ బేస్ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు పైగా ఉంది. సునీల్ మిట్టల్ భారత టెలికాం చరిత్ర ను కొత్త పుంతలు తొక్కించారు.
ఎయిర్ టెల్ తరువాత వచ్చిన మొబైల్ కంపెనీలు కొన్ని వేరే వాటితో కలసి పోగా ఈ ఎయిర్ టెల్ బ్రాండ్ మాత్రం అజేయంగా సామాన్యులకు కూడా అందుబాటులోకి వెళ్లి రికార్డులు సృష్టించింది. ఇంటర్నేషనల్ కాల్స్ ను తగ్గించిన ఖ్యాతి కూడా ఎయిర్ టెల్ దే అని చెప్పుకోవచ్చు. ఎక్కడో దూరాన ఉన్న బంధువులతో,రక్త సంబంధీకులతో రెగ్యులర్ గా మాట్లాడుకునే సౌకర్యాన్ని కల్పించింది సునీల్ మిట్టలే .ఇక సునీల్ భారతి మిట్టల్ గురించి చెప్పుకోవాలంటే పంజాబ్ లోని లూథియానా పట్టణం లో 1957, అక్టోబర్ 23 న జన్మించారు.
సునీల్ తండ్రి సత్పాల్ మిట్టల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఎంపీ కొడుకుగా కావాలంటే ఆయన విలాసవంతమైన జీవితం గడిపి ఉండొచ్చు. కానీ మిట్టల్ ఆలోచనలు విభిన్నంగా ఉండేవి. ఏదో సాధించాలన్న తపన ఎక్కువగా ఉండేది. మిట్టల్ కి కాలేజీ లో చదివే నాటినుంచే వ్యాపారం చేయాలని కోరిక ఉండేది. తండ్రి వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి సమకూర్చాడు.
అంతే .. సునీల్ మిట్టల్ ఇక వెనుతిరిగి చూడలేదు.తొలుత మిట్టల్ సైకిల్ విడిభాగాల పంపిణీ వ్యాపారం ప్రారంభించారు. లూథియానా లో విడిభాగాలను కొనుగోలు చేసి వాటిని ట్రక్ లో లోడ్ చేసుకుని ఢిల్లీ , ముంబాయి వంటి నగరాలకు స్వయంగా సరఫరా చేసేవాడు. అది చేస్తూనే కొన్ని వస్తువుల ఎగుమతి ..దిగుమతి వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారంలో సోదరులు సహకరించేవారు.
ఆ తర్వాత కొన్నాళ్ళు విదేశీ బ్రాండ్ జనరేటర్ల వ్యాపారం కూడా చేశారు. అప్పట్లో కొంతమంది పారిశ్రామిక వేత్తల ఒత్తిడితో జనరేటర్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. దేశీయంగా తయారైన జనరేటర్లనే వాడాలని రూల్ పెట్టింది. ఈ పరిణామం మిట్టల్ వ్యాపారాన్ని దెబ్బతీసింది. అయినా మిట్టల్ నిరాశ పడలేదు. మరింత పట్టుదల తో ముందడుగు వేసాడు.
ఒకసారి మిట్టల్ తైవాన్ లో జరుగుతున్న ఓ బిజినెస్ ఎగ్జిబిషన్ కు కు వెళ్లారు. అక్కడ అతని దృష్టి పుష్ బటన్ ఫోన్లపై పడింది. ఇండియా రాగానే ఆ తరహా ఫోన్ల తయారీని మొదలెట్టాలనుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం టెలికాం రంగంలోకి ప్రయివేట్ రంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సునీల్ మిట్టల్ బీటెల్ బ్రాండ్ ఫోన్లు,ఆ తర్వాత EPABX, ఫ్యాక్స్ మిషన్ల తయారీ రంగంలోకి దిగారు.
90 దశకం చివరికి మిట్టల్ 25 కోట్ల అమ్మకాలను సాధించారు. అపుడే ఆయన విశాలమైన కొత్త ఇంటికి మారారు. మెర్సిడెస్ కారు కొన్నారు. 91 లో ఫ్యామిలీ తో గోవా వెళ్ళినపుడు న్యూస్ పేపర్ లో ఒక ప్రకటన చూసారు.ప్రభుత్వం మొబైల్ టెలిఫోన్ రంగంలోకి ప్రయివేట్ సంస్థలను ఆహ్వానిస్తూ చేసిన ప్రకటన అది.
మిట్టల్ వెంటనే స్పందించి బిడ్ వేసాడు. మిట్టల్‌కు Delhi సర్కిల్ కి లైసెన్సు లభించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎయిర్టెల్ బ్రాండ్ కింద 1994 లో సేవలను అందించడం మొదలు పెట్టాడు. అతి తక్కువ వ్యవధిలో200 మిలియన్లకు పైగా వినియోగదారులతో దేశంలో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయ్యాడు.
అనంతరం శ్రీలంక , బంగ్లాదేశ్, ఆఫ్రికాతో మరికొన్ని దేశాలకు వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం వ్యాపారంలో మిట్టల్ కుమారులు కూడా ఆయనకు సహకరిస్తున్నారు. ఇక మిట్టల్ ను దెబ్బ తీయడానికి తెర వెనుక చాలా ప్రయత్నాలే జరిగాయంటారు. అన్నింటిని ఎదుర్కొని మిట్టల్ నిలబడ్డారు.
ఎయిర్ టెల్ 2 జి, 3 జి,4 జి వైర్‌లెస్ సేవలు, మొబైల్ కామర్స్, ఫిక్స్‌డ్ లైన్ సర్వీసెస్, హై స్పీడ్ డిఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్, ఐపిటివి, డిజిటల్ టివిలను అందిస్తోంది.సునీల్ మిట్టల్ కు ఇతర రంగాలలో కూడా వ్యాపారాలున్నాయి. అన్ని కూడా విజయపధంలో నడుస్తున్నాయి.
ఇన్నేళ్లుగా ఈ మొబైల్ సేవల రంగంలో రారాజుగా వెలుగొందిన ఎయిర్ టెల్ కి ఇటీవల జియో రూపంలో పోటీ మొదలైంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ రిలయన్స్ జియోల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జియో తో పోలిస్తే ఎయిర్ టెల్ పోటీలో ముందంజలో ఉంది. రెండూ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రవేశ పెడుతూ దూసుకుపోతున్నాయి. 2007లో భారత ప్రభుత్వం సునీల్ మిట్టల్ ను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
————– K.N.MURTHY