సార్ .. విష్ చేసే స్టయిల్ మార్చారా ?

Sharing is Caring...

తెలుగు దేశం పార్టీ అధినేత ఇటీవల ప్రజలను ,కార్యకర్తలను విష్ చేసే విధానం మార్చారు.  గతంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కనిపిస్తే వారికి రెండు వేళ్లతో విక్టరీ సంకేతం చూపటం కొన్ని ఏళ్లుగా  చంద్రబాబు కున్న అలవాటు. అయితే  2012 లో   ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఆ విక్టరీ గుర్తును వదిలిపెట్టేశారు. చక్కగా సంప్రదాయ పద్ధతిలో అందరికీ నమస్కారం పెడుతూ ముందుకు సాగారు. పాదయాత్ర తొలిరోజే ఈ మార్పును చూపించి పార్టీ వర్గాలను కూడా ఆయన అప్పట్లో విస్మయానికి గురి చేశారు. చంద్రబాబు ఈ విక్టరీ సంకేతాన్ని చూపించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇందిరా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల గుర్తుగా హస్తం అలాట్  తర్వాత దానిని స్ఫురింపజేసేలా ఆ పార్టీ నేతలు అరచేతిని ఊపేవారు. ఆ పార్టీకి ప్రత్యర్థిగా పుట్టిన టీడీపీ నేతలకు దానికి భిన్నంగా ప్రజలకు ఎలా అభివాదం చేయాలన్నది అప్పట్లో పెద్ద సమస్యగా ఉండేది.

తమిళనాడు కి పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన బాబు ఈ విషయంలో తమిళ నేతలను  ఆదర్శంగా తీసుకొన్నారని అంటారు. అక్కడ జయలలిత పార్టీ అన్నాడీఎంకే గుర్తు రెండాకులు. దానికి గుర్తుగా జయలలిత మొదలుకొని ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లినా రెండు వేళ్లు చూపించేవారు. హస్తానికి ప్రత్యామ్నాయంగా ఇది బాగుందనుకొని బాబు కూడా అదే పద్ధతిని తానూ పాటించడం మొదలు పెట్టారు. ఇక్కడ దానికి విక్టరీ సంకేతంగా పేరు పెట్టారు.

సీఎంగా ఉన్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నా బాబు   విష్ చేసే సింబల్‌ ‘వి’గా స్థిరపడిపోయింది. కానీ, తొలిసారిగా తన పాదయాత్రలో బాబు విక్టరీ సంకేతాన్ని పక్కనపెట్టారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్నపుడు విక్టరీ సంకేతం చూపించడం సరైంది కాదని, దాని బదులు చక్కగా నమస్కారం చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించారు. బాబు  ఆ సూచనను వెంటనే ఆచరించి చూపించారు. తొలిరోజు పాదయాత్రలో పార్టీ నేతలు, సాధారణ ప్రజలు అలవాటు కొద్దీ ఆయనకు విక్టరీ సంకేతాన్ని చూపిస్తున్నా బాబు మాత్రం వారికి నమస్కారం పెడుతూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు.  ఆ తర్వాత సీఎం అయ్యాక  కూడా తన పర్యటనల్లో బాబు రెండు వేళ్ళు చూపుతూ ప్రజలను విష్ చేసే వారు.  ఇటీవల  విగ్రహాల ధ్వంసం  నేపథ్యంలో  విజయనగరం జిల్లా పర్యటనలో మళ్ళీ ఆయన తన స్టైల్ మార్చేశారు. రెండు వేళ్ళు చూపించేందుకు బదులుగా బొటన వ్రేలు ను చూపుతూ ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం  చేశారు. హఠాత్తుగా  ఈ మార్పు ఏమిటో పార్టీ నేతలకు కార్యకర్తలకు అర్ధం కాలేదు. అసలు కొత్త స్టైల్ కి అర్ధం ఏమిటో ?ఇక ముందు కూడా అదే స్టైల్ కొనసాగిస్తారా ? మళ్ళీ మారుస్తారో చూడాలి . 

————– KNM  
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!