ఆ హాట్ వాటర్ మిస్టరీ ఏమిటో ?

Sharing is Caring...

ప్రకృతిలో మనల్ని అలరించే అందాలతోపాటు అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మన మేధకు అందని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి మిస్టరీలు కొన్నిఇప్పటికి అలాగే మిగిలిపోయాయి. ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వత శ్రేణిలో ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌ అనే ప్రాంతం లో వేడి నీటి చలమలు ఎక్కువగా ఉన్నాయి.

అక్కడ నిరంతరం వేడి నీరు ఉబికి వస్తుంది. వివిధ కారణాల వల్ల అక్కడ భూమిలోంచి వేడినీరు ఉబికి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు కానీ కారణాలు ఏమిటని తేల్చలేకపోయారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక తెగల ప్రజలు పరమ పవిత్రంగా భావించేవారు. ఇక్కడ కొచ్చి ఈ ప్రాంతంలో స్నానం చేసేవారు. ఇక్కడ నీటిలో స్నానం చేస్తే సర్వ రోగాలు నివారణ అవుతాయని నమ్మేవారు. ఇప్పటికి ఆ నమ్మకం కొనసాగుతున్నది.

ఇక్కడ నిత్యం 143 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎనిమిది లక్షల గాలన్ల నీరు బైటకు వస్తుంది. ఎన్నో పరిశోధనలు జరిగినా ఎందుకు అలా వేడి నీరు వస్తుందన్న విషయం అంతు చిక్కలేదు. ఎటువంటి జియోథర్మల్‌ యాక్టివిటీ లేకుండా నాలుగు వేల సంవత్సరాలుగా భూగర్భ పొరల్లోంచి నిరంతరాయంగా ఆ నీరు వెలువడుతోంది.

అది కూడా వడబోసిన నీరంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే  చల్లని నీటి గుండం కూడా ఉంది. దీన్ని స్లీపింగ్‌ వాటర్స్‌ అని పిలుస్తారు.  కొన్నివేల ఏళ్ళనుంచి ఇక్కడ  ఒక పక్కన వేడి నీళ్లు ఉబికి రావడం, మరో పక్క చల్లని నీటి సెలయేరు ఉండడం ఈ రెండూ రోగాల్ని నయం చేయడం అంతా ఒక మిస్టరీ.

ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని పక్కా పర్యాటక కేంద్రంగా మార్చివేసింది. ఇపుడు దీన్ని హాట్‌ స్ర్పింగ్‌ నేషనల్‌ పార్క్‌ అనే పేరుతో పిలుస్తున్నారు.గతంలో మాదిరిగా నేరుగా ప్రజలు వెళ్లి నీటి చలమల్లో స్నానం చేసే అవకాశం లేదు. ప్రయివేట్ భాగస్వామ్యంతో ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ వెలిసాయి.

వందలాది రూములున్న బాత్ హౌస్ లు వచ్చేసాయి. బాత్‌హౌస్‌లకు వేడినీరు సరఫరా అవుతుంది. పర్యాటకులు నేరుగా వెళ్లి రుసుము చెల్లించి బాత్ హౌస్ లో స్నానాలు చేయవచ్చు.అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ది అమెరికన్ స్పా అనే పేరుతో ప్రసిద్ధ రిసార్ట్ గా అభివృద్ధి చెందింది.

ఈ పార్కులో పర్వతాల మీదుగా రోడ్లు .. కాలిబాటలు ఉన్నాయి. ఈ పార్క్ ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ సహజ సిద్ధంగా వస్తోన్న నీటిని బాటిల్స్ ద్వారా కూడా విక్రయిస్తుంటారు. అదొక పెద్ద వ్యాపారంగా మారింది. ప్రస్తుతమిది పెద్ద టూరిస్ట్ కేంద్రం గా మారింది. అయితే ఆ వేడి నీటి చలమల మిస్టరీ ఏమిటో ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోయారు.

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!