Revenge drama ………
ఐ యామ్ గేమ్’ (I’m Game – 2026) సూపర్ నేచురల్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆర్డిఎక్స్ (RDX) ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు.
కథ ఏమిటంటే ?
డేన్ జాన్ (దుల్కర్ సల్మాన్) క్రికెట్ బెట్టింగ్, జూదాలకు బానిసైన ఒక సంపన్న యువకుడు. ఒక భారీ బెట్టింగ్ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను తన కుడి చేతిని కోల్పోతాడు. ఆ తర్వాత అతనికి వేరే వ్యక్తి చేతిని (Hand Transplant) అమరుస్తారు.
అయితే ఆ కొత్త చెయ్యి డేన్ నియంత్రణలో లేకుండా తనంతట తానుగా స్పందిస్తూ డేవిడ్ (మిస్కిన్) అనే వ్యక్తిపై దాడికి దిగుతుంది. అసలు ఆ చెయ్యి ఎవరిది, దాని వెనుక ఉన్న ప్రతీకార కథ ఏమిటన్నది మిగతా సినిమా.
స్వార్థపరుడైన జూదరిగా, ఆ తర్వాత ఊహించని పరిస్థితుల్లో చిక్కుకున్న యువకుడిగా దుల్కర్ తన స్టైలిష్ నటనతో సినిమాను ఒంటిచేత్తో నడిపించారు.హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత తన చెయ్యి తన మాట వినక భయపడే యువకుడిగా దుల్కర్ అద్భుతంగా నటించారు.
ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ ఈ చిత్రంతో మలయాళంలో నటుడిగా అరంగేట్రం చేశారు. క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా, ప్రతినాయకుడిగా ఆయన తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సినిమా అంతా మిస్కిన్ నటన హుందాగా ఉన్నప్పటికీ, క్లైమాక్స్ సన్నివేశాల్లో మాత్రం కాస్త ఓవర్ అనిపిస్తుంది.
హీరోయిన్ ఇషా పాత్రలో కయాదు లోహర్ తెరపై చాలా అందంగా కనిపించారు. అయితే కథలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, ఉన్నంతలో పరిధి మేరకు చక్కగా నటించారు.తారిణి అనే కీలక పాత్రలో సంయుక్త విశ్వనాథన్ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటనతో మార్కులు కొట్టేసింది.
హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ చుట్టూ అల్లిన సూపర్ నేచురల్ పాయింట్ ఆసక్తికరంగా మొదలవుతుంది. కార్ ఛేజింగ్ సీన్, ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చాలా స్టైలిష్‌గా చిత్రీకరించారు.తన కొత్త చెయ్యి తన మాట వినకుండా వింతగా ప్రవర్తించడాన్ని చూసి డేన్ (దుల్కర్ సల్మాన్) భయపడటం, ఆ చేతిని నియంత్రించడానికి ప్రయత్నించే సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ సన్నివేశాన్ని దర్శకుడు నహాస్ హిదాయత్ సూపర్ నేచురల్ హారర్ టచ్‌తో ఎంతో స్టైలిష్‌గా చిత్రీకరించారు. ఇది సినిమాలోనే పీక్ మూమెంట్‌గా నిలిచింది.ఇంటర్వెల్ వరకు ఎంతో కొత్తగా సాగిన కథ,సెకండాఫ్‌లోకి అడుగుపెట్టాక ఒక సాధారణ, పాతకాలపు రివేంజ్ డ్రామాగా మారిపోతుంది.
దాదాపు 174 నిమిషాల నిడివి ఉండటం వల్ల కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. నిడివి తగ్గించి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.
హీరోయిన్లు కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్ పాత్రలకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్లైమాక్స్ కూడా ఊహకందేలా సాధారణంగా ముగుస్తుంది.క్రికెట్ బెట్టింగ్స్ వెనుక ఏం జరుగుతుందో అన్న అంశాలను స్క్రీన్ పై బాగా చూపారు.
సినిమా ప్రారంభ భాగాల్లో క్రికెట్ బెట్టింగ్ అప్పుల నేపథ్యంలో వచ్చే కార్ ఛేజింగ్ సన్నివేశాన్ని జిమ్షీ ఖలీద్ తన కెమెరా పనితనంతో చాలా వేగంగా, అద్భుతంగా చిత్రీకరించారు. ఒంటిచేతి ఫైట్ సన్నివేశాలు కొత్తగా ఉండి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.యాక్షన్, ఛేజింగ్ సీన్లు. ఇంటర్వెల్ ముందు వచ్చే సూపర్ నేచురల్ యాక్షన్ ఎపిసోడ్స్నుఎంతో వేగంగా, పాలిష్డ్ లుక్‌తో చిత్రీకరించారు.
కథనంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన సాంకేతిక బలాలుగా నిలిచాయి. వీరిద్దరి పనితనం సినిమాకు ఒక స్టైలిష్,మాస్ రిచ్ లుక్‌ను అందించింది.
జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలోని కీలక సన్నివేశాలను, ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ,యాక్షన్ బ్లాక్‌లను మరో స్థాయికి తీసుకెళ్లింది. చేయి తనంతట తానుగా స్పందించే హారర్-థ్రిల్లర్ సన్నివేశాల్లో ఉత్కంఠను పెంచడానికి ఆయన ఇచ్చిన సౌండ్ డిజైన్ బాగా పనిచేసింది.
దుల్కర్ సల్మాన్ అభిమానులకు,యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి నచ్చుతుంది. ప్రస్తుతం హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

