హొయలు పోయే ఆ మదనికలను చూసారా ?

Sharing is Caring...

Sheik Sadiq Ali

సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును,అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందే.

ఆ ఆలయం ఎలా వుంటుందో తెలుసా? శంకరాభరణం సినిమాలోని” రాగం తానం పల్లవి,నా మదిలోన కదలాడి కడతేరమన్నవి …: పాట గుర్తుందా?ఆ పాటను బేలురులోనే చిత్రీకరించారు. ఆ పాటలో మంజుభార్గవి మెరుపుతీగలా నర్తిస్తుందే…అచ్చం ఆ మెరుపు తీగలానే వుంటుంది.  అక్కడున్న ఒక్కో మదనిక.వాటికి తోడు పక్కనే రతీమన్మధులు. భక్తిలో రక్తి,రక్తిలో ముక్తి. అన్నీ కలిస్తే బేలూరు. ఈ ఆలయవిశేషాలు …పుట్టు పూర్వోత్తరాలు, పనిలో పనిగా మన అమరశిల్పి జక్కన్న కథ కూడా తెలుసుకుందామా?

కర్ణాటక లోని మిగిలిన ఆలయాలతో పోలిస్తే బేలూరులోని చెన్నకేశవస్వామి ఆలయం కాస్త భిన్నంగా కన్పిస్తుంది. క్రీస్తుశకం 1116 సంవత్సరంలో చోళులతో జరిగిన తలకాడ్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత 1117 సంవత్సరంలో విష్ణువర్ధనుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. అలా మొదలైన ఆలయం 18 వ శతాబ్దం వరకు క్రమక్రమంగా పలురకాలుగా అభివృద్ధి చెందింది.

ఇక్కడ కొలువైన దేవుడు చెన్నకేశవస్వామి.చెన్న అంటే అందమైన అని అర్ధం. అందమైన ఈ కేశవుడు మహావిష్ణువు 24 అవతారాలలో ఒకటైన మోహినీ అవతారంలో పట్టుచీర, ముక్కు పుడక, పూలను పెట్టుకున్న రూపంలో అలంకరించుకొని ఉంటాడు.ఆరు అడుగుల ఎత్తు,నాలుగు చేతులు,ఆచేతుల్లో శంఖు,చక్ర,గద,పద్మం వుంటాయి.చిత్రమైన కాంబినేషన్ కదూ.ఈ కేశవున్నే విజయనారాయణ అని కూడా పిలుస్తారు.

ఈ విగ్రహం చుట్టూ విష్ణువు అన్ని అవతారాలను సుందరశిల్పాలుగా చెక్కారు.స్వామికి ఇరువైపులా చిన్న ప్రమాణంలో ప్రియ సతులైన శ్రీదేవి,భూదేవి ప్రతిమలను స్థాపించారు. అప్పటివరకూ జైనమతాన్ని అనుసరించిన విష్ణువర్ధనుడు రామానుజాచార్యుల బోధనలతో వైష్ణవాన్ని స్వీకరించాడు.దాంతో ఈ ఆలయ నిర్మాణంలో వైష్ణవాలయ పోకడలు చాలా ఎక్కువగా కన్పిస్తాయి.అక్కడ లభించిన 118 శాసనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

దీనిని హోయసలులు నిర్మించినప్పటికీ ,శిల్పంలో శైలిలో మాత్రం పశ్చిమ చాళుక్యుల ముద్ర అంతర్లీనంగా కనిపిస్తూనే వుంది.తాత మొదలుపెట్టిన ఆలయ నిర్మాణాన్ని మనవడు వీరబల్లాల పూర్తి  చేశాడు.ఇది పూర్తవ్వడానికి మొత్తం 103 ఏళ్ళు పట్టింది.ఈ ఆలయానికి మొత్తం మూడు ద్వారాలు వుంటాయి.ప్రధాన ద్వారం వద్ద వున్న గోపురం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మితమైంది.

ద్వారం దాటి లోపలికి ప్రవేశిస్తే మధ్యలో తూర్పుముఖంగా చెన్నకేశవ ఆలయం వుంటుంది. దానికి కుడివైపున కప్పెచన్నిగారాయ మందిరం,కొంచెం వెనుకగా సౌమ్య నాయకి (లక్ష్మీదేవి)మందిరం ,ఎడమవైపున రంగనాయకి (ఆండాళ్) మందిరం వుంటాయి. ఇక్కడే రెండు పెద్ద పెద్ద స్థంబాలు వుంటాయి.ఒకటి గరుడ స్థంభం,రెండోది దీప స్థంభం. మధ్య యుగం నాటి శిల్పులతో పోలిస్తే ,హోయసల శిల్పులకు స్పృహ ఎక్కువ.

వారు మందిర నిర్మాణంలోనే తమ పేర్లు,వంశచరిత్రను నిక్షిప్తం చేసి తమ సంతకాన్ని ప్రపంచానికి తెలియచేశారు. ఈ ఆలయంలో చెక్కిన శిల్పాలలో 40 మల్లితమ్మ అనే శిల్పి చెక్కినవే.అలాగే దాసోజ,అతని కుమారుడు చవన చెక్కిన శిల్పాలు కూడా ప్రధానమైనవే. మదనికల శిల్పాలలో అత్యధిక భాగం ఈ తండ్రీకొడుకులు చెక్కినవే.

మల్లియన్న,నాగోజ అనే శిల్పులు జంతువులూ,పక్షుల శిల్పాలు చెక్కగా,మంటపం లోని అనేక శిల్పాలను చిక్క హంప మల్లోజ తదితర శిల్పులు చెక్కారు. అమరశిల్పి జక్కన్న కు సంబంధించి ఒక గొప్ప కథ ప్రచారం లో వుంది.జక్కనా చారి తన స్వగ్రామమైన క్రీదాపుర (కైదల) వదిలి దేశపర్యటన చేస్తూ బెలూరుకు చేరుకొని దేవస్థాన నిర్మాణ కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.

అతని కుమారుడైన డంకన చారి తన తండ్రిని చూడకుండా పెద్దవాడై మంచి శిల్పిగా ఎదిగి బేలూరు కు చేరు కుంటాడు.అయితే అక్కడ విగ్రహాలు చెక్కుతున్న గోప్పశిల్పి జక్కన్న తనతండ్రి అని అతనికి తెలియదు.అలా జక్కన్న ఒక దేవుని విగ్రహం చెక్కుతుండగా డంకణాచారి ఆ విగ్రహం లో ఒక లోపం వుందని చెప్తాడు.అయితే అందులో ఎలాంటి లోపమూ లేదనీ,ఎవరైనా లోపం చూపిస్తే చేతిని నరుకుంటానని  జక్కన్న శపథం చేస్తాడు.

ఇక అర్చకులు పరీక్ష మొదలెడతారు.విగ్రహానికి చుట్టూ గంధాన్ని పూసి ఆరబెడతారు.చివరకు గంధం మొత్తం ఎండినా లోపం వున్న చోట మాత్రం ఎండదు.అక్కడ పగల కొడితే కొంచెం నీరు,అందులోంచి జీవం వున్న ఒక కప్ప బయట పడతాయి. దీంతో ఆ దేవతామూర్తికి “కప్పెచన్నగారాయ “ అనే పేరు వచ్చింది.దాంతో శపథం చేసిన జక్కన తన చేతిని నరుక్కుంటాడు. డంకన తన కొడుకని తెలుసు కుంటాడు.

ఆ తర్వాత తండ్రీకొడుకులిద్దరూ తమ స్వగ్రామమైన కైదాల వచ్చి అక్కడో చెన్నకేశవ స్వామి మూర్తి ని చెక్కుతారు.ఆలయ నిర్మాణం అయ్యాక జక్కన్నకు నరుక్కున్న చెయ్యి మళ్ళీ వచ్చిందని చెప్తారు. తుంకూరు కు తొమ్మిది కిలోమీటర్ల మీటర్ల దూరంలో వున్న కైదల లో ఇప్పటికీ ఆ ఆలయం వుంది.కొన్ని స్వచ్చంద సంస్థలు ఆ ఆలయ పరిరక్షణ,పునరుద్ధరణకు నానా తిప్పలు పడుతున్నాయి.అమరశిల్పి జక్కన్నను ప్రేమించేవాళ్ళు ఆ సంస్థలకు సాయం చెయ్యొచ్చు.

చివరిగా చిన్న మాట….జక్కన్న కథతో స్ఫూర్తి పొంది 1964 వ సంవత్సరంలో తెలుగులో అక్కినేనినాగేశ్వరరావు,బి.సరోజాదేవి హీరో హీరోయిన్లు గాను, కన్నడం లో కళ్యాణ్ కుమార్ హీరో గానూ అమరశిల్పి జక్కన సినిమాలు వచ్చాయి..సూపర్ హిట్ అయ్యాయి.“ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో …:పాట ఆ సినిమాలోనిదే. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!