మహిళా నాగ సాధువుల సంఖ్యపెరుగుతోందా ?

Sharing is Caring...

Are women attracted to the lifestyle of Naga saints?

మహిళా నాగ సాధువుల జీవన శైలి కి, మగ సాధువుల జీవనశైలికి పెద్ద తేడాలు ఏమీ లేవు. ఒకటి రెండు తేడాలుంటాయి అంతే.పదేళ్ల క్రితం మహిళా నాగసాధువులు పెద్దగా లేరు. అయితే మెల్లగా వారి సంఖ్య కూడా పుంజుకుంటోంది. వారిప్పుడు ప్రత్యేకంగా ‘అకడా’ల ను ఏర్పాటు చేసుకుంటున్నారు.

‘అకడా’ అంటే అదొక సంఘం. ఒక సమూహం. (అకరా అని కూడా అంటారు) అలహాబాద్,ఉజ్జయిని ప్రాంతాల్లో ఈ మహిళా సాధువులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘శంకరాచార్య అకడా’కు మహంత్ త్రికాల్ భవంత అనే సాధువు నాయకురాలిగా వ్యవహరిస్తున్నారు.

హిందూ ధర్మంలో పురుషులూ మహిళలు అన్న వివక్ష లేదు. ఇద్దరూ సమానులే అని మహిళా సాధువులు చెబుతుంటారు.పురుష అకడాలు మాదిరిగా మహిళా అకడాలు వృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ అకడా సాధువులు కృషి చేస్తున్నారు.మహిళా సాధువులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. భవంత మీర్జాపూర్ కు చెందిన వారు. భర్త నుంచి విడిపోయాక ఆధ్యాత్మిక బాట పట్టారు. సన్యాస దీక్షతీసుకున్నారు.

అలాగే ‘జునా అకడా’ అనే మరొక సమూహం కూడా ఉంది. ఇందులో 10 వేలమంది సాధువులు  ఉన్నారు. వీరిలో చాలామంది విదేశీయులు ఉన్నారు. ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ప్రాపంచిక ధోరణిపై విరక్తి తో సాధువులుగా మారారు. నాగాల జీవితం కఠినంగా ఉంటుందని … చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినప్పటికీ, ఈ విదేశీ మహిళలు సాధు జీవనాన్ని అనుసరించాలని నిర్ణయించుకోవడం విశేషం.

నాగ మహిళా సాధువులుగా మారే వారిలో ఎక్కువగా భర్తలు లేదా కుటుంబాల చేత నిరాదరణకు గురైనవారు, వితంతువులు ఉన్నారు. నేపాల్ లో ఒక కులంలో మహిళా పునర్వివాహన్నీ సమాజం అంగీకరించదు. దీంతో కొంతమంది వచ్చి సాధువులు గా మారారు. వీరంతా కఠోర దీక్షలకు సిద్ధమై ఈ అకడాలో చేరారు. వీరు కూడా శిరోముండనం చేయించుకుని , వారికి వారే పిండ ప్రధానం చేసుకోవాలి.

అంతకు ముందు కుటుంబాలతో సంబంధాలు లేవని నిరూపించుకోవాలి. అలాంటివారినే అకడాలలో చేర్చుకుంటారు. వీరంతా లైంగిక వాంఛలకు దూరంగా ఉండాలి. కఠోర బ్రహ్మచర్యం పాటించాలి. అకడాల్లో నియమాలు కఠినంగా ఉంటాయి. ఏమైనా తేడా వస్తే బహిష్కరిస్తారు. వీరు నగ్నంగా స్నానం చేయడం, నగ్నంగా తిరగడానికి అనుమతి లేదు.

మగ సాధువులకు ఈ నిబంధన లేదు. ఇక గంజాయి సేవనానికి సహజంగా మహిళా సాధువులు కొంచెం దూరమే. కొద్దీ మంది ఈ అలవాటు ఉన్నవారు సేవిస్తుంటారు. మహిళా సాధువులు కాషాయ లేదా పసుపు వస్త్రాలు ధరించాలి.సాత్విక ఆహరం స్వీకరించాలి. నిత్యం పూజల్లో పాల్గొనాలి. ఆశ్రమ విధులను అనుసరిస్తూ జీవనం సాగించాలి. పదేళ్లు అలా దీక్ష గా ఉంటేనే నాగ సాధువుగా పరిగణిస్తారు.అలా ఉండలేక తిరిగి వెళ్ళిపోయినవారు కూడా ఉన్నారు. 

మొదటి నాగ మహిళ సాధువుపేరు కిలెమ్లా జమీర్..ఆమె పట్ట భద్రురాలు. శంకరాచార్య అకడా కూడా పెద్ద సమూహమే. జునా అకడా లో 10,000 మందికి పైగా మహిళా సాధువులు ఉన్నారు.. 2021లో మరో 200 మంది మహిళలు నాగ సాధువులు చేరారు.

నిరంజని అకడాలో దాదాపు 4,500 మంది,ఆవాహన్ అకడాలో దాదాపు 1,000 మంది…మహానిర్వాణి అకడాలో దాదాపు 300 మంది..ఆనంద్ అకడాలో దాదాపు 400 మంది ,అటల్ అకడాలో దాదాపు 200 మంది ఈ మధ్య కాలంలో చేరారు.( ప్రస్తుతానికి దొరికిన సమాచారాన్ని బట్టి ) ఈ మహిళా సాధువుల్లో బాగా చదువుకున్నవారు కూడా ఉన్నారని అంటారు. 

————— K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!