ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అటు ఎన్నికల కమీషనర్ తీరు .. ఇటు మంత్రుల విమర్శలు శృతి మించి రాగాన పడుతున్నాయి. రెండు వర్గాల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అధికారులను మంచి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సిన కమీషనర్ తనకు నచ్చని అధికారులను తొలగించే కార్యక్రమం చేపట్టిన తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. అధికారుల తొలగింపే కాకుండా అభిశంసన కూడా కమీషనర్ చేపట్టారు. తాను చెప్పినట్టే చేయాలనీ … తానే సర్వాధికారి అన్నట్టు కమీషనర్ వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రభుత్వ పెద్దలకు నచ్చడంలేదు. సీనియర్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను, అంతకుముందు కొందరు అధికారులను తొలగించాలని సిపారసు చేసినప్పటినుంచి ప్రచ్ఛన్న యుద్ధం జోరు పెరిగింది. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ తీరును తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తూ మంత్రులు విమర్శల దాడి మొదలు పెట్టారు. నిమ్మగడ్డ కూడా ఈ విషయంపై గవర్నర్ కి లేఖ రాసారు. కాదంటే కోర్టుకి వెళతానంటున్నారు.
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న తనపై ఉన్నతస్థాయిలో ఉన్న కొంతమంది ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని నిమ్మగడ్డ ఫిర్యాదు లేఖ సారాంశం. సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి నిష్పాక్షికంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న తనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కమీషనర్ ఆరోపిస్తున్నారు. సజ్జలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను లేఖలో నిమ్మగడ్డ కోరారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ రాజకీయ కార్యక్రమాల్లో సజ్జల పాల్గొంటున్నారని నిమ్మగడ్డ తప్పుబట్టారు. నిమ్మగడ్డే మాజీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని సజ్జల అంటున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి,బొత్స లతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని… లక్ష్మణ రేఖను దాటారని నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా తనకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌పై నమ్మకం లేదని కూడా నిమ్మగడ్డ గవర్నర్ కు తేల్చి చెప్పారు.
మంత్రులు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన విషయంపై అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు . ఈ విషయంలో తనకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని…అయితే చివరి ప్రయత్నంగా తమ దృష్టికి తెస్తున్నట్టు గవర్నర్‌కు లేఖ రాశారు. నిమ్మగడ్డ ఇలా లేఖ రాయడం పై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. గవర్నర్ చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతానని బెదిరిస్తున్నట్టు కమీషనర్ లేఖ రాయడం ఏమిటని వైసీపీ నేతలు అంటున్నారు. మరి గవర్నర్ స్పందన ఎలాఉంటుందో చూడాలి. గతంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎపుడూ కమీషనర్లు ఇలా రచ్చకెక్కలేదు. ఈ మొత్తం పంచాయితీ ఎన్నికల ఎపిసోడ్ లో తప్పు ఎవరిది ? ఒప్పు ఎవరిది ? అనే విషయం పక్కన బెడితే ఆధిపత్య ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. సామరస్య పూర్వకంగా ఉంటూ ప్రభుత్వ సహకారం తో ఎన్నికలు నిర్వహించాలన్న ధోరణి కమీషనర్ కి ఉన్నట్టు కనిపించడం లేదు. అధికారుల చర్యలకు సిఫారసు చేసినప్పటినుంచి రచ్చ మొదలైంది. ఈ రచ్చ .. రభస ఆగే సూచనలు అయితే కనబడటం లేదు. ప్రజల్లో కొంతమంది ఈవ్యవహారాన్ని వినోద కార్యక్రమం గా చూస్తుంటే .. మరికొందరు విస్తుపోతున్నారు. ఇపుడు గవర్నర్ ఏమి చేస్తారా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
—————-KNM