అక్కడ పసికూనలతో చీకటి వ్యాపారం !

Sharing is Caring...

Laws should be strengthened ……………………..

పూణే, ముంబాయి,డిల్లీ లాంటి నగరాల్లోని వేశ్య వాటికల్లో రాక్షస రతిక్రీడలు జరుగుతుంటాయి. కరెన్సీ నోట్ల మధ్య శరీరాలు నలుగుతుంటాయి.పువ్వుల్లా అమ్మాయిలు వాడి పోతుంటారు. సాలెగూడు లాంటి గదుల్లో వారి బతుకులు తెలవారుతుంటాయి. మనసుకు గాయాలైనా శరీరం పరాధీనం చేయాల్సిందే. వారిది కడుపు నింపుకునే ప్రయత్నం… పడుపు వృత్తి ఓ మార్గం. 

నయవంచకుల చేతికి చిక్కి అంగడి బొమ్మల్లా అమ్ముడు పోతుంటారు.ఎందరో అమ్మాయిలు వేశ్యా వాటికలలో చిక్కుకుని మగ్గి పోతున్నారు.ఇలాంటి వేశ్యా వాటికలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లేకపోలేదు. కాకపోతే ఇక్కడ ఓ మాదిరి స్థాయిలోనే  వేశ్యా వాటికలు నడుస్తున్నాయి.

ముంబయి కామాఠిపురా లో వీధులకు వీధులే వ్యభిచార కేంద్రాలు.  వస్త్ర దుకాణాల షోకేస్‌లలో బొమ్మల్లాగా… వీధిలో తెల్లవారింది మొదలు, అర్ధరాత్రిదాకా ‘అమ్మాయిలు’ నిలువు కాళ్లపై బేరాలకోసం ఎదురు చూస్తుంటారు. చూపులతో కవ్వించేవారు, మాటలతో రెచ్చగొట్టే వారూ తారస పడతారు.

పండ్లు కొన్నంత ఈజీగా, బహిరంగంగా రోడ్లపైనే అక్కడ బేరసారాలు సాగుతుంటాయి. నిజానికి అక్కడో మినీ భారతం కనిపిస్తుంది. తమిళనాడు నుంచి కాశ్మీర్‌దాకా… ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలైనా కనిపిస్తారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ‌కు చెందిన వారు వేల సంఖ్యలో అన్నిచోట్లా ఉంటారు. వీరంతా వ్యభిచారంలో మగ్గి పోతున్నారు.

ఈ వేశ్యా వాటికల స్థాయి ఎలా ఉన్నా అందులోకి చేరే వారు  కొందరు దారి తప్పి వచ్చేవారు, దారి తప్పించగా వచ్చేవారు…ఇంకొందరు మోసపోయో,ప్రలోభానికి గురయ్యో, అపహరణకు  గురై కానీ  ఈ వాటికలకు చేరుతుంటారు. మరికొందరు యువతులు మోసగాళ్లు విసిరే ప్రేమవలలో పడి అమ్ముడవుతున్నారు.

ఒక్కో యువతి ధర రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది. 18 ఏళ్లలోపు చిన్న పిల్లలకు డిమాండ్ ఎక్కువ. మోసగాళ్ళ ఉచ్చులో చిక్కిన  అమాయక యువతులు వేశ్యలుగా మారుతున్నారు. నిజంగా ఒక్కొక్కరిది ఒక్కో బాధ.గాథ. లోతుకెళ్ళిచూస్తే మరోప్రపంచం కన్పిస్తుంది. కొందరికి వ్యభిచారం తప్పు కాదు.తండ్రి కూతురిని, భర్త భార్యను, తల్లి పిల్లలను, అక్కలు,చెల్లెళ్ళను వేశ్యా వాటికలకు అమ్మేసిన ఉదంతాలు కూడా కోకొల్లలు.

అందుకు కారణం పేదరికం, డబ్బులేని జబ్బు..కొందరు ఇష్ట పూర్వకంగానే వ్యభిచార వృత్తి లోకి వస్తుంటే మరికొందరు బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి నెట్టబడుతున్నారు. 11 ,12 ఏళ్ళ  చిన్నారులు కూడా సెక్స్వర్కర్స్ గా వున్నారంటే నమ్మ బుద్ధి కాదు.

పాలు గారే పసికూనల పైనే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. అమ్మాయిలను ఒక చోట నుంచి మరో చోటకు తరలిస్తుంటారు.పేదరికాన్నిఆసరా గా చేసుకొని ఉద్యోగం,ఉపాధి, పెళ్లి,ప్రేమ, సినిమాల్లో వేషాల పేరిట యుక్త వయసు బాలికలను వ్యభిచారం లోకి దించుతున్నారు.

ఇవాళ మన దేశం లో లక్షల సంఖ్యలో సెక్స్ వర్కర్లు వున్నారు.వీరిలో అధిక శాతం దగాపడ్డ వారే.ఆ దగా పడిన అమ్మాయిల వెతలు, వేదనలు,రోదనలు వింటే మనం ఇలాంటి ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది. కమలహాసన్ నటించిన ‘మహానది’ లో ఈ వేశ్యావాటికలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు. 

చట్టం ఏం చెబుతోంది …. 
@ వ్యభిచార గృహాల నిర్వహణ,పింపింగ్,వ్యవస్థీకృత వ్యభిచారం చట్టం ప్రకారం నేరం.
@ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి వ్యక్తులను ప్రలోభపెట్టడం చట్టవిరుద్ధం. @ వ్యభిచారం కోసం మైనర్‌ను అమ్మడం లేదా కొనడం చట్టవిరుద్ధం.@ వ్యభిచార గృహాన్నినడపడం లేదా దాని నిర్వహణలో సహాయం చేయడం చట్టవిరుద్ధం. @ పబ్లిక్ ప్లేస్ లో లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపిస్తే శిక్ష విధించవచ్చు.

@ సాధారణ కార్మిక చట్టాల ప్రకారం సెక్స్ వర్కర్లను చట్టం రక్షించదు. @ సెక్స్ వర్కర్లకు రక్షణ,పునరావాస హక్కు ఉంది.ప్రభుత్వాలు పునరావాసానికి నిధులు కేటాయించడానికి అంత ఆసక్తి చూపడం లేదు.
@ చట్టాలకు మరింత పదునుపెట్టాలి. పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాలి. ఒకప్పటితో పోలిస్తే ఇపుడు కొంత నయం. అయితే మరింత చురుగ్గా వ్యవహరించాలి.

——————-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!